బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర

బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర
నిమ్మగడ్డ ప్రసాద్ సలహాదారు వాంగ్మూలమంటూ ‘ఈనాడు’ శివాలు


ఏదో ఒక అంశాన్ని తీసుకుని సంచలనం సృష్టించేందుకు ప్రయత్నం
గతంలోనే ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సమయం చూసి రంగులు
వాన్‌పిక్ పోర్టు ప్రతిపాదన బాబుదే... స్కోడాకు అప్పగించిందీ ఆయనే
అది అమలు చేసే పరిస్థితి లేకపోవటంతో రాక్‌కు అప్పగింత
రాక్‌తో ఒప్పందం కుదిరింది 2008 మార్చిలో 
నిమ్మగడ్డ మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం అప్పటికే జగతి, భారతిలోకి
ఆ తరవాత 2009 సెప్టెంబర్లో వైఎస్సార్ మరణం
ఆయన మరణించాక మరో 55 శాతం పెట్టుబడులు పెట్టిన ప్రసాద్
అప్పటికే దేశంలో అగ్రగామి పత్రికగా నిలదొక్కుకున్న ‘సాక్షి‘
ఆ సమయంలో కూడా మొదట కొన్న రేటుకే షేర్లు కొన్న ప్రసాద్
మంచి ధరకు రావటంతో సాక్షిలో వాటా పెంచుకునే ప్రయత్నం
దాన్ని ఇప్పటికీ సహించలేకపోతున్న చంద్రబాబు, ఈనాడు
కాంగ్రెస్ ప్రభుత్వాలు తోడు రావటంతో రెచ్చిపోతూ రాతలు
బెయిలుపై విచారణ జరుగుతుండటం వల్లే రంగంలోకి ఏసీబీ?
సూరీడుపై దాడుల్ని వైఎస్సార్‌కు లింకు పెడుతూ ఎల్లో కథనాలు
సూరీడు కాంగ్రెస్ పెద్దలతో తిరుగుతున్న సంగతి కావాలనే పక్కకు
వైఎస్సార్ మరణించి మూడేళ్లు దాటినా ఆయనకే అంటగట్టే కుయత్నాలు
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎల్లో సిండికేట్

అరె!! ప్రతిసారీ ఇదేనా? ఒక్క వ్యక్తిపై ఇంత మంది కుట్రలా? ఒక వ్యక్తికి బెయిలు రాకుండా చేయటానికి ఇన్ని కుట్రలు పన్నాలా? ఆయన జైల్లోంచి బయటకు వస్తారనే భయంతో ఇన్నిన్ని కథలు నడిపించాలా? అసలు జనానికి మేలు చేయాల్సిన ప్రభుత్వం... నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థలు... అన్యాయాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం.. మూడూ కుమ్మక్కయిపోవటమనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? సరిగ్గా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు విచారణకు వచ్చినప్పుడో... తీర్పు రాబోతున్నప్పుడో వీళ్లెందుకు ఇంత డ్రామాలాడుతున్నారు? ఆయన బయటికొస్తారనే భయం కాకపోతే మరేమిటి? 

సీబీఐ లీకులివ్వటం... దానికి మసాలా జోడించి ఏదో జరిగిపోయిందనే రంగేస్తూ ‘ఈనాడు‘ సంచలనం సృష్టించే ప్రయత్నం చేయటం. ఇదంతా సరిగ్గా జగన్‌మోహన్ రెడ్డి బెయిలుపై విచారణ జరిగేటప్పుడో, తీర్పు రాబోయే ముందో ప్రచురించటం. ఒకసారి కాదు. ఇప్పుడు మొదలుపెట్టిందీ కాదు. ఉప ఎన్నికలకు ముందు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అరెస్టయ్యాక... జూన్ 1న ఆయన తొలిసారి బెయిలు కోసం పిటిషన్ వేశారు. అప్పటి నుంచి సీబీఐ-ఈనాడు- చంద్రబాబునాయుడు కలిసి ఈ హైడ్రామా ఆడుతూనే ఉన్నారు. ఈ మూడు పాత్రల్నీ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూనే ఉన్నాయి.

బుధవారం ‘జగన్‌తో వ్యాపార బంధం వద్దన్నా’ అంటూ నిమ్మగడ్డ ప్రసాద్ చార్టర్‌‌డ అకౌంటెంట్ వెంకటరమణమూర్తి సీబీఐకిచ్చిన వాంగ్మూలమంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనం కూడా అలాంటిదే. ఎందుకంటే ఈ వాంగ్మూలమేమీ ఆయన సీబీఐకి నిన్ననో, మొన్ననో ఇచ్చిందేమీ కాదు. అధికారికంగా ఇప్పుడు బయటపడిందీ కాదు. కావాలనే సమయం చూసుకుని సీబీఐ లీకులిచ్చింది. అందులో ఏమీ లేకున్నా... అదేదో మహాపరాధమైనట్లు, బుధవారమే ఇంతలా ప్రచురించటం వెనక మర్మం ఎవరికీ తెలియంది కాదు. 

ప్రసాద్ పెట్టుబడులెంత?
అసలు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడుల గురించి వీళ్లు రాస్తున్న రాతల్లో నిజమేంటి? ఆయన ఏ పెట్టుబడికి సంబంధించయినా తన సలహాదారులందరితో చర్చించేవారని... చివరకు నిర్ణయం మాత్రం తనే తీసుకునేవారని ఆయన చార్టర్‌‌డ అకౌంటెంట్ చెప్పినదాంట్లో తప్పు ఏమైనా ఉందా? ఏ వ్యాపారవేత్తయినా చేసేది అదే కదా? మరి అందులో రామోజీరావుకు తప్పెందుకు కనిపించింది? అసలు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులెంత? ఎప్పుడెప్పుడు పెట్టారు? ఒకసారి చూద్దాం...

ఆ పెట్టుబడులు పెట్టిందెప్పుడంటే...
రస్ అల్‌ఖైమాతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది 2008 మార్చి 11న. రాక్ సీఈఓ ఖతర్ మసాద్ స్వయంగా వచ్చి దీనిపై సంతకాలు చేశారు. ఆ తరవాత రెండు నెలలకు ఈ ప్రాజెక్టు అమలు కోసం తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. ఒకవేళ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టును దక్కించుకున్నాకే జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే... అందుకే పెట్టారనే సీబీఐ వాదనను అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిందెప్పుడో తెలుసా?

జగతి పబ్లికేషన్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు 2006 డిసెంబర్లోనే మొదలయ్యాయి. అంటే రాక్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటానికి 14 నెలల ముందే. వాన్‌పిక్‌లోకి నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించడానికి దాదాపు ఏడాదిన్నర ముందే! పెపైచ్చు ఈ పెట్టుబడులు 2009 సెప్టెంబర్ తరవాతా సాగాయి. అంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించాక. దీనర్థమేంటి? 

జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్ సహా జగన్‌మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో ప్రసాద్ పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.847 కోట్లు. 
దీన్లో 2008 మార్చి - 2009 సెప్టెంబర్ మధ్య... అంటే రాక్‌తో ఒప్పందం కుదిరిన నాటి నుంచి వైఎస్సార్ మరణించే వరకూ పెట్టిన పెట్టుబడి రూ. 172 కోట్లు. అంటే మొత్తం పెట్టుబడిలో 20 శాతం. అంటే మిగిలిన 80 శాతాన్ని రాక్‌తో ఒప్పందం కుదరకముందో... వైఎస్సార్ మరణించాకో చేసినట్టు. మరి ఏమాశించి ఆయన ఈ పెట్టుబడులు పెట్టారనుకోవాలి? ఒక ఇన్వెస్టరుగా మాత్రమే ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్లు చేశారనుకోవద్దా? 
కేవలం జగతి పబ్లికేషన్స్‌నే తీసుకుంటే దీన్లో పెట్టుబడి పెట్టిన రూ.450 కోట్లలో రూ.30 కోట్లు మాత్రమే ఆయన 2008 మార్చి-2009 సెప్టెంబర్ మధ్య పెట్టారు. అంటే 6 శాతమన్న మాట. మిగిలిన 94 శాతం రాక్‌తో ఒప్పందం కుదరక ముందో లేక వైఎస్సార్ మరణించాకో పెట్టినవే. దీన్ని క్విడ్ ప్రో కో అంటున్నవారు ఏ రకంగా ఆలోచిస్తున్నారో చెప్పటానికి ఇది చాలదూ!!

వాన్‌పిక్ బాబు తలలోంచి పుట్టిందే...
అసలు వాన్‌పిక్ ఆలోచన తెచ్చిందే చంద్రబాబునాయుడు. తొలుత ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేయగా చంద్రబాబు సరేనన్నారు. కుదరకపోవటంతో స్కోడా కంపెనీకి ధారాదత్తం చేశారు. కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లానే దీన్నీ కట్టబెట్టే ప్రయత్నం చేసినా స్కోడా కంపెనీ ఈ ప్రాజెక్టు చేయలేని స్థితిలో రాక్ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. ఇలా రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 

సాక్షి విలువ చూసే ఆ పెట్టుబడి...
జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతాన్ని రాక్‌తో ఒప్పందానికి ముందే నిమ్మగడ్డ ఇన్వెస్ట్ చేశారు. తరవాత దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన ఏడాదికి మరో 55 శాతం పెట్టుబడులు పెట్టారు. ఇక్కడర్థం కావాల్సింది ఒక్కటే. అప్పటికి ‘ సాక్షి’ ఏర్పాటై నాలుగేళ్లు గడుస్తోంది. దేశంలోనే 8వ స్థానంలో ఉన్న అగ్రగామి పత్రికగా తన అగ్రగామి స్థానాన్ని పదిలపరచుకుంది. పెపైచ్చు అంతకు ముందు ఏ రేటుకైతే షేర్లు కొన్నారో... అప్పుడు కూడా అదే రేటుకు కొనగలిగారు ప్రసాద్. మరి దీన్ని ఒక తెలివైన ఇన్వెస్టరు తీసుకున్న నిర్ణయంగా చూడొద్దా? అప్పటికే చిరంజీవి, నాగార్జునలతో ‘మా టీవీ’ వంటి మీడియా సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రసాద్... మరో మీడియా సంస్థలో వాటాను పెంచుకోవటం కోసం అదనపు పెట్టుబడి పెడితే తప్పా?

వాటా విక్రయంతో లాభాలు...
దివంగత నేత వైఎస్సార్ మరణించేనాటికి జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడి దాదాపు 415 కోట్ల రూపాయలు. అయితే... వైఎస్సార్ మరణించాక భారతి సిమెంట్‌లో తన వాటాను విక్రయించటంతో ప్రసాద్ చేతికి రూ.620 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు రూ. 200 కోట్ల లాభమన్న మాట. మరి ఈ అంశాన్ని సీబీఐ కానీ, ‘ఈనాడు’ కానీ ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ ప్రస్తావించనే ప్రస్తావించవు. ఎందుకంటే దీన్ని ప్రస్తావిస్తే క్విడ్ ప్రో కో అనే తమ వాదనకు విలువుండదు కనుక. క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? అంటూ అంతా నవ్విపోతారు కనుక. 

తనకు లాభం వచ్చాక... అగ్రగామిగా దేశంలోనే 8వ స్థానంలో నిలిచిన పత్రికలో వాటాను అంతకు ముందటి ధరకే కొనుగోలు చేసే అవకాశం రావటంతో ప్రసాద్ సహజంగానే ఒక ఇన్వెస్టరుగా తన నిర్ణయం తాను తీసుకున్నారు. వాటా పెంచుకోవాలనుకున్నారు. ‘ఈనాడు’ విలువతో సరిసమానంగా ఉన్న పత్రిక, దేశంలో నంబర్-8 స్థానంలో ఉన్న పత్రిక... ఇదే ‘ఈనాడు’ విలువలో సగం ధరకే లభిస్తుండటంతో తను సహజంగానే మొగ్గు చూపారు. కానీ ఇది ‘ఈనాడు’కు తప్పుగా అనిపిస్తోంది. అందుకే లీక్‌లతో తప్పుడు కథనాలు వండేస్తోంది. 

ఏసీబీనీ రంగంలోకి దించేశారు!!
ఇంకో చిత్రమేంటంటే బెయిలుపై విచారణకు ముందు సంచలనం చేయడానికి కొత్త ఎత్తులకు దిగటం. బుధవారం సూరీడు ఆస్తులపై ఏసీబీ దాడులంటూ జరిగిన హడావుడి... సూరీడును ఇప్పటికీ దివంగత వైఎస్‌కు వ్యక్తిగత సహాయకుడిగానే పేర్కొంటూ ఎల్లో మీడియా చేస్తున్న హల్‌చల్. వైఎస్ మరణించి మూడేళ్లు దాటినా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేయటమన్నది రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో కళ్లకు కట్టే అంశం. ఏ అధికారిపై సోదాలు జరిగినా... ఏ వ్యవహారం వెలుగుచూసినా దానికి వైఎస్సార్‌తో ఏదో ఒక లింకు పెట్టడానికి ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నవారికి వెగటు కలిగించేవే తప్ప నిజమనిపించేవి కావు.

సూరీడు ఎవరి మనిషి?
వైఎస్సార్ మరణించాక హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగితే కూకట్‌పల్లి మోతీనగర్‌లో కార్పొరేటర్‌గా తన తమ్ముడు గణేష్‌కు ఢిల్లీ పెద్దల, రాష్ట్ర పెద్దల ఆశీస్సులతో టికెట్టు ఇప్పించుకున్నారు సూరీడు. మొన్నటి ఉప ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పని చేశారు సూరీడు. ఇక ఢిల్లీ నుంచి గులాంనబీ ఆజాద్ వచ్చినా, వయలార్ రవి వచ్చినా వాళ్లను సూరీడు కలుస్తూనే ఉన్నాడు... ‘ఈనాడు’లో ఫొటోలు వేస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ ఎల్లో మీడియా ఎందుకు గుర్తు చేయటం లేదు? దివంగత నేత వైఎస్సార్ మరణించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ సూరీడుపై ప్రతికూల వార్తలు ఏమొచ్చినా వాటిని దివంగత నేత వైఎస్సార్‌కు అంటగట్టే ప్రయత్నమే చేస్తున్నారెందుకు? ఆ మధ్య సూరీడు కుమార్తె వివాహం జరిగితే వైఎస్సార్ కుటుంబ సభ్యలెవరూ హాజరు కాకున్నా... సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరై... పెద్ద పెద్ద ఫొటోలు కూడా పత్రికల్లో వచ్చినా దాన్నెందుకు పరిగణించటం లేదు? ఇవన్నీ వదిలి ఇప్పటికీ సూరీడును దివంగత నేతకు లింకు పెట్టే ప్రయత్నాలే చేస్తున్నారంటే అది బెయిలు పిటిషన్‌ను దృష్టిలో పెట్టుకుని కాదా? అలాగని చెప్పే ధైర్యం ఈ ఎల్లో మీడియాకు గానీ... తన చేతిలోని ఏసీబీని ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఉందా? మరీ ఇంత నీచమైన రాజకీయాలు నడిపించాలా? అసలు ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రోజైనా సూరీడు జగన్‌ను ఇంటి దగ్గరకు వచ్చి పలకరించారా?

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54968&Categoryid=1&subcatid=1
Share this article :

0 comments: