హైకోర్టులో సీబీఐ కొత్త వాదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైకోర్టులో సీబీఐ కొత్త వాదన

హైకోర్టులో సీబీఐ కొత్త వాదన

Written By news on Thursday, December 20, 2012 | 12/20/2012

* సీబీఐకి కీలక ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి
* కస్టడీకి కోరింది కేవలం వాన్‌పిక్ కేసులోనేనా?
* 7 అంశాల్లో అరెస్టు చేయలేదని సుప్రీం దృష్టికి తెచ్చారా?
* అసలు జగన్ రిమాండ్ రిపోర్టు ఏం చెబుతోంది?
* సూటిగా బదులివ్వాలన్న న్యాయమూర్తి, దాటేసిన సీబీఐ
* హైకోర్టు తీర్పుకు కూడా వక్రభాష్యం చెప్పే ప్రయత్నం
* ముగిసిన సీబీఐ వాదనలు.. విచారణ నేటికి వాయిదా 

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ సరికొత్త వాదనకు తెరతీసింది. ఆయనను తాము అరెస్టు చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనంటూ బుధవారం హైకోర్టుకు నివేదించింది. దాంతో న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి సీబీఐకి కొన్ని కీలక ప్రశ్నలను సంధించారు. ‘‘బెయిల్ కోసం జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, దర్యాప్తు చేయాల్సి ఉన్న మిగతా ఏడు అంశాల్లో ఆయనను అరెస్టు చేయలేదని మౌఖికంగానో కౌంటర్ ద్వారానో కోర్టు దృష్టికి తీసుకెళ్లారా? అసలు జగన్ రిమాండ్ రిపోర్టు ఏం చెబుతోంది? ఆయనను కస్టడీకివ్వాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్టు చూపారా, లేక అన్ని కేసుల్లోనా?’’ అంటూ సీబీఐని సూటిగా ప్రశ్నిం చారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. 

సీబీఐ మాత్రం ఈ కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వకుండా దాటవేసింది. న్యాయమూర్తి అడిగిన వాటికి తప్ప, తమకు అనుకూలంగా ఉన్న ఇతర విషయాలనే ప్రస్తావిస్తూ పోయింది. పైగా ఆ కేసులో నిర్దిష్ట కాలావధి లోపు చార్జిషీటు దాఖలు చేసినందువల్ల జగన్‌కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించింది. అంతేగాక జగన్‌కు వేర్వేరు కేసులతో కూడా సంబంధముందని సీబీఐ భావిస్తే వాటిలో కూడా ఆయనను అరెస్టు చేసినట్టు భావించాలంటూ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా తనదైన శైలి వక్రభాష్యం చెప్పింది. తద్వారా హైకోర్టును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది.

పెట్టుబడుల కేసులో సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిలు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ఆసక్తికరంగా సాగాయి. విచారణ మొదలవగానే, న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి ఓ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు సీబీఐ న్యాయవాదికి ఓ ప్రశ్నను సంధించారు. ‘సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిలివ్వాలని కోరారా? ఈ అంశంపై వాదనలు జరిగాయా? ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తరవాతే, ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తయ్యాకే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జగన్‌ను ఆదేశించిందా?’ అని ప్రశ్నించారు. అవునంటూ సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ సమాధానమిచ్చారు. జగన్ తరఫు న్యాయవాది వాదనల సందర్భంగా 167(2) కింద బెయిలివ్వాలని కూడా కోరారన్నారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాకే జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పారు. 

జగన్ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన ఎస్.నిరంజన్‌రెడ్డి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని, అసలు తాము 167(2) అంశాన్నే సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. 167(2) కింద బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయాలంటే, దాన్ని మొదట కింది కోర్టులో దరఖాస్తు చేసుకోవాలే తప్ప సుప్రీంకోర్టులో దాఖలు చేసుకునే అవకాశమే లేదన్నారు. ‘‘మేం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే నాటికి 90 రోజుల గడువు పూర్తి కాలేదు. అలాంటప్పుడు చట్టబద్ధ బెయిల్ గురించి ఎలా ప్రస్తావిస్తాం? సీబీఐ ఈ విషయంలో అవాస్తవాలను కోర్టు ముందుంచుతోంది’’ అని ఆయనన్నారు. 

ఇరుపక్షాల సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో, సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో ఏం జరిగిందో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని సీబీఐని, జగన్‌ను ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభం కాగానే ఇరుపక్షాలు తమ వాదనలతో అఫిడవిట్లు సమర్పించాయి. రావల్ తాము దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను న్యాయమూర్తి ముందుంచారు. మిగతా ఏడు అంశాల్లో దర్యాప్తు పూర్తయ్యాకే బెయిల్ కోసం రావాలని జగన్‌కు కోర్టు చెప్పిందని పునరుద్ఘాటించారు. దర్యాప్తు పూర్తవక ముందే సీఆర్పీసీ సెక్షన్ 167(2) బెయిల్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను జగన్‌కు సుప్రీంకోర్టు ఇవ్వలేదన్నారు. 

దర్యాప్తు విషయంలో సీబీఐ ఒక్క రోజు కూడా వృథా చేయడం లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘మీరు స్టేటస్ రిపోర్ట్ సమర్పించే సమయంలో ఏడు అంశాలపై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఒకటే చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు కదా! దాని తరవాతనే సుప్రీంకోర్టు గత అక్టోబర్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. నా ఉద్దేశం ప్రకారం మీరిచ్చిన హామీ గడువు జనవరి ఐదో తేదీతో పూర్తవుతుంది కదా’ అని వ్యాఖ్యానించారు. దర్యాప్తు పరిపూర్తికి అక్టోబర్ 5 నాటి ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు నిర్దిష్ట కాల పరిమితేమీ విధించలేదని రావల్ బదులిచ్చారు. 

మిగతా ఏడు అంశాలపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని మాత్రమే సీబీఐ చెప్పిందన్నారు. కాబట్టి వాటిపై కూడా సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేసిన తరవాతే జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, ప్రస్తుత పిటిషన్ విచరణార్హం కాదని అన్నారు. న్యాయమూర్తి మళ్లీ జోక్యం చేసుకుంటూ, సుప్రీంకోర్టు చెప్పింది గనుక జగన్‌కు చట్టబద్ధ బెయిల్‌తో పాటు సాధారణ బెయిల్ కూడా ఇవ్వరాదంటారా అని ప్రశ్నించారు. అవునని రావల్ బదులిచ్చారు. ‘‘ఈ దశలో బెయిల్ పొందేందుకు జగన్ అర్హుడు కారు. దర్యాప్తు చేయాల్సి ఉన్న మిగతా ఏడు అంశాల్లో ఆయనను అరెస్టు చేయలేదు. రిమాండ్ కూడా చేయలేదు. కాబట్టి బెయిల్ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. 

అసలు గత మే 27న జగన్‌ను అరెస్టు చేసింది వాన్‌పిక్ అంశంలోనే. ఏడు అంశాల్లో కాదు. వాన్‌పిక్‌పై చార్జిషీట్ కూడా దాఖలు చేశాం. కోర్టు దాన్ని విచారణకు సైతం స్వీకరించింది’’ అని వివరించారు. బెయిల్ కోసం జగన్ సుప్రీంను ఆశ్రయించినప్పుడు, దర్యాప్తు చేయాల్సి ఉన్న మిగతా ఏడు అంశాల్లో ఆయనను అరెస్టు చేయలేదని మౌఖికంగానో కౌంటర్ ద్వారానో కోర్టు దృష్టికి తీసుకెళ్లారా అని న్యాయమూర్తి మరోసారి ప్రశ్నించగా రావల్ సమాధానం దాటవేశారు. ఉద్దేశపూర్వకంగానే దానికి బదులివ్వకుండా, మధ్యాహ్నం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను చదవడం ప్రారంభించారు. 

జగన్‌ను వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్టు చేశామన్నారు. మరోసారి న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘అదే నిజమైతే మిగతా ఏడు అంశాల్లో మీరు అరెస్టు చేయలేదు కాబట్టి, జగన్ ఇప్పుడు చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసుకుని జైలు నుంచి బయటకు రావచ్చు కదా! జగన్‌ను ఏడు అంశాల్లో అరెస్టు చేయలేదని సుప్రీంకోర్టులో మీరు దాఖలు చేసిన కౌంటర్‌లో ఎక్కడ చెప్పారో నాకు చూపండి!’’ అని ప్రశ్నించారు. అందుకు రావల్ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. జగన్‌ను వాన్‌పిక్ కేసులోనే అరెస్ట్ చేశామంటూ మరోసారి చెప్పారు. 

దాంతో ఉద్దేశపూర్వకంగానే సీబీఐ న్యాయవాది సమాధానాన్ని దాటవేస్తున్నారని గ్రహించిన న్యాయమూర్తి, మరో కీలక ప్రశ్న లేవనెత్తారు. ‘‘జగన్‌ను అరెస్టు చేసిన సమయంలో ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో కేవలం వాన్‌పిక్ కేసులోనే కస్టడీకి కోరారా? లేక మిగతా ఏడు అంశాల్లో కూడానా?’’ అని ప్రశ్నించారు. కానీ దానికి కూడా రావల్ న్యాయమూర్తికి సూటిగా సమాధానమివ్వలేదు. సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ విషయాన్ని మరోసారి పక్కదారి పట్టించారు. దాంతో సీబీఐ వాదనలకు న్యాయమూర్తి ముగింపు పలికారు. జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డిని వాదనలు వినిపించాల్సిందిగా కోరారు. కింది కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను తాము కోర్టు ముందుంచుతామని ఆయన విన్నవించారు. పద్మనాభరెడ్డి అభ్యర్థన మేరకు విచారణను గురువారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. 

కస్టడీ పిటిషన్‌లో అలా...
సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం బెయిల్ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా సీబీఐ న్యాయవాది వాదిస్తూ, ‘జగన్‌ను వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్టు చేశాం. మిగతా ఏడు అంశాల్లో కాదు. వాటిలో ఆయనను రిమాండ్ కూడా చేయలేదు’ అని చెప్పారు. అయితే, 2012 మే 27న జగన్‌ను అరెస్ట్ చేశాక ఆయనను 14 రోజుల కస్టడీకి కోరుతూ సీబీఐ ఎస్పీ వెంకటేశ్ ఆ మర్నాడే, అంటే 28న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ జగన్‌ను కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్ట్ చేశామని అందులో ఎక్కడా పేర్కొనలేదు. 

14 పేజీల ఆ పిటిషన్‌లో జగన్‌పై ఉన్న అన్ని ఆరోపణలనూ ప్రస్తావించారు తప్ప.. ఒక్క వాన్‌పిక్ ఆరోపణలకే పరిమితం కాలేదు. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలతో మొదలు పెడితే, జగతి, జనని ఇన్‌ఫ్రా, సండూర్ పవర్ వంటి అన్ని అంశాలనూ ప్రస్తావించారు. వివాదాస్పద జీవోలతో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురించీ పేర్కొన్నారు. ఈ మొత్తం కేసుకు సంబంధించి జగన్ నుంచి అన్ని వివరాలూ తెలుసుకోవాలని అనుకుంటున్నామంటూ ఆయన కస్టడీ కోరారు!
Share this article :

0 comments: