హెరిటేజ్‌తో విజయా డెయిరీకి పాతరేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హెరిటేజ్‌తో విజయా డెయిరీకి పాతరేశారు

హెరిటేజ్‌తో విజయా డెయిరీకి పాతరేశారు

Written By news on Wednesday, December 12, 2012 | 12/12/2012



హెరిటేజ్‌తో చంద్రబాబు చిత్తూరులో విజయా డెయిరీకి పాతరేశారు
ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతీయాలని చూస్తోంది


టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేయడానికే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం విజయా డెయిరీని భూస్థాపితం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారిద్దరూ మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెలకు మూడు రోజుల పాటు పాలు సేకరించకూడదని తొలుత విజయా డెయిరీ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఇదేనన్నారు. ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో దీనిని మళ్లీ ఉపసంహరించుకున్నారని వారన్నారు. ఆరు నెలల్లో రెండుసార్లు విజయా పాల సేకరణ ధరను 3 రూపాయల మేరకు తగ్గించి, 4 రూపాయల చొప్పున అమ్మకం ధరను పెంచడం వెనుక కుట్ర కూడా ఇదేనని వారు దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు హెరిటేజ్ డెయిరీని స్థాపించి చిత్తూరులో ఆదర్శంగా ఉన్న విజయా డెయిరీకి పాతర వేశారని, ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తీసే యత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

పశుక్రాంతికి తూట్లు..

వ్యవసాయ రంగానికి మద్దతుగా పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పశుక్రాంతి పథకానికి ప్రభుత్వం ఇపుడు తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల సేకరణ ధర కూడా 14 నుంచి 15 రూపాయల వరకే ఉందని, తక్షణం ఈ ధరను కనీసం 20 నుంచి 22 రూపాయలకు పెంచాలని వారు కోరారు. టీటీడీకి రోజుకు 4 వేల లీటర్ల పాలు అవసరమైతే 2 వేల లీటర్లు సొంతంగా సమకూర్చుకుంటోందని, మిగతావి ప్రైవేటు డెయిరీల నుంచి తీసుకుంటోందని, అలాంటపుడు విజయా నుంచే వారికి సరఫరా అయ్యేలా చూస్తే మంచిది కదా అని ఎమ్మెల్యేలు సలహా ఇచ్చారు. టీటీడీకి కావాల్సిన నెయ్యి కూడా కర్ణాటక నుంచి వస్తోందని, రాష్ట్రంలోని అదనపు పాలను సేకరించి వాటి ద్వారా వచ్చే నెయ్యిని విజయా నుంచే టీటీడీకి ఇవ్వొచ్చు కదా అని వారన్నారు.

అన్నీ హాలిడేలే..

‘‘ఈ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ఫీజుల పథకం అందక విద్యార్థులు తమ చదువుల హాలిడే తీసుకుంటున్నారు. విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు హాలిడే లు ప్రకటిస్తున్నాయి. అంతో ఇంతో రైతులను ఆదుకుంటున్న పాడి పరిశ్రమకు కూడా ఈ ప్రభుత్వం మిల్క్ హాలిడే ప్రకటించాలని భావిస్తోంది. ఇవన్నీ చూసి విసుగెత్తిన రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి ఎపుడెపుడు హాలిడే(సెలవు) ప్రకటిద్దామా అని ఎదురు చూస్తున్నారు’’ అని ఎమ్మెల్యేలు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లానుకు చట్టబద్ధత కల్పించే చట్టం ఆమోదానికి శాసనసభా సమావేశాలు నిర్వహిస్తే తాము సహకరించామని, అపుడు జరిగిన బీఏసీ సమావేశంలో పది రోజుల పాటు సమావేశాలు మళ్లీ నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫున వెల్లడించారని ఎమ్మెల్యేలు చెప్పారు. తీరా ఇపుడు సమావేశాలు లేవని చెబుతున్నారని వారు విమర్శించారు. అసలు ప్రజా సమస్యలంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది? సమావేశాల కోసం నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? అని వారు ప్రశ్నించారు. బహుశా ఇది కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు ఫలితం కావచ్చని పేర్కొన్నారు



Share this article :

0 comments: