అక్రమాలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అక్రమాలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు

అక్రమాలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు

Written By news on Wednesday, January 23, 2013 | 1/23/2013

 రాష్ట్రంలో సహకార ఎన్నికలు ఒక ప్రహసనంలా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సహకార సంఘాల సభ్యత్వ నమోదులో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ ఆక్షేపించింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక ప్రహసనంలా జరుగుతున్న ఈ ఎన్నికల తీరును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ చూస్తూంటే ఇవి సహకార ఎన్నికలా లేక సహాయ నిరాకరణ ఎన్నికలా అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు. ఒక్క రోజులో పది లక్షల పైచిలుకు సభ్యత్వాలు చేర్పించిన ఘనత ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని విమర్శించారు. గత ఏడాది నవంబర్ 30 నాటికి 39,18,000 మంది సహకార ఓటర్లు ఉంటే డిసెంబర్ 21 నాటికి ఆ సంఖ్య 55,48,000కు పెరిగిందని ఆయన వివరించారు. అంటే కొత్తగా 11,30,000 మంది ఓటర్లు పెరిగారంటే సభ్యత్వంలో ఎన్ని అక్రమాలు, అవకతవకలు జరిగాయో అర్థమవుతోందన్నారు. సహకార సంఘాల పాలక మండళ్లు రద్దు కాకపోవడంతో పెయిడ్ సెక్రటరీలందరూ ప్రభుత్వం కనుసన్నల్లోనే పని చేయాల్సి వచ్చిందని చెప్పారు.

సభ్యత్వాల కోసం చాలా చోట్ల రైతులు ఆందోళన చేశారని తెలిపారు. సాక్షాత్తూ సహకార మంత్రి నియోజకవర్గమైన నర్సారావుపేటలోనే సహకారసంఘ కార్యాలయానికి తాళాలు వేసుకుని సభ్యత్వం చేర్చుకోవడానికి నిరాకరించారని, ఆందోళన చేసిన వారిని కేసులు పెట్టి అరెస్టులు చేశారని విమర్శించారు. సభ్యత్వం విషయంలో వేధింపులకు తాళలేక అనంతపురం జిల్లాలో ఒక పెయిడ్ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. అనంతపురం, నల్లగొండ, చిత్తూరు, మహబూబ్‌నగర్, వరంగల్, కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా సభ్యత్వాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సహకార సంఘాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే ఉదేశంతోనే ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు పాల్పడిందని, సభ్యత్వాల్లో ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని ఆయన ధ్వజమెత్తారు.


అధిష్టానం మెప్పుకోసమే అడ్డగోలు సభ్యత్వాలు: రెండేళ్లుగా పాలకవర్గాల గడువు పొడిగించుకుంటూ వస్తున్న ప్రభుత్వం... ఫిబ్రవరి 14వ తేదీ లోపల ఎన్నికలు నిర్వహించకపోతే అధికారం చేజారిపోతుందని హడావుడిగా ఇపుడు ఎన్నికలు నిర్వహిస్తోందని మైసూరా విమర్శించారు. రాష్ట్రంలో అడ్డగోలుగా సభ్యత్వాలు చేర్చుకుని తమకు బలం ఉందని కాంగ్రెస్ అధిష్టానం వద్ద మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ రహిత ంగా ఎన్నికలు జరపాలన్న స్ఫూర్తిని ఏ మాత్రం ప్రదర్శించలేదని విమర్శించారు. సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి కనుక ఇక రాజకీయ పార్టీలు పోటీ చేయడం, చేయకపోవడం అనే ప్రసక్తే ఉత్పన్నం కాదన్నారు. రైతులు స్వచ్ఛందంగా వారంతట వారే జరుపుకోవాల్సిన సహకార ఎన్నికల్లో ప్రభుత్వ జోక్యాన్ని తాము తొలినుంచీ నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే మీ పార్టీ వారు చాలామంది సహకార ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారు కదా అని ప్రశ్నించగా... ఎవరైనా స్థానికంగా పాల్గొంటే పాల్గొనవచ్చునని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మీ పార్టీ నేతలు సభ్వత్వాలపై ఆందోళనలు చేశారని ప్రస్తావించగా... ‘ఏ పార్టీ నేతలైనా వాళ్లు కూడా రైతులే కదా... రైతులుగా సభ్యత్వాలు చేర్చుకోవాలని కోరతారు. అలాగే రైతుల తరపున సభ్యత్వం ఇవ్వండని కోరి ఉంటారు... తప్పేముంది’ అని ఆయన వివరించారు. పంటలు పండించలేక, పండించినా గిట్టుబాటు ధరలు లేక, కరెంటు సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించి... మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలను, రైతులు కాని వారిని సభ్యులుగా చేర్చుకున్నారని ఆయన తెలిపారు.

బెయిల్ పిటిషన్‌పై
సీబీఐ, సర్కారు మిలాఖత్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనేదే సీబీఐ లక్ష్యంగా కనిపిస్తోందని మైసూరారెడ్డి ఆరోపించారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదనల్లో దర్యాప్తునకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ సీబీఐ కొత్త వాదన తెరమీదకు తేవడం చూస్తే సీబీఐ, ప్రభుత్వం మిలాఖత్ అయ్యాయనేది స్పష్టంగా కనబడుతోందని విమర్శించారు. కట్టలు కట్టలుగా ఫైళ్లు స్వాధీనం చేసుకుని తమ కార్యాలయానికి తీసుకెళ్లి పెట్టుకున్న సీబీఐ అధికారులు ఇంకా ప్రభుత్వం సహకరించలేదనో మరొకటో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడుగా ఎంపిక కావడంపై స్పందించాల్సిందిగా కోరగా... రాహుల్ పరిస్థితి ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లుందని మైసూరా వ్యాఖ్యానించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. 
Share this article :

0 comments: