18 March 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

JAGAN ANNA

Written By news on Saturday, March 24, 2012 | 3/24/2012















29న నల్లపురెడ్డి ప్రమాణ స్వీకారం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మార్చి 29 తేదిన ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోవూరు ఉప ఎన్నికలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఉప ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కమిటి సభ్యుడు భూమా నాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు 2,3 స్థానాలకు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. భవిష్యత్‌లో జగన్ సీఎం కావడం అనేది కోవూరు ఉప ఎన్నికతో రుజువైందని భూమా అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రిలయన్స్‌ను అడిగే దమ్ములేదా?

ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా రానున్న రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానుందని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎడా పెడా విద్యుత్ కోతలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో దాదాపు 12 గంటల పాటు కోత విధిస్తున్నారన్నారు. అదే విధంగా వ్యవసాయరంగానికి సక్రమంగా 7 గంటలు కూడా అందడం లేదన్నారు. రాత్రి వేళల్లో కరెంట్ కోతతో విద్యార్థులు పరీక్షలకు సరిగా చదవలేకపోతున్నారని జనక్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని విమర్శించారు. 

‘‘రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామంటున్నారు. ఏ విధంగా చేస్తారో చెప్పగలరా సీఎం గారు? కరెంట్ కోతలతో వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వారానికి 4 రోజుల కరెంట్ కోతతో లక్షా 20వేల చిన్న పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. అంతేకాదు పరిశ్రమ యాజమాన్యాలు సకాలంలో బ్యాంకు వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఇంత గందరగోళం నెలకొన్న సీఎం మాత్రం తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’’ అని జనక్ దుయ్యబట్టారు. 

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోయి చివరకు ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవుతారన్నారు. కరెంట్ విషయంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్ చూపిన చొరవ, ప్రస్తుత సీఎం ఆసక్తి కనబర్చడంలేదన్నారు. 2004-09 మధ్య కాలంలో వైఎస్ విద్యుత్‌పై ఒక్క రూపాయి పెంచ కపోగా నాణ్యత విషయంలో ఏ రోజు రాజీపడలేదని గుర్తుచేశారు. కిరణ్ ఏడాది పాలనలో అడ్డుఅదుపు లేకుండా చార్జీలు పెంచుతున్నారన్నారని మండిపడ్డారు. గతంలో ఒక సారి చార్జీలు వడ్డించి రూ. 2వేల కోట్లు దండుకున్న కిరణ్, మరో సారి ప్రజల నెత్తిన రూ.4వేల కోట్లు మోపేందుకు రంగం సిద్దం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

రిలయన్స్‌ను అడిగే దమ్ములేదా?

రాష్ట్రంలో కరెంట్ కొరతకు కారణమైన రిలయన్స్ సంస్థను నిలదీసే దమ్ము, ధైర్యం సీఎం కిరణ్‌కు లేవా? అని జనక్ ప్రసాద్ నిలదీశారు. కేజీ బేసిన్ ద్వారా ఒప్పందం ప్రకారం రిలయన్స్ సంస్థ గ్యాస్ అందించకపోవడం వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని వివరించారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆసంస్థ 2400 మెగావాట్లకు గ్యాస్ అందిచాల్సి ఉన్న, కేవలం 1500 మెగావాట్లకే పరితంచేసినప్పటికీ సీఎం కిరణ్ పల్లెత్తు మాట అనడంలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు వ్యవహారశైలి కారణంగానే ఉప ఎన్నికల్లో ఆరెండు పార్టీలకు ఒక్క సీటు దక్కలేదని జనక్ స్పష్టం చేశారు.

YS Jagan Odarpu yatra in Chilakaluripet

YS Jagan Odarpu yatra in Chilakaluripet

'జగన్ ని ఎదుక్కొనే దమ్ము కాంగ్రెస్ కు లేదు'

సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన రెడ్డిని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.  మహబూబ్ నగర్ లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే కారణం అని విమర్శించారు. రాజేశ్వర రెడ్డి భార్యకు టిక్కెట్ ఇవ్వకపోవడంతోనే పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ విషయం అధిష్టానవర్గానికి లేఖ రాస్తానని చెప్పారు.

 సుభానీనగర్ లో మహానేత విగ్రహావిష్కరణ


చిలకలూరిపేట సుభానీ నగర్ లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఓ వృద్ధురాలు జగన్ ని చూసిన ఆనందం ఆపుకోలేక న్యత్యం చేస్తూ స్వాగతం పలికింది.

చిలకలూరిపేట రజకకాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. అనంతరం మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఆర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు.

'సాక్షి'కి నాలుగేళ్లు పూర్తి

చిరంజీవి.. కాంగ్రెస్‌కు ఐరన్‌లెగ్

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఓ ఐరన్‌లెగ్‌లా మారాడని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు ఎద్దేవా చేశారు. ఆయనకున్న ప్రజాదరణ ఏంటో, ఆయన శక్తి ఎంతో కడప, కోవూరులలో జరిగిన ఉప ఎన్నికలలోనే తేలిపోయిందని, 2014లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెబుతున్న చిరంజీవి, త్వరలో జరగబోయే తిరుపతి ఎన్నికలలో తన సత్తా ఏంటో చూపాలని ఆయన సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికలలో కాంగ్రెస్, పీఆర్పీలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు కోవూరులో కాంగ్రెస్‌కు 30వేల ఓట్లు తక్కువ వచ్చాయని, దీన్నిబట్టి చిరంజీవికున్న ప్రజాదరణ ఏపాటిదో అర్థమవుతోందని అన్నా రు. ‘బావ అల్లు అరవింద్ ఎలాగూ గతంలో ఎన్నికలలో పోటీచేశారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి సోదరుడు నాగబాబు టికెట్ ఆశించారు. తన కుటుంబ సభ్యులు తిరుపతిలో పోటీచేయబోరని చిరంజీవి చెబుతున్నా నాగబాబు దానిని ఖండించలేదు. అల్లు అరవింద్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. 2014లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానంటున్న చిరంజీవికి దమ్మూ, ధైర్యం ఉంటే తిరుపతి అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికలలో వారిద్దరిలో ఒకరిని బరిలోకి దింపి గెలిపించుకోవాలి’ అని సవాల్ చేశారు. వైఎస్సార్ మరణానంతరం ఆయనను, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకున్న కాంగ్రెస్ నేతలు కె.కేశవరావు, శంకర్రావు, డీఎల్. రవీంద్రారెడ్డిలకు నూతన సంవత్సరంలో జ్ఞానోదయం కలిగినట్లుందని గోనె ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ జగన్‌ది పాలపొంగు అని విమర్శించిన వారికి ఇప్పుడు జగన్ శక్తి ఏంటో తెలిసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ నేతల కన్నా వీరు ఎక్కువగా మాట్లాడుతూ 18 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్‌దే విజయమన్న సంకేతాలను ఘంటాపథంగా ప్రజల్లోకి పంపారని అన్నారు. 18 స్థానాల ఎన్నికల ప్రచారం ఆ ముగ్గురి మాటలతో 50 శాతం పూర్తయిపోయిందని, ఆయా స్థానాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండోస్థానం కోసం పోటీపడాల్సిందేనన్నారు.

అంతా మీ నాయన చలవే

ఆయన ప్రవేశపెట్టిన పథకాలే మమ్మల్ని ఆదుకున్నాయి
ఆరోగ్యశ్రీ ద్వారా అనేక కుటుంబాలకు మేలు జరిగిందంటూ లబ్ధిదారులు..
ఫీజు రీయింబర్స్‌మెంటుతోనే చదువుకుంటున్నామంటూ విద్యార్థులు..
వారి ఆత్మీయ అనురాగాలకు చలించిపోయిన జననేత

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘అన్నా.. మీ నాయన దయ వల్ల మా చెల్లెలి బిడ్డ ఆరోగ్యం బాగుపడింది. చెవికి ఆరు లక్షల ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ.. ఒక్క పైసా ఖర్చులేకుండా ఉచితంగా జరిగింది. మా బాబు వినగలుగుతున్నాడంటే.. రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ చలవే. మాలాంటి ఎందరో కుటుంబాలకు మేలు చేసిన మీ నాయనకు జీవితకాలం రుణపడి ఉంటామన్నా’’.. చిలకలూరిపేట ఎన్‌టీఆర్ కాలనీలో కిరణ్మయి ఉద్వేగం. సర్జరీ జరిగిన దేవరకొండ హేమంత్‌ను కిరణ్మయి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకొచ్చి ఇలా కృతజ్ఞతలు తెలుపుకొంది. ‘‘బిడ్డా.. రాష్ట్రం బాగుండాలంటే నీవు తప్పక ముఖ్యమంత్రివి కావాలి. దీనికోసం ప్రతిరోజూ కన్నీటి ప్రార్థన చేస్తున్నా’’నంటూ జగన్‌కు అదే పట్టణంలో వృద్ధురాలు పాలపర్తి బుసమ్మ ఆత్మీయ దీవెన. 

మీ నాయన వల్లే పెన్షన్ పొందామని కొందరు, ఆరోగ్యశ్రీతో మా జీవితాలు బాగుపడ్డాయని ఇంకొందరు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నానంటూ విద్యార్థులు... శుక్రవారం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో(74వ రోజు) భాగంగా చిలకలూరిపేట పట్టణంలో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఇలా ఎందరో వైఎస్ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. మహానేత మరణించి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన్ను తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న వారి అభిమానాన్ని చూసి జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ.. పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

రోడ్లన్నీ జనసంద్రం..

ఓ పక్క ఎండ తీవ్రత.. మరోవైపు ఉగాది పండుగ.. సాధారణంగా జనం ఇల్లు వదిలి బయటకు రారు. కానీ ఇదే రోజు తమ పట్టణంలో పర్యటించిన జగన్‌ను చూడ్డానికి జనమంతా రోడ్లపైకి వచ్చారు. ఇసుకవేస్తే రాలనంత చందంగా ఎటువైపుచూసినా జనమే. కాలనీల్లోని వీధులన్నీ జనసమూహంతో నిండిపోయాయి. చిలకలూరిపేట పట్టణంలో ఒకటి కాదు రెండు కాదు 17 విగ్రహాలను ఏర్పాటుచేసి ప్రజలు మహానేతపై తమ అభిమానం చాటుకున్నారు. కాగా పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీ, రెడ్లబజార్, గుర్రాలచావిడి, వేలూరుడొంక, ఈస్ట్‌మాలపల్లిలో ఏర్పాటుచేసిన ఐదు విగ్రహాలను జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. పట్టణంలో పది గంటలకుపైగా జరిగిన రోడ్‌షో ప్రభంజనంలా సాగింది.

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: శుక్రవారం వైఎస్ విగ్రహావిష్కరణ సభల సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రజలందరికీమేలు జరగాలని, ముఖ్యంగా రైతన్నల పరిస్థితి మెరుగుపడి కష్టాలు తీరాలని జగన్ ఆకాంక్షించారు.

జగన్‌ను కలిసిన నల్లపరెడ్డి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలిశారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో జగన్‌ను చిలకలూరిపేట పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీలో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు.

పవర్ కట్‌తో నష్టపోతున్నామని: ‘విచ్చలవిడిగా కరెంట్ కోతల విధించడం వల్ల ఉత్పత్తిలో 40 శాతానికిపైగా తగ్గిపోయి పారిశ్రామిక రంగంతోపాటు రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నా’ అంటూ గణపవరం ఇండస్ట్రీస్ అసోసియేషన్ కన్వీనర్ నాతాని ఉమామహేశ్వరరావు జగన్‌కు విన్నవించారు. గణపవరం పరిసర ప్రాంతాల్లో పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్, కాటన్ బేల్ ప్రెస్సింగ్, ఆయిల్‌మిల్స్ డీలింటర్స్, స్పిన్నింగ్, వీవింగ్ పరిశ్రమలు సుమారు 300కు పైగా ఉన్నాయని, అసలే సమస్యలతో సతమతమవుతున్న తమను కరెంట్ కోత ఇంకా ఇబ్బంది పెడుతోందని, తమ పక్షాన నిలిచి పోరాడాలని జగన్‌ను కోరారు.

2014లో జగన్‌దే భవిష్యత్తు: శంకర్రావు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి వ్యక్తి అని, ఆయనకు మంచి రోజులు వచ్చాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు అన్నారు. 2014లో జగన్‌మోహన్‌రెడ్డికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. శుక్రవారం ఉగాది సంబరాలలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాపూజీనగర్‌కు వచ్చిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో కీలక వ్యక్తులుగా కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, శంకర్రావులే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో సీఎం కిరణ్ భవితవ్యమేమిటని విలేకరులు ప్రశ్నించగా.. భగవంతుడు కరుణిస్తే తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన సమాధానమిచ్చారు. జగన్‌ను సీఎంను చేయాలని సంతకాలు పెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాడని, అలాంటి ఆయనకు జగన్ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని చెప్పారు. 

కాంగ్రెస్ అధిష్టానాన్ని కిరణ్ మోసగించి సీఎం పదవిలో కూర్చున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు తప్పుడు జీవోలు విడుదల చేయడం వల్లనే కోర్టులో కేసు వేశానని, ఆయన జైలుకు పోవడం ఖాయమని శంకర్రావు అన్నారు.

వైఎస్సార్ సీపీ సీఈసీలోకి పువ్వాడ అజయ్

వైఎస్సార్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక వేదికైన కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ)లోకి పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం)కు చోటు లభించింది. ఈయన సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు. అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అజయ్‌ను సీఈసీలోకి తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయకర్త పి.ఎన్.వి.ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఖమ్మం జిల్లా యువజన విభాగ కన్వీనర్‌గా రామసహాయం నరేష్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు.

24-3-2012 శనివారం ఓదార్పు షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం చిలకలూరిపేట పట్టణంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. వివరాలు..
24-3-2012 శనివారం చిలకలూరిపేట పట్టణం
సీఆర్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభం
రజకకాలనీలో పర్యటన
పురుషోత్తమపట్నంలో పర్యటన
ముస్లిం బజార్‌లో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
సుభానీనగర్‌లో విగ్రహావిష్కరణ
రాజన్నపాలెంలో పర్యటన
మార్కెట్ సెంటర్‌లో పర్యటన
వెంకటరెడ్డి కాలనీలో పర్యటన
మద్దినగర్‌లో విగ్రహావిష్కరణ
వడ్డెర కాలనీలో విగ్రహావిష్కరణ
విజయా బ్యాంక్ సెంటర్‌లో పర్యటన
సుబ్బయ్యతోటలో పర్యటన
చలివేంద్రం బజార్‌లో పర్యటన
పొట్టిశ్రీరాములు బజార్‌లో పర్యటన
పెద్దమసీదు వద్ద పర్యటన 
పంజానగర్‌లో విగ్రహావిష్కరణ
ఆదిఆంధ్రానగర్‌లో విగ్రహావిష్కరణ
భావనారిషినగర్‌లో విగ్రహావిష్కరణ
సుగాలీకాలనీలో విగ్రహావిష్కరణ

త్వరలోనే కాంగ్రెస్‌కు చేదు రోజులు: పద్మ

Written By ysrcongress on Friday, March 23, 2012 | 3/23/2012

విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై భారం వేయడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రజలపై రూ. 4వేల కోట్ల భారం మోపాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం తీపికబురు అందించకపోయినా ఫర్వాలేదు కానీ, చేదు మిగల్చవద్దని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

‘ప్రకృతి కన్నెర్రకు తోడు కరెంటు కోతలు, గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు విద్యుత్ చార్జీల ద్వారా రూ. 4వేల కోట్లు పిండుకోవాలని చూస్తోంది. ఉప ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గురావట్లేదు’’ అని పద్మ మండిపడ్డారు. ‘సాధారణ గహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్‌కు యూనిట్‌పై రూ.50-90 పైసలు వడ్డించి రూ.900 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల ద్వారా మరో 3 వేల కోట్లు దండుకోవాలని భావిస్తోంది. ఒకే సారి ప్రజలపై మోయలేని భారం వేస్తే భరించేది ఎలా?’ అని నిలదీశారు. కరెంట్ చార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డట్లేనని ఆమె స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అరాచకాలకు టీడీపీ తబల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకాలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తబల వాయిస్తుందని పద్మ మండిపడ్డారు. వ్యాట్, ఇష్టారాజ్యంగా పన్నులు దండుతున్నా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షంతో అంటకాగుతోందని దుయ్యబట్టారు. ప్రజలపై మరో కొత్తరకం వడ్డనకు ప్రభుత్వం పూనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని ప్రజలకు అండగా ఉంటూ తగిన బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలకు సిట్టింగ్ స్థానాలు దక్కనీయకుండా తగిన బుద్ది చెప్పినా... ఆ పార్టీలకు సిగ్గురాలేదని దుయ్యబట్టారు. ప్రతిష్ఠాత్మక కోవూరు ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పునిచ్చారని, ప్రజాస్వామ్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పద్మ పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టడంతో రాష్ట్రంలో రాబోయే మార్పునకు చక్కని నాందని చెప్పారు. 

చంద్రబాబు చేష్టలతో ఉద్యమం విరమించిన హజారే!

అవినీతిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు, చేష్టలు చూసి జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన అన్నాహజారే విరమించుకున్నారని పద్మ ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రంలో కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు అవినీతిపై పోరాటం అంటూ హజారే ఫోటోపెట్టుకోవడం చూసి తెలుగు తమ్ముల్లే ముక్కున వేలేసుకున్నారని చెప్పారు. బాబు హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలను చెప్పుకుంటూ పోతే అంతమే ఉండదన్నారు. కనుక అవినీతిని అంతమొందించే విషయంపై మాట్లాడే అర్హత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ప్రభుత్వ పాలనలో జగన్ ఇప్పటి దాకా ఎక్కడా జోక్యం చేసుకోలేదని, అనునిత్యం ప్రజల గురించి పరితపిస్తూ.. కాంగ్రెస్, చంద్రబాబులకు రాని ఆలోచనలు ఆయన చేస్తున్నారని వివరించారు. అవినీతి అంతం చేస్తానని ఇప్పటి దాకా చంద్రబాబు కానీ సీఎం కిరణ్ కానీ చెప్పలేకపోయారని, ముఖ్యమంత్రి పీఠంపై ఉంటే ఆ భూతాన్ని రూపుమాపుతామని చెప్పిన ధైర్యం జగన్‌కే దక్కుతుందని తెలిపారు.

ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు: ములాయం

ఏ క్షణంలోనైనా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావోచ్చని పార్టీ శ్రేణులకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ వారంలో జరిగే కీలక ఓటింగ్‌లో ఏమైనా జరుగవచ్చని ములాయం తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది ఖచ్చితంగా చెప్పలేమని, వచ్చే ఆరు నెలల్లో పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నిటిని అమలు చేయాలని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ములాయం సింగ్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఐరన్‌లెగ్: గోనె

కాంగ్రెస్ పార్టీని రక్షించానని చెప్పుకున్న చిరంజీవి అదే పార్టీకి ఐరన్‌లెగ్‌గా మారాడని గోనె ప్రకాశ్ విమర్శించారు. కోవూరు ఎన్నికల్లో ప్రచారం చేసిన చిరంజీవిని ప్రజలు తిరస్కరించారని, వచ్చే ఉప ఎన్నికల్లో కూడా చిరంజీవి తరపున ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని గోనె అభిప్రాయపడ్డారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు, కేకేలు ఇపుడు జగనే గెలుస్తాడని చెప్పటం శుభ పరిణామం అన్నారు. ఆ ముగ్గురికి జ్ఞానోదయం కలిగించిన దేవుడికి కృతజ్ఞతలు అని గోనే ప్రకాశ్ అన్నారు. 

విలువలకు నీరాజనం

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు, గెలుపోటములు సర్వసాధారణం. కానీ, ఈ నెల 18న ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలపై బుధవారం వెలువడిన ఫలితాల తీరే వేరు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అటు అధికారపక్షంపైనా, ఇటు ప్రధాన ప్రతిపక్షంపైనా తమకు విశ్వాసం లేదని ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు ముక్త కంఠంతో చెప్పారు. ఈ రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల నుంచి శాసిస్తూ వస్తున్న బలమైన రెండు ప్రధాన పక్షాలనూ పక్కకు ఈడ్చేశారు. విలువలకే తాము పట్టంకడతామని స్పష్టంచేశారు. ప్రజల్లో బలంగా వేళ్లూనుకున్న మనోభావాలను దెబ్బతీయడానికి, వారి మనసుల్లో గూడుకట్టుకున్న అభిమాన నేత జ్ఞాపకాలను చెరిపేయడానికీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్నో కుట్రలకు పూనుకున్నాయి. డబ్బులు వెదజల్లడంలోనూ, మద్యం పారించడంలోనూ పోటీపడ్డాయి. 

రాజకీయ జీవన్మరణ సమస్యగా భావించి సర్వశక్తులూ ఒడ్డాయి. కనీస విలువలను, విధానాలను విస్మరించి చవకబారు ఆరోపణలకు తెగించాయి. ఏం చేసినా, ఏం చెప్పినా ఈ రెండు పక్షాలకూ ప్రజలు గట్టిగా జవాబిచ్చారు. మమ్మల్ని పాలించే అర్హత మీకిద్దరికీ లేదని ముఖంమీద గుద్ది చెప్పారు. నమ్మిన విలువల కోసం, సిద్ధాంతాల కోసం పోరాడేవారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ప్రజలు నిరూపించారు. రెండున్నరేళ్ల క్రితం కోవూరులో ఏడువేలకు పైగా మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఈసారి అంతకు మూడురెట్ల కంటే ఎక్కువ ఆధిక్యతను కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, ఇటు నాగర్‌కర్నూలులో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా, మహాకూటమి తరఫున పోటీ పడినప్పుడు 6,593 ఓట్ల మెజారిటీతో నెగ్గితే, ఇప్పుడు ఇండిపెండెంట్‌గా వచ్చిన ఆయనకు 27,000కు పైగా ఆధిక్యతను అందించారు. మహబూబ్‌నగర్ స్థానంలో గత ఎన్నికల్లో కేవలం 1977 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన బీజేపీకి ఈసారి 1879 ఓట్ల మెజారిటీతో ప్రజలు పట్టంగట్టారు.

టీడీపీ అధినేత ఈ ఉప ఎన్నికల ప్రచారంలో అలవిమాలిన అహంకారంతో కనీస విలువలను మరిచి మాట్లాడిన మాటలు అందరినీ దిగ్భ్రమపరిచాయి. ఒకపక్క చేవెళ్ల-ప్రాణహిత నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకూ వైఎస్ చెప్పిన, చేసిన పథకాల గురించే మాట్లాడుతూ, తాను వస్తే అవన్నీ చేస్తానని చెబుతూ ఆ దివంగత నేతపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం అందరూ గమనించారు. ఏ అంశంపైనైనా తనకంటూ ఎజెండాగానీ, విధానంగానీ లేవని బాబు పదే పదే నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎప్పటిలాగే తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో పలచన చేయడానికి చూశారు. కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఆ పార్టీ నాయకుల ఇంట్లోనూ, వాహనాల్లోనూ పట్టుబడిన నోట్ల కట్టలే బాబు కపటత్వాన్ని బదాబదలుచేశాయి. ఎనిమిదేళ్లనుంచి ప్రతిపక్ష హోదాకే పరిమితమై బతుకీడుస్తున్న తెలుగుదేశానికి భవిష్యత్తులో అది సైతం దక్కబోదన్న చేదు వాస్తవాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉందని, అటు టీఆర్‌ఎస్‌పైనా అందరికీ నమ్మకం పోయిందని విశ్లేషించుకుని గెలుపు నల్లేరుమీద బండి నడక అనుకుని తెలంగాణలో చెలరేగిపోయిన బాబు పార్టీకి మూడుచోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యేలా చేసి ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ కూడా వైఎస్ నామం జపిస్తూనే ఆయననూ, ఆయన కుటుంబాన్నీ ప్రజల్లో అభాసుపాలుచేయడానికి ఎన్నో కుట్రలకు దిగింది. తన జేబు సంస్థ సీబీఐ ద్వారా మాయోపాయాలు పన్నడమే కాదు, ప్రధాన ప్రతిపక్షంతో పూర్తిగా కుమ్మక్కై వైఎస్ ప్రభుత్వ హయాంలోని భూ కేటాయింపులపై విచారణకు సభాసంఘం నియమించి ఆయనపై అపోహలు రేకెత్తేవిధంగా ప్రవర్తించింది. అవిశ్వాస తీర్మానం విషయంలో రెండు పార్టీలూ కుమ్మక్కైన తీరు జగద్విదితమే. ఎన్నడూ చూడని, ఎప్పుడూ వినని అధికార, విపక్షాల కుమ్మక్కు రాజకీయాలను చూసి రాష్ట్ర ప్రజలు విస్తుబోయారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు.

ఒక్కసారి ఈ రాష్ట్రంలో వైఎస్ కనుమరుగైన తర్వాత జరిగిన ఉప ఎన్నికలను సింహావలోకనం చేసుకుంటే అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు ఎదురవుతున్న పరాభవ పరంపర కళ్లకు కడుతుంది. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగాయని పరిగణిస్తే మొత్తం 29 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలొచ్చినట్టు లెక్క. అందులో కాంగ్రెస్ 16 నియోజకవర్గాల్లోనూ, తెలుగుదేశం 21 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు కోల్పోయాయి. తెలుగుదేశం అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ వరస ఓటములను చవిచూస్తోంది. అధికారపక్షం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ప్రధాన ప్రతిపక్షమూ... ప్రధాన ప్రతిపక్షం అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు అధికారపక్షమూ సొమ్ము చేసుకోవాలని చూస్తాయి. ప్రయోజనాన్ని పొంది బలపడాలని ఆశిస్తాయి. కానీ, ఈ రెండు పక్షాలూ దయనీయమైన స్థితిలో పడిపోయాయి. రెండు, మూడు స్థానాలకోసం పోటీపడే స్థాయికి దిగజారాయి. ఇక కాంగ్రెస్‌కు ఇక్కడే కాదు... దేశవ్యాప్తంగా కూడా ఆదరణ నానాటికీ క్షీణిస్తోంది. 

2009 తర్వాత అక్కడక్కడా జరిగిన ఉప ఎన్నికల్లోనే మాత్రమే కాదు..ఈమధ్యే జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆ పార్టీకి నిరాశే కలిగించాయి. 10 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సొంతంగా దక్కింది చిన్న రాష్ట్రమైన మణిపూర్ అయితే, ఒక్క స్థానం ఆధిక్యత మాత్రమే సంపాదించి మరో చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ చేజిక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ పరాభవం ఆ పార్టీకి పెద్ద షాక్. విలువలను విడిచిపెట్టి, విశ్వసనీయతను కోల్పోయి..వంచనతో విజయం సాధిద్దామనుకుంటే ప్రజాస్వామ్యంలో అలాంటి వేషాలు చెల్లుబాటు కావని జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు, రాష్ట్రంలో ఆ పార్టీతోపాటు తెలుగుదేశానికి ప్రజలు గట్టిగా తెలియజెప్పారు. ఆ పార్టీల అధినేతలు వినే స్థితిలో ఉన్నారా?!

రూ. 4 వేల కోట్ల బాదుడు! విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్

* ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
* రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి భారీ బాదుడు
* గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసల నుంచి రూపాయి అదనపు భారం
* పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపైనా భారం
* టెలిస్కోపిక్ విధానం ఎత్తివేత
* 50 యూనిట్లు దాటితే గృహాలకు వాతలే
* బిల్లులు సకాలంలో కట్టకపోతే ఆలస్య రుసుం
* చార్జీల పెంపునకు రేపు సర్కారు ఆమోదముద్ర!
* అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ నెల 30న ఈఆర్‌సీ ఆదేశాలు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: షడ్రుచుల కలయికకు ప్రతీక ఉగాది. కానీ ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తే. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. ఎడాపెడా కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు సిద్ధమైంది. గృహ వినియోగదారులతో పాటు పరిశ్రమలు, వాణిజ్యసంస్థలపై రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఏకంగా రూ.4 వేల కోట్ల మేర భారం మోపేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గృహ వినియోగదారులపై యూనిట్‌కు 55 పైసల నుంచి రూపాయి వరకు అదనపు చార్జీల భారం పడనుంది. పరిశ్రమలపై 62 పైసల నుంచి రూ.1.23 మేరకు షాక్ తగలనుంది. 

వాణిజ్య సంస్థలకు 50 పైసల నుంచి రూపాయి వరకు రెగ్యులర్ చార్జీల భారంతో పాటు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు వినియోగించే విద్యుత్‌కు టైమ్ ఆఫ్ ది డే (టీవోడీ) పేరుతో యూనిట్‌కు రూపాయి చొప్పున అదనపు భారం పడనుంది. అంతేకాదు ఇప్పటివరకు అమల్లో ఉన్న టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేయనున్నారు. తద్వారా 50 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులందరిపైనా మరింత భారం మోపేందుకు రంగం సిద్ధమయ్యింది. మొత్తం మీద గృహ వినియోగదారులపై ఏకంగా రూ.900 కోట్ల భారం పడనుండగా, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై మరో రూ.3,100 కోట్ల భారం పడనుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా గతంలో లేనివిధంగా విద్యుత్ చార్జీలు సకాలంలో చెల్లించకపోతే ఆలస్య రుసుం వసూలు చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం.

2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ సంస్థలు గత ఏడాది డిసెంబర్‌లోనే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పించాయి. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చార్జీల పెంపుపై ఈఆర్‌సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాత్రి ఇటు ఇంధనశాఖ అధికారులతోను, అటు ఈఆర్‌సీ వర్గాలతోనూ సమావేశమైన సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. 

గ్యాసు లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ మేరకు అదనపు విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, అదనపు విద్యుత్ కొనుగోలుకు, ఉచిత విద్యుత్ సబ్సిడీకి గాను రూ.5,500 కోట్ల మేరకు ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు మార్పు చేసి చార్జీల పెంపుపై తుది ప్రతిపాదనలను ఈఆర్‌సీ శనివారం ప్రభుత్వానికి ఇవ్వనుంది. అదే రోజు ప్రభుత్వం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నట్టు సమాచారం. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 30న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్‌సీ జారీ చేయనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వచ్చే నెల ఒకటి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయి. 

50 యూనిట్లు దాటితే డబుల్ షాక్!
ప్రస్తుతం గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ పద్ధతిలో విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. అంటే స్లాబుల వారీ విద్యుత్ చార్జీల విధానం అమల్లో ఉంది. ఉదాహరణకు నెలకు 120 యూనిట్లు వాడితే మొదటి 50 యూనిట్లకు (0-50 శ్లాబు) యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 51-100 యూనిట్లకు యూని ట్‌కు రూ.2.80 చొప్పున, మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ. 3.05 చొప్పున చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనినే టెలిస్కోపిక్ పద్ధతిగా వ్యవహరిస్తారు. ఇప్పుడీ టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయనున్నారు. 51-100 శ్లాబు స్థానంలో 0-100 శ్లాబు రానుంది. అంటే 50 యూనిట్లు దాటితే ప్రతి యూనిట్‌కు రూ. 2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

వాస్తవానికి 0-50 శ్లాబును 0-30లా మార్చాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించాయి. 31 యూనిట్లు దాటితే టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేయాలని కోరాయి. డిస్కంల వాదనతో ఈఆర్‌సీ ఏకీభవించలేదని తెలిసింది. ప్రస్తుతం ఉన్నట్టుగానే 0-50 శ్లాబును అలాగే ఉంచి 51-100 శ్లాబును ఎత్తివేసి 0-100 శ్లాబుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈఆర్‌సీ నిర్ణయం వల్ల 31 నుంచి 50 యూనిట్లులోపు వినియోగించే 75 లక్షల మంది వినియోగదారులపై భారం తప్పిందనే చెప్పాలి. 

పరిశ్రమలపై పిడుగు!
రాష్ట్రంలో పరిశ్రమలు ప్రస్తుతం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. నెలలో ఏకంగా 12 రోజుల పాటు కోతల బారినపడుతున్నాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల షాక్‌లూ పరిశ్రమలు ఎదుర్కోవాల్సి రానుంది. చిన్నతరహా పరిశ్రమలు, పౌల్ట్రీ ఫామ్‌లు, పుట్టగొడుగుల పెంపకందార్లతోపాటు భారీ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల మోత మోగనుంది. యూనిట్‌కు ఏకంగా 62 పైసల నుంచి రూ. 1.23 వరకూ అదనపు భారం పడనుంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకైతే ఏకంగా రూ. 1.10 నుంచి 2.10 దాకా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. మొత్తం మీద పరిశ్రమలపై ఏకంగా రూ.2,100 కోట్ల మేరకు విద్యుత్ చార్జీల భారం పడనుంది. 

‘టెలిస్కోపిక్’ ఎత్తివేత షాక్ ఇలా..
టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల గృహవినియోగదారులపై చార్జీల భారం భారీగా పెరగనుంది. ఉదాహరణకు నెలకు 70 యూనిట్లు వాడితే.. ఇప్పటివరకు మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున రూ. 72.5 అవుతుంది. మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.80 చొప్పున రూ. 56 అవుతుంది. మొత్తం రూ. 128.50 (వీటికి సర్వీసు చార్జీలు అదనం) అవుతుంది. ఈ విధానం ఎత్తివేయడం వల్ల మొత్తం 70 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున రూ. 182 (వీటికి సర్వీసు చార్జీలు అదనం) అవుతుంది. అంటే అదనంగా రూ.53.50 భారం పడుతుందన్న మాట. 

ఒకవేళ నెలకు 120 యూనిట్లు వినియోగిస్తే.. ప్రస్తుత టెలిస్కోపిక్ పద్ధతిలో మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున రూ. 72.50 అవుతుంది. 51 నుంచి 100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.80 చొప్పున రూ.140, మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ. 3.05 చొప్పున రూ. 61 అవుతుంది. మొత్తం విద్యుత్ బిల్లు రూ.273.50 (సర్వీసు చార్జీ అదనం) అవుతుంది. 

టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల మొదటి 100 యూనిట్లకు యూనిట్‌కు 2.60 చొప్పున రూ.260 అవుతుంది. మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ.3.60 చొప్పున రూ.72 అవుతుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి కరెంటు బిల్లు రూ.332 (సర్వీసు చార్జీ అదనం) వస్తుంది. అంటే 120 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై అదనంగా రూ.58.50 భారం పడనుందన్నమాట. ఇక 51 యూనిట్లు వాడితే కరెంటు బిల్లు ఏకంగా రూ. 75.30 నుంచి రూ. 132.60కి పెరగనుంది.

Popular Posts

Topics :