దేవుడనుకుంటే అసాధ్యమైంది లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేవుడనుకుంటే అసాధ్యమైంది లేదు

దేవుడనుకుంటే అసాధ్యమైంది లేదు

Written By news on Monday, December 17, 2012 | 12/17/2012

మామ మాకు నేర్పిన బాట, జగన్ నడిచే బాట ఒక్కటే. కష్టంలోనైనా, బాధలోనైనా, సంతోషంలోనైనా - మన పరిస్థితి ఎలా వున్నా మనం చేతనైనంత సహాయం, చేయగలిగినంతమందికి చెయ్యాలి.

దాదాపు ఇంకొక రెండు వారాలలో ఈ సంవత్సరం దాటి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాము. ఈవారంలో జగన్ పుట్టినరోజు వుంది. వచ్చేవారం క్రిస్మస్ ఉంది. నాలుగు తరాలుగా క్రిస్మస్ పండుగ అంటే అందరం పులివెందులకు వెళ్లడం మా కుటుంబంలో ఆనవాయితీ. కులాలు, మతాలకు అతీతంగా పండుగ అంటే అందరికీ ఎవరి సాంప్రదాయాలు వారికి ఉంటాయి. అందరూ ఎవరి ఊర్లకు వాళ్లు వెళతారు. మేమూ అంతే. దేవుడనుకుంటే అసాధ్యమైంది లేదు. దేవుడు దయదలచి క్రిస్మస్‌కు జగన్‌తో కలిసి వూరికి వెళ్లాలని మా పిల్లలు, మా బంధువులు, మా వూరి వాళ్లు అందరూ ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాకోసం ప్రార్థన చెయ్యండి. చిన్నచిన్న కోరికలే కొన్నిసార్లు ఎంతో అసాధ్యంగా కనబడతాయి.

ఈ మూడు సంవత్సరాలలో, మరీ ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో ఎన్నో కష్టాలు, ఇంటా-బయటా అన్నిచోట్లా ఇబ్బందులు వచ్చాయి. దగ్గరివాళ్లు, మనవాళ్లు అనుకున్నవాళ్లు చెయ్యి విడిచిపెట్టారు. అవతలివాళ్లు నిందలు మోపారు, రాళ్లు వేశారు. అయినా దేవుని దయ, ప్రజల ప్రేమ మమ్మల్ని ఇంతదూరం నడిపించాయి - ప్రతి అడుగులో బలమిచ్చాయి.

రోజులు గడిచేకొద్దీ జగన్ తరచూ అనే మాటలు నాకు గుర్తుకు వస్తూ వుంటాయి - ‘ఎన్నాళ్లు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం’ అని! అవును, నిజమే. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. కాని బ్రతికినన్ని రోజులు ఒకరికి మేలు చేయాలి.

కృంగినవారిని లేవనెత్తాలి, బలము లేని వాళ్లకు, బలహీనులకు అండగా నిలబడాలి, దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఒకరికి మేలు చెయ్యడానికి వాడాలి. జగన్ జైలులో ఉండి కూడా మేలుచేయడం మరవలేదని విని సంతోషపడ్డాను. జైలులో వుంటూ బెయిలు వచ్చినా, డబ్బులు లేక పూచీకత్తు కట్టలేని కొందరికి జగన్, మా లాయర్లకు చెప్పి బెయిల్ మొత్తాన్ని కట్టిస్తున్నాడని తెలిసి సంతోషించాను. జైలులో వున్నా సరే ఎఫ్‌డీఐ మీద రాజీపడకుండా మేకపాటి రాజమోహన్ అన్నతో వ్యతిరేకంగా ఓటు వేయించినందుకు సంతోషించాను.

అలాగే గడచిన 3 సంవత్సరాలలో ఎంతోమందిని చూశాను. వాళ్లకు దేవుడిచ్చిన అధికారాన్ని, అవకాశాల్ని ఒకరిని ఇబ్బంది పెట్టడానికి, ఒకరిని భయపెట్టడానికి వాడినవాళ్లున్నారు; ఒకరికి అన్యాయం చేయడానికి, ఒకరిని మానసికంగా హింసించడానికి వాడినవారిని చూశాను. కానీ, జీవితం మనకిచ్చిన అవకాశాలతో మనం ఏం చేశాం అనేదాని మీద మనమందరం జవాబు చెప్పవలసి ఉంటుంది. అవకాశాలతో మంచి చేసినవారికైతే పుణ్యం వస్తుంది. కీడు చేసినవారికైతే పాపం వస్తుంది. ఎవరి జీవితానికి వాళ్లే జవాబు చెప్పుకోవాలి. నాకు నాపై అధికారులు ఒత్తిడి తెచ్చారు అని తప్పించకోవడానికి ఉండదు. అందరూ రాయి వేస్తున్నారు కాబట్టి నేనూ వేశాను అని చెప్పడానికి ఉండదు. మన జీవితం గురించి మనమే సమాధానం చెప్పాలి. ఈరోజు ఈ అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్న పెద్దలు, నిలబడి వేడుక చూస్తున్న వారందరూ సమాధానం చెప్పవలసిన రోజు ఒకటి వస్తుంది.

ఎల్లకాలం ఒకేలా వుండదు. ఈరోజు కష్టమే రేపు సంతోషంగా మారుతుంది. కానీ కష్టాలలో అయినా, సంతోషాలలో అయినా మనతో పైకి వచ్చేది మన క్రియల ఫలం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. సంతోషాలు ఎల్లకాలం వుండవు. కానీ మన పాపపుణ్యాలు జీవితాంతం మనతోనే వుంటాయి.

మామ మాకు నేర్పిన బాట, జగన్ నడిచే బాట ఒక్కటే. కష్టంలోనైనా, బాధలోనైనా, సంతోషంలోనైనా - మన పరిస్థితి ఎలా వున్నా మనం చేతనైనంత సహాయం, చేయగలిగినంతమందికి చెయ్యాలి.

దేవుని ఆశీర్వాదంతో జగన్ తొందరగా బయటకు రావాలని, తనను ప్రేమించే ప్రజల మధ్య, తనను ప్రేమించే కుటుంబంతో గడపడానికి జగన్ రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను.


- వైఎస్ భారతి
w/o 
వైఎస్ జగన్







sakshi
Share this article :

0 comments: