వైఎస్సార్‌తోనే..కాలంబోయింది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌తోనే..కాలంబోయింది!

వైఎస్సార్‌తోనే..కాలంబోయింది!

Written By news on Friday, December 7, 2012 | 12/07/2012

వైఎస్ ఉన్నప్పుడు రైతులకు ఢోకా ఉండేది కాదు 
మూడేళ్ల నుంచి పంటలు ఇంటికి రావడం లేదు
కరెంటు రెండు గంటలు వస్తే మూడు గంటలు పోతోంది 
అన్ని ధరలూ పెరిగి అప్పుల పాలయ్యా
జనాన్ని ప్రభుత్వం, విపక్ష నేత గాలికొదిలేశారు: షర్మిల 
బాబు అవిశ్వాసం పెట్టకుండా డ్రామాలాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 50, కిలోమీటర్లు: 705.30


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు మా ఊర్లె సీతారెడ్డి, శంకరయ్య, వెంకటమ్మ ముగ్గురు పత్తి రైతులు పురుగుల మందు తాగి చనిపోయిండ్రు. వైఎస్ అప్పుడు ప్రతిపక్షంల ఉండె. మా ఊరికి వచ్చి సచ్చిపోయినోళ్ల కుటుంబాలకు సాయం చేసిండు. మళ్లా వైఎస్ ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఉన్నన్ని దినాలు రైతుకు ఢోకా లేదు. వైఎస్సార్‌తోనే కాలంబోయింది. మూడేళ్ల నుంచి పంటలు ఇంటికి రాలే. కరెంటు రెండు గంటలొస్తే మూడు గంటలు పోతది. కరెంటు ఆగిఆగి వస్తే మడి తడుస్తదా? ఏసిన పంట ఏసినట్టు ఎండిపోయింది. ఎరువులు, ఇత్తనాలు అన్ని ధరలు పెరిగి అప్పుల పాలైనం. మా పక్క పల్లె రైతు అప్పుల పాలై ఉరేసుకొని సచ్చిపోయిండు. ఎవ్వరు రాలె. ముఖ్యమంత్రి రాలేదు. మంత్రు లు రాలేదు. చంద్రబాబునాయుడన్నా వచ్చి సూడలేదు..’’ 

- మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన మహిళా రైతులు రాకేలమ్మ, మాధవిల ఆవేదన ఇదీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ముందు గురువారం వీరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరే కాదు.. పాలమూరు జిల్లాలో ఏ పల్లెలో ఎవరిని పలకరించినా తమ వెతలు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఒక్క నేత కూడా తమవైపు కన్నెత్తి చూడడం లేదని చెబుతున్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర గంగాపూర్, గొప్లాపూర్, లింగంపేట, కోడుగల్ మీదుగా కొండేడు గ్రామానికి చేరింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లింగంపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళి అర్పించారు. పాదయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా స్థానికులు తమ సమస్యలను షర్మిలతో చెప్పుకున్నారు.

బియ్యం రేటు తగ్గించి.. అన్నీ పెంచారు!

‘‘రూపాయకు కిలో బియ్యం అన్నరు. 20 కిలోలిచ్చే బియ్యాన్ని 15 కిలోలే ఇస్తున్రు. ఇచ్చే బియ్యమన్నా మంచియా? పురుగు పట్టిన బియ్యం.. ముక్కిన బియ్యం ఇత్తన్నరు. బియ్యంకు తగ్గిచ్చినం అని చెప్పుకుంటనే పామాయిల్ మీద రూ.5 పెంచిరి. మంచినూనె కొనబోతె రూ 100, కందిపప్పుకు రూ.70, ఉప్పు, సింతపండు.. ఇలా అన్ని ధరలు పెంచిరి. మంత్రి శ్రీధర్‌బాబు గారేమో అందరికీ బియ్యం మంచిగ ఇత్తున్నమని టీవీలల్లా చెప్తరు. ఆ సార్ మా ఊరికొచ్చి చూస్తే మా బాధలు తెలుస్తాయి’’ అని జడ్చర్ల మండలంలోని కుర్వగడ్డకు చెందిన మాధవి, రుక్మిణి షర్మిలతో అన్నారు. బీఈడీ విద్యార్థులు తమ కష్టాలను చెప్పుకుంటూ...‘‘ఏడు లక్షల మంది బీఈడీ అభ్యర్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఇంతమంది ఉసురు పోసుకున్న వీళ్లు ఊరికే పోరు. విద్యాశాఖ మంత్రికి కోర్టు కేసులు తప్పించుకోవడానికి, మంత్రి పదవి కాపాడు కోవడానికే టైం సరిపోవడం లేదు. ఇంకా మా భవిష్యత్తు గురించి ఆయనే నిర్ణయం తీసుకుంటారు..’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ అమలు చేశారు..

లింగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం షర్మిల జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘అంబేద్కర్ పేరు వినగానే మనకు భారత రాజ్యాంగం గుర్తుకు వస్తుంది. మనుషుల మధ్య అంతరాలు.. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్న ఆయన ఆశయం గుర్తుకు వస్తుంది. అంతకుమించి హక్కులు గుర్తుకు వస్తాయి. హక్కులతోపాటు అంబేద్కర్ ఆదేశ సూత్రాలను కూడా ఇచ్చారు. ఆ మహనీయుడి ఆలోచనలను అమలు చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి వ్యక్తికి విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందుబాటులో ఉండాలి. అంబేద్కర్ ఆలోచనలను త్రికరణశుద్ధిగా అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్సార్ ’’ అని ఆమె అన్నారు. ‘‘నాయకుడంటే ప్రజల్లోంచి పుట్టాలి.. ప్రజల కోసం ఆలోచించాలి. పన్నుల భారం లేకుండా సుపరిపాలన అందించాలి. కానీ ఇప్పటి పాలకులు ప్రజలను.. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ప్రజలు ఏమైపోతే మాకేంటి.. అని అనుకుంటున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు అదే ప్రభుత్వంతో కుమ్మక్కై డ్రామాలాడుతున్నారు’’ అని మండిపడ్డారు.

తనతో నడుస్తున్నవారితో మాటా ముచ్చట..

ప్రజా ప్రస్థానం పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా షర్మిల ఓ పాపతో కేక్ కట్ చేయించారు. గురువారం మొత్తం 18.70 కిలోమీటర్ల దూరం నడిచారు. రాత్రి కొండేడులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇడుపులపాయ నుంచి తనతో నడుస్తున్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. వాళ్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 705.30 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

sakshi
Share this article :

0 comments: