జనంపై రూ.32 వేల కోట్ల విద్యుత్తు భారమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనంపై రూ.32 వేల కోట్ల విద్యుత్తు భారమా?

జనంపై రూ.32 వేల కోట్ల విద్యుత్తు భారమా?

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013

* జనంపై రూ.32 వేల కోట్ల విద్యుత్తు భారమా? 
* కర్నూలు ధర్నాలో విజయమ్మ నిప్పులు 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడు బాటలోనే ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబు తన పాలనలో కరెంటు చార్జీలు వంద శాతం పెంచితే... వైఎస్ మరణం తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతోందని దుయ్యబట్టారు. బాబు దారిలో నడుస్తున్న ఈ సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కర్నూలు ఎస్‌ఈ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కిరణ్ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం కరెంటు ఇవ్వకుండా, భారీగా చార్జీలు పెంచుతూ ప్రజలను వేధిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని చెబుతున్న చంద్రబాబే అవిశ్వాసం పెట్టకుండా కిరణ్ సర్కారును కాపాడుతున్నారన్నారు. విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే...

ప్రజలపై ఇంత భారమా..?
2009 ఎన్నికల ముందు వైఎస్సార్ రెండు హామీలనే ఇచ్చారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు రేషన్ బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టకుండా మరో హామీ ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు కరెంటు బిల్లులు ఏవిధంగా అయితే పెంచలేదో, వచ్చే ఐదు సంవత్సరాలు కూడా బిల్లులు పెంచనని చెప్పారు. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత 2010-11 నుంచి 2012- 2013 వరకు రూ.6,870 కోట్ల కరెంటు భారం మోపగా... 2013-14లో మరో రూ.12,723 కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ఇవి కాకుండా సర్దుబాటు చార్జీల పేరుతో రూ.11,924 కోట్లు జనంపై వేశారు. 

అంటే కరెంటు చార్జీల రూపంలోనే దాదాపు రూ.32 వేల కోట్ల భారం వేశారు. ఇవేగాక బస్సు చార్జీలతో పాటు అన్ని రకాల చార్జీలు పెంచేశారు. చంద్రబాబు హయాంను మళ్లీ గుర్తుకు తెస్తున్నారు. విద్యుత్ బిల్లులు కట్టకుంటే చంద్రబాబు రైతులను వే ధించారు. కేసులు పెట్టారు. రైతులను జైలుపాలు చేశారు. ఆయన బాధలు పడలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, కరెంటు, మంచినీరు, మునిసిపాలిటీ... ఏ పన్ను పెంచలేదు. రైతులకు రూ.1,259 కోట్ల రుణాలను మాఫీ చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు. ఒక బల్బు, ఫ్యాన్ ఉన్న ఇళ్లకు ఉచిత కరెంటు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఉచిత కరెంటు ఇవ్వడం లేదు. కరెంటు కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారు. పల్లెల్లో పగలు కరెంటు ఉండడం లేదు. రాత్రిళ్లు 3 గంటలు మాత్రమే ఇస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. పరిశ్రమలు మూత పడుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. 2007లో కరెంటు సమస్య ఏర్పడితే వైఎస్సార్ రూ.17కు యూనిట్ చొప్పున కరెంటు కొని రూ.3.75కు పరిశ్రమలకు అందించి సంక్షోభం నుంచి కాపాడారు. కానీ ఈ సర్కారు ఇప్పుడు టెలిస్కోపిక్ విధానాన్ని కూడా ఎత్తేసి చార్జీలను రెట్టింపు చేయాలని ఆలోచించడం దారుణం.

ప్రజా సమస్యలు గాలికొదిలి.. పాదయాత్రలా?
ప్రజలు ఇన్ని బాధలు పడుతుంటే చంద్రబాబు వాటి గురించి పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ జరుగుతుంటే సమస్యలు ప్రస్తావించడానికి కూడా రాకుండా పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో మాట్లాడుతూ... ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు అని బాబు చెబుతున్నాడు. కానీ అవిశ్వాసం పెట్టమంటే పెట్టరు. చంద్రబాబుకు తన వాగ్దానాలను నిలబెట్టుకున్న చరిత్ర లేదు. 1994లో రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణ మద్య నిషేధం హామీలతో ప్రభుత్వం వచ్చింది. 1999లో ఆడపిల్లలు పుడితే రూ.6వేలు డిపాజిట్, పీజీ వరకు ఉచిత విద్యుత్, సైకిళ్లు ఇస్తామని చెప్పాడు. కానీ ఏమీ జరగలేదు. 2009లో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తానని, కలర్ టీవీలు ఇస్తానని చెప్పినాడు. 2012లో రుణమాఫీ అంటున్నాడు. ఆయన ఏ ఒక్క వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేదు. చంద్రబాబు అంత చరిత్ర హీనుడు ఎవరూ లేరు. వైఎస్ పథకాలన్నీ నేనిస్తానని చెబుతున్నాడు. అందుకు బదులు రాజన్న రాజ్యం తెస్తానని చెబితే బాగుంటుంది.

మీ బాధ ల రికార్డులను ఎవరు అధిగమిస్తారు?
వైఎస్ పాదయాత్రను అధిగమించానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ బాబు పాలనలో ప్రజలు అనుభవించిన బాధల రికార్డులను ఎవరూ అధిగమించలే రు. ఆ రోజు దేశంలో 87 పరిశ్రమలు ప్రైవేట్ వాళ్లకు ఇస్తే... చంద్రబాబునాయుడు లక్షల కోట్లు విలువ చేసే 45 పరిశ్రమలను నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టారు. అదీ రికార్డే. రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారి పక్షాన లేని రికార్డు కూడా ఆయనదే. ప్రభుత్వ ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చిన రికార్డు ఆయనదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినవన్నీ సవాలక్ష రికార్డులే.

జగన్ మీ పక్షానే ఉన్నానని చెప్పమన్నాడు
కర్నూలులో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా మహాధర్నాకు వెళుతున్నానని జగన్‌కు చెప్పగా... ‘అమ్మా నువ్వు ప్రజల కోసం వెళుతున్నావు. వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పు. ప్రజల కోసం ధర్నాలు చేయవలసిన అవసరం ఉంది..’ అని అన్నట్లు విజయమ్మ చెప్పారు. జగన్ బాబును అక్రమంగా జైల్లో పెట్టినందుకు నిరసనగా సంతకాల ఉద్యమం కొనసాగించి అండగా నిలవాలని కోరారు. ధర్నా అనంతరం విజయమ్మ పార్టీ నాయకులతో కలిసి ట్రాన్స్‌కో ఎస్.ఇ పీరయ్యకు కరెంటు చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఎమ్మెల్యేలు చెన్నకేశవ రెడ్డి, బాల నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ జిల్లా నాయకులు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: