26 జీవోలు అక్రమమని ఎలా నిర్థారించారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 26 జీవోలు అక్రమమని ఎలా నిర్థారించారు?

26 జీవోలు అక్రమమని ఎలా నిర్థారించారు?

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కాలం సహకరించక పోతే 26 జీవోలు అక్రమమని ఎలా నిర్థారించారు, ఏ ఆధారాలతో తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. జగన్ బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన దరిమిలా ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీబీఐ వైఖరిపై మండిపడ్డారు. జగన్‌ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే దురుద్దేశ్యంతోనే సీబీఐ ప్రభుత్వం సహకరించలేదనే కొత్తవాదనను కోర్టు ముందుకు తెచ్చిందని ఆమె విమర్శించారు. ‘ఇది అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసు...ఈ కేసుకున రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదంటే సీబీఐ తీసుకోవాల్సిన తదుపరి చర్యలేమిటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేస్తారా? ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా?’ అని ఆమె ఆగ్రహంగా ప్రశ్నించారు. హైకోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. పద్దెనిమిది నెలలుగా దర్యాప్తు పేరుతో రక రకాల విన్యాసాలు చేస్తున్న సీబీఐ గతంలో జగన్ బెయిల్ పిటిషన్ వేసుకున్న ఏ కోర్టుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించలేదన్న విషయం ఎందుకు చెప్పలేదని ఆమె అన్నారు. ప్రభుత్వం సహకరించకుండానే 26 జీవోల్లో అక్రమాలు జరిగాయని మీరెలా నిర్థారించారు, లబ్ది పొందారని జగన్‌ను ఎలా అరెస్టు చేస్తారని ఆమె అన్నారు. హైకోర్టు ముందు చేసిన వాదనలు చూస్తే దర్యాప్తు ఎపుడు పూర్తవుతుందో చెప్పలేని వాతావరణాన్ని సీబీఐ కల్పిస్తోందని ఆమె దుయ్యబట్టారు. గత ఏడాది అక్టోబర్ ఐదో తేదీకి ముందు సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడు మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పిందని ఆ గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగుస్తుందని ఇలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పడమేమిటి అని అన్నారు. అదే విషయంలో సుప్రీం విచారణ సందర్భంగా ఎందుకు సీబీఐ చెప్పలేదన్నారు. 

పద్దెనిమిది నెలల క్రితం శంకర్‌రావు 26 జీవోలపై పిటిషన్ వేసినపుడు అడ్వకేట్ జనరల్ హాజరై వాదించాలి. కానీ ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు సరికదా, ఆ ఛాయలకు కూడా రాలేదు. ఆరోజు సీబీఐ ఎందుకు ప్రభుత్వం సహకరించలేదని చెప్పలేదు, కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పలేదు అని పద్మ ధ్వజమెత్తారు. సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది ఈ వ్యవహారంలో మంత్రులు, ఐఏఎస్‌ల పాత్ర ఏమిటని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాతనే నెల రోజుల్లోపు ఈ జీవోలపై కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఒక నెల రోజులే గడువు ఇచ్చినా మంత్రులు తొమ్మిది నెలల తరువాత నోటీసులకు సమాధానం చెప్పారని ఆమె విమర్శించారు. దీనిని బట్టి కోర్టులంటే ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. మంత్రులు సమాధానం చెప్పడంలో తొమ్మిది నెలల జాప్యం చేసినపుడు కూడా ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించలేదని సీబీఐ కోర్టుల్లో చెప్పక పోవడంలో అంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ‘అసలు జగన్‌ను ఏ ప్రాథమిక ఆధారాలున్నాయని అరెస్టు చేశామని సీబీఐ చెప్పిందో అవి ఎక్కడి నుంచి వచ్చాయి. 

ప్రభుత్వం సహకరించకుంటే మీరు ఆ ఆధారాలను సృష్టించారా? జగన్‌కు శిక్ష పడదగ్గ ఆధారాలు ఎలాగూ సీబీఐ వద్ద లేవు కనుక అలాంటి ఆధారాలను సృష్టించే వరకూ ఆయనను జైల్లో పెట్టాలని కొత్త ప్రణాళికను రచిస్తోందా?’ అని పద్మ ప్రశ్నించారు. సీబీఐ వ్యవహార శైలిపై తొలి నుంచీ తామేమి చెబుతున్నామో అది నిజమని ఈ రోజు తేలుతోందన్నారు. అసలు దేశ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్నమైన దర్యాప్తు మరొకటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. శంకర్‌రావు పిటిషన్ వేసింది 26 జీవోల్లో అక్రమాలు జరిగాయని, ఆ దిశగా దర్యాప్తు జరుపకుండా జగన్ గారు లబ్ది పొందారనే కోణంలో దర్యాప్తును సాగదీస్తున్నారని ఆమె అన్నారు. అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరూ ద్రోహులే అన్న విధంగా సీబీఐ వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. జగన్‌ను జైల్లో పెట్టి ఎనిమిది నెలలైనా ఒక్క ఆధారాన్ని ఇంత వరకు దర్యాప్తులో తేల్చలేక పోయారు, దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో కూడా చెప్పలేని పరస్థితుల్లో ఉన్నారని ఆమె అన్నారు.‘63 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయం, చట్టం వాటిని విశ్వసించే దేశం మనది. అలాంటి చోట సీబీఐ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందో సామాన్య జనానికి కూడా అర్థం అవుతోందని ఆమె అన్నారు. ఇవాళ టీడీపీ కూడా నీతిమాలిన విధానంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. 

శంకర్‌రావుకు ఎలా కేసు వేయాలో చెప్పిందీ, తమ కార్యాలయం నుంచి ఫ్యాక్స్‌లు పంపిందీ టీడీపీయేనని ఆమె అన్నారు. జగన్ జైలు నుంచి బయటకు వస్తే తమ పార్టీ ఉనికి ఉండదనే భయంతో ఆయనను శాశ్వతంగా జైల్లో ఉంచాలనే కుట్రకు టీడీపీ పాల్పడుతోందని ఆమె దుయ్యబట్టారు. ఇదే కేసులకు సంబంధించి ఇతర నిందితులు బెయిల్ పిటిషన్లు వేసుకుంటే సీబీఐ కనీసం వ్యతిరేకించనైనా లేదు, కానీ ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచిన ఒక ప్రజా నాయకుడిని, ఓ పార్టీ అధ్యక్షుడిని అన్యాయంగా జైల్లో నిర్భందించారని ఆమె అన్నారు. ఒక విధానం గానీ, పద్ధతి గానీ లేకుండా సీబీఐ వ్యవహరిస్తోందని తమకు నిబంధనలు లేవన్నట్లుగా ఉందని అన్నారు. ఇదంతా చూస్తూంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నట్లుగా ఉందని పదే పదే రుజువు అవుతోందని ఆమె అన్నారు. హైకోర్టులో జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి కారణమైన సీబీఐ వైఖరి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని అన్నారు. 

‘గత ఎమర్జెన్సీ రోజుల్లో మధు దండావతే, జయప్రకాష్ నారాయణ్, జార్జి ఫెర్నాండెజ్, కుల్దీప్ నయ్యర్ వంటి వారందరినీ జైల్లో పెట్టారు. కనీసం మీకు బెయిల్ అడగడానికి కూడా అర్హత లేదని ఆ నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు తీర్పు నిచ్చారు. అదే న్యాయమూర్తుల్లో కొందరు పదవి నుంచి దిగి పోయాక తాము చేసింది తప్పని అంగీకరించారు. ఇక్కడా అలాంటి పరిస్థితే వస్తుంది. ఇంత అన్యాయంగా అక్రమంగా కుమ్మక్కు రాజకీయాలతో పద్దెనిమిది నెలలుగా ఇష్టానుసారం దర్యాప్తు జరుపుతున్నారంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?’ అని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రజలు ఆనాడు ఎమర్జెన్సీ అనంతరం ఎలాంటి తీర్పునైతే ఇచ్చారో తెలుగు ప్రజలు కూడా రాష్ట్రంలో కచ్చితంగా అలాంటి తీర్పే ఇస్తారని ఆమె అన్నారు. సీబీఐ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక పద్ధతి లేకుండా దర్యాప్తు చేయడం గర్హనీయం అని ఆమె అన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుకే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఎందుకున్నట్లు? అని ఆమె అన్నారు. 
Share this article :

0 comments: