జన సంతకాలు..త్వరలో రాష్ట్రపతికి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన సంతకాలు..త్వరలో రాష్ట్రపతికి

జన సంతకాలు..త్వరలో రాష్ట్రపతికి

Written By news on Sunday, January 13, 2013 | 1/13/2013

పార్టీ కార్యాలయానికి చేరిన కోటీ 78 లక్షల సంతకాలు
వాటిని రాష్ట్రపతికి పంపేందుకు వీలుగా ఏర్పాట్లు
సంతకాల పత్రాల స్కానింగ్..ఆపై ప్రత్యేక బాక్సుల్లో నిక్షిప్తం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం.. జనం సంతకం’ ద్వారా వచ్చిన సంతకాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా పార్టీ కార్యాలయానికి చేరిన కోటి 78 లక్షల సంతకాలను స్కానింగ్ చేసి సీడీలలో భద్రపరిచారు. వాటన్నింటినీ ప్రత్యేక బాక్సుల్లో అమర్చారు. సంతకాల హార్డ్‌కాపీలతో పాటు సీడీలనూ రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమాల్ని శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, రెహమాన్, బాజిరెడ్డి గోవర్ధన్, మారెప్ప, గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, కె.శివకుమార్ తదితర నేతలు పర్యవేక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై సీబీఐ చేత ఆడిస్తున్న కుట్రలు, కుతంత్రాల పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని మైసూరారెడ్డి అన్నారు. జగన్‌కు సంబంధం లేని కేసులు బనాయించడమేగాక బెయిల్ రాకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.

కక్షసాధింపునకు సీబీఐ అండ..

కాంగ్రెస్, టీడీపీల కక్షసాధింపు చర్యలకు సీబీఐ అండగా నిలుస్తోందని మైసూరా మండిపడ్డారు. బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానాల్లో ప్రతివాదనలు చేయడానికి లాయర్లు లేరని చెప్పడానికి సీబీఐకి సిగ్గుండాలని దుయ్యబట్టారు. జగన్‌ను మరింత కాలం అక్రమంగా నిర్బంధించడానికే కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి నాటకమాడుతున్నాయని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ బయటకొస్తే ప్రజలను పీల్చుకుతింటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని, అలాగే చంద్రబాబు దుకాణం మూతపడుతుందనే దుర్బుద్ధితోనే రెండు పార్టీల నేతలు కలిసి అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. వీరి ఆగడాలకు సీబీఐ శాయశక్తులా సహకరిస్తూ... న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అందుకే ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని, తాము చేపట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ఇంతటి ప్రజాభిమానం చూసిన తర్వాతైనా..కాంగ్రెస్, టీడీపీ, సీబీఐలు బుద్ధితెచ్చుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు.

జగన్ కోసం 30,000 మంది ఎన్నారైల సంతకాలు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా చేపట్టిన ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో 30 వేల మంది ప్రవాస భారతీయులు పాలు పంచుకుని సంతకాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్(యుఏఈ)లో సంతకాల కార్యక్రమం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియాలోని ప్రవాస తెలుగువారు ఆన్‌లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో సంతకాలు చేశారని వివరించారు. ఎన్నారై విభాగం ప్రతినిధులు నరసారెడ్డి, సి.చంద్రశేఖర్ కువైట్‌లో సంతకాల సేకరణ నిర్వహించగా ఛాయాదేవి, సోమిరెడ్డి, బ్రహ్మానంద్‌లు దుబాయ్‌లో సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని చెప్పారు. వారాంతపు సెలవుల్లో వీరంతా తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించారు. సంతకాల ప్రతులను ఎప్పటికపుడు స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారని వెంకట్ వివరించారు.
Share this article :

0 comments: