కాకి లెక్కల షాకులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాకి లెక్కల షాకులు

కాకి లెక్కల షాకులు

Written By news on Monday, January 7, 2013 | 1/07/2013

డిస్కంల ప్రతిపాదన.. అన్నదాతలపై ఏడాదికి రూ.1,000 కోట్ల భారం
ఐఎస్‌ఐ మోటార్లు వాడని, 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి ఉన్న అన్నదాతలపై పెనుభారం
ఏడాదంతా కరెంటు వాడకున్నా.. సగటు లెక్క ఆధారంగా పూర్తి బిల్లు కట్టాల్సిన పరిస్థితి..

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల వీరబాదుడులో రోజుకో రికార్డు బద్దలుకొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. చాన్స్ దొరికితే చాలు.. చార్జీలతో చావబాదడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అన్నదాతల నుంచీ కరెంటు చార్జీల వసూలుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం కొత్త మార్గాన్ని అనుసరించనుంది. ఇప్పటికే ఉన్న పాత నిబంధనలను తెరపైకి తెచ్చిన సర్కారు.. మీటర్లు లేకున్నా.. సగటు విద్యుత్ వాడకాన్ని లెక్కించి, చార్జీలు వసూలుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది! ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి తాజాగా సమర్పించిన ప్రతిపాదనల్లో స్వయంగా విద్యుత్ సంస్థలే వెల్లడించడం గమనార్హం. ఐఎస్‌ఐ మార్క్ మోటార్లు వాడ ని వారిపైనా.. 2.5 ఎకరాల కంటే ఎక్కువ తరి పొలం(మాగాణి) ఉన్న అన్నదాతలపైనా చార్జీల వడ్డింపునకు అవి సిద్ధమవుతున్నాయి. మీటర్ లేకున్నా.. సగటు రీడింగ్ పేరిట రైతుల నుంచి ఏడాదికి రూ.1,000 కోట్లు వసూలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

చార్జీల భారం ఇలా..రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్పొరేటు, ఐటీ రైతులకు మినహా అందరికీ ఉచిత విద్యుత్‌నే సరఫరా చేశారు. ప్రతి నెలా వసూలు చేయాల్సిన రూ.20 సర్వీసు చార్జీని వసూలు చేసిన దాఖలాలు లేవు. అయితే, ఇప్పుడు పాత నిబంధనలను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం వ్యవసాయ టారిఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. 

దీని వల్ల కార్పొరేటు, ఐటీ చెల్లించే రైతులతో పాటు 2.5 ఎకరాల కంటే ఎక్కువ తరిపొలం ఉన్న రైతులూ చార్జీలు చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం... కార్పొరేటు, ఐటీ చెల్లించే రైతులు యూనిట్‌కు రూ.2.50 చొప్పున.. 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి ఉంటే యూనిట్‌కు 50 పైసల చొప్పున చెల్లించాలి. వీరితోపాటు ఐఎస్‌ఐ మార్క్ మోటార్లు వంటి డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్(డీఎస్‌ఎం) పరికరాలు ఉపయోగించకపోతే కార్పొరేటు, ఐటీ చెల్లించే రైతులు యూనిట్‌కు రూ.3.50, 2.5 ఎకరాల కంటే ఎక్కువ తరి పొలం ఉంటే యూనిట్‌కు రూపాయి, 2.5 ఎకరాల కంటే తక్కువ మాగాణి ఉన్నప్పటికీ యూనిట్‌కు 50 పైసల చొప్పున చెల్లించాలి. డీఎస్‌ఎం పరికరాలు లేని మెట్టప్రాంత రైతులు కూడా యూనిట్‌కు 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా మీటర్లు లేకపోయినప్పటికీ చార్జీలు వసూలు చేస్తామని ఈఆర్‌సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. 

ఇంటికీ-పంటకీ లంకె: వాడని కరెంటుకు విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు ఓవైపు ప్రణాళికలు వేస్తున్న విద్యుత్ సంస్థలు.. మరోవైపు బకాయిల పేరుతో రైతులను వీరబాదుడు బాదుతున్నాయి. ఇందుకోసం ఇంటి బిల్లుకు పంట బిల్లుకు లంకె వేశాయి. ఇంటి బిల్లుతో పాటు వ్యవసాయ బకాయి బిల్లునూ కలిపి ఒకే బిల్లు రూపంలో పంపుతున్నారు. ఇంటి బిల్లు కట్టే సమయంలోనే ఇదీ కట్టాలని చెబుతున్నారు. ఒకవేళ చెల్లించకపోతే ఇంటికి ఉన్న కరెంటు కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. అప్పటికీ చెల్లించకపోతే కేసులు బనాయిస్తున్నారు. ఒక వినియోగదారుడికి రెండు కనెక్షన్లు ఉన్న సమయంలో... ఒక కనెక్షన్ బిల్లు చెల్లించకపోతే రెండో కనెక్షన్‌ను కట్ చేయవచ్చునంటూ విద్యుత్‌చట్టంలో ఉన్న లొసుగును ఇప్పుడు డిస్కంలు పేద రైతులపై ప్రయోగిస్తుండటం గమనార్హం. 

వాడని కరెంటుకూ బిల్లు..

మీటర్లు లేకపోయినా... కరెంటు వాడకాన్ని ఎలా లెక్కగడతారన్నదే మీ సందేహమా? అయితే, ఈ లెక్క చూడండి. మీకే మతి పోతుంది. రాష్ట్రంలో వ్యవసాయానికి రైతులు సగటున 5 హార్స్ పవర్(హెచ్‌పీ) సామర్థ్యం కలిగిన మోటార్లు వాడుతున్నారు. ఈ మోటారు వాడటం వల్ల గంటకు 3.73 యూనిట్లు(హార్స్‌పవర్‌కు 0.746 యూనిట్ల చొప్పున) కాలుతుంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ లెక్కన రోజుకు 26.11 యూనిట్లు... నెలకు 783.3 యూనిట్లకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.391.65. ఏడాదికి 9,399.6 యూనిట్లకుగానూ అది రూ.4,699.80 అవుతుంది. దీనికి నెలకు రూ.30 చొప్పున సర్వీసు చార్జీలు అదనం. 

ఈ లెక్కలతోనే రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో అన్ని రోజులూ వ్యవసాయ పనులుండవు. అంటే ఏడాది పాటు ఏకబిగిన రోజుకు ఏడు గంటలు పాటు మోటారును నడపాల్సిన అవసరం రైతుకు ఉండదు. మరోవైపు వ్యవసాయానికి రోజుకు ఏడు గంటల కరెంటు సరఫరా కావడమే లేదని ప్రభుత్వ లెక్కలే తేల్చిచెబుతున్నాయి. ఈ రబీ సీజనులో 4 గంటలే కరెంటు సరఫరా చేస్తామని విద్యుత్ సంస్థలు కొద్దిరోజుల క్రితం సీఎంకు స్పష్టం చేశాయి. పరిస్థితులు ఈ విధంగా ఉంటే మీటరు లేకపోయినా కాకి లెక్కలతో రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తామని విద్యుత్ సంస్థలు పేర్కొనడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే వాడని కరెంటుకూ రైతులు చార్జీలు చెల్లించాల్సి రానుందన్నమాట! ఈ విధంగా రాష్ర్టంలోని 30 లక్షల మంది రైతుల్లో సుమారు 20 లక్షల మంది రైతుల(ఐఎస్‌ఐ మార్క్ మోటారు వాడనివాళ్లు, 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి ఉన్నవాళ్లు) నుంచి వాడని కరెంటుకు చార్జీలను వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రూ.5 వేలు చొప్పున.. వీరి నుంచి రూ.వెయ్యి కోట్లు ముక్కు పిండి వసూలు చేయనున్నాయి.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=519045&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: