ఆరోగ్యశ్రీ కిరణ్‌కు అశ్రు తర్పణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోగ్యశ్రీ కిరణ్‌కు అశ్రు తర్పణం

ఆరోగ్యశ్రీ కిరణ్‌కు అశ్రు తర్పణం

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి పాలిచెర్ల కిరణ్‌కుమార్ రెడ్డి గొప్ప మానవతా వాది, స్నేహశీలి, కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకం అందించిన మహనీయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులర్పించారు. క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన కిరణ్ సంతాప సభ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సభలో కిరణ్ అంకిత భావాన్ని, సేవా నిరతిని పలువురు నేతలు కొనియాడుతూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 

ఎం.పి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే కిరణ్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. కోవూరు, నెల్లూరు ఉప ఎన్నికల్లో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైందన్నారు. లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన వ్యక్తి అర్థాయుష్సుతో మరణించడం కలచి వేస్తోందని అన్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కిరణ్ ఏ పనైనా ఒక క్రమ పద్ధతిలో చేసే వారని బహుశా ఆయనకు ఆ లక్షణం తల్లి పెంపకం వల్ల వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన లేక పోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీలో తెర ముందుండి పనిచేసే వారు కొందరుంటే ఏ మాత్రం అధికార కాంక్ష లేకుండా తెర వెనుక ఉండి పనిచేసే వారిలో కిరణ్ ఒకరని సజ్జల అన్నారు. ఏదైనా ఒక పనిపై దృష్టి పెడితే దానిని చివరి వరకూ వదలని వ్యక్తి కిరణ్ అనీ ఒక నిజాయితీపరుడిని తాము కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు మాట్లాడుతూ పేదల పట్ల నిజమైన కరుణామయుడు కిరణ్ అని శ్లాఘించారు. ఆస్ప్రో, అనాసిన్ వంటి మాత్రలను కూడా కొనలేని నిరుపేదలకు ఖరీదైన ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా చేసిన వ్యక్తి కిరణ్ అని ఆయన అన్నారు. పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ వైఎస్సార్ అడుగుజాడల్లో నడచిన వ్యక్తి వాడు కిరణ్ అని పేర్కొన్నారు. నాగదేశి రవికుమార్, మేడపాటి వెంకట్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కిరణ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎక్కడో ఒక చోట ప్రతిష్టించాలని సూచించారు. కిరణ్ ద్వారా గతంలో ప్రభుత్వ సహకారం పొందిన యాసిడ్ బాధితురాలు అరుణ టెలిఫోన్ ద్వారా వ్యక్తం చేసిన సంతాపాన్ని పార్టీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సభకు తెలియజేశారు.

మాతృ విలాపం
కిరణ్ తల్లి 74 ఏళ్ల లీలా చంద్రారెడ్డి ‘నీవు లేని మాట నిజమా...నాన్నా కిరణ్... ఇది జోల పాటు కాదురా తండ్రీ! జోహార్,జోహార్ అని పలవరించే అంతిమ గీతిక’ అంటూ గద్గద స్వరంతో చదివిన కవిత అందరినీ కంట తడి పెట్టించింది. కుమార్తె ఐక్య ‘తల్లి ఒడిలో ఆడుకోరా హాయిగా కన్నా...’ అని పాడిన పాట కూడా కలచి వేసింది. మేనకోడలు దివ్యదీప్తి మాట్లాడుతూ తన మేనమామ మృత్యువుకు సమీపిస్తున్న తరుణంలో కూడా ఆసుపత్రిలో షర్మిల పాదయాత్ర ఎలా సాగుతోందో, జగన్ జైలులో ఎలా ఉన్నాడో అని ఆరా తీసే వారని కన్నీటి పర్యంతమై చెప్పారు. 

పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ నిర్వహించిన ఈ సంతాప సభలో మాజీ మంత్రి ఎం.మారెప్ప, గట్టు రామచంద్రరావు, బి.జనార్థన్‌రెడ్డి, వి.ఎల్.ఎన్.రెడ్డి, కె.శివకుమార్, వంగపండు ఉష, నాగిరెడ్డి (లీగల్ సెల్) ప్రసంగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి దశదినకర్మ జనవరి 5వ తేదీన మణికొండ సమీపంలోని అల్కాపురి వద్ద ఆయన స్వగృహంలో జరుగుతుందని జనక్ ప్రసాద్ ప్రకటించి అందరూ హాజరు కావాలని కోరారు. 
Share this article :

0 comments: