హెరిటేజ్ మహా మోసం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హెరిటేజ్ మహా మోసం!

హెరిటేజ్ మహా మోసం!

Written By news on Monday, January 21, 2013 | 1/21/2013

పాల సేకరణ ధర తగ్గింపు 
విక్రయ ధర మాత్రం యథాతథం
వెన్న శాతంలో మార్పులేకున్నా లీటరుపై రూ.4 తగ్గింపు 
రెండు నెలల వ్యవధిలో నాలుగుసార్లు ధర కుదింపు
లబోదిబోమంటున్న రైతులు

సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులకు చెందిన హెరిటేజ్ డెయిరీ రైతులను నిలువునా ముంచేస్తోంది. సేకరించే పాల కొవ్వు శాతాల్లో ఎలాంటి మార్పు లేకున్నా రెండు నెలల్లోనే లీటరుపై రూ.4ల మేర సేకరణ ధరను తగ్గించింది. పాల సేకరణ ధరల నిర్ణయంలో పాలల్లోని వెన్న శాతానిదే కీలక భూమిక. వెన్నశాతం తగ్గినప్పుడే పాల సేకరణ ధర తగ్గిం చాలి. అయితే, ఇలాంటి నిబంధనలేమీ పట్టని హెరిటేజ్ యూజమాన్యం అడ్డగోలుగా ధరను తగ్గిస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు. హెరిటేజ్ డెరుురీ కింద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మినీ చిల్లింగ్ సెంటర్లతో పాటు ఐదు చోట్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. 

ఈ యూనిట్లకు అవసరమయ్యే పాలను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతుల నుంచి రోజూ 22 లక్షల లీటర్లకుపైగా సేకరిస్తోంది. గతేడాది నవంబర్ ద్వితీయార్థంలో లీటరు పాల సేకరణకు రూ.22.14 ధ రను చెల్లించింది. ఈ పాలల్లో ఫ్యాట్ 4.6 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్(సాలిడ్ నాట్ ఫ్యాట్) 8.6 శాతంగా ఉన్నట్లు రైతులకు జారీ చేసిన బిల్లుల్లో పేర్కొంది. డిసెంబర్ ప్రథమార్థంలో ఫ్యాట్ 5.4, ఎస్‌ఎన్‌ఎఫ్ 8.6 శాతాలుగా ఉన్న లీటరు పాలకు రూ.22.4ను చెల్లించింది. ఆ తర్వాత సేకరణ ధరలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. డిసెంబర్ ద్వితీయార్ధంలో ఫ్యాట్ 4.6, ఎస్‌ఎన్‌ఎఫ్ 8.6 శాతం ఉన్న లీటరు పాలకు రూ.21.33ను చెల్లించింది. ఇక, జనవరి ప్రథమార్ధంలో ఫ్యాట్ 4.7, ఎస్‌ఎన్‌ఎఫ్ 8.27 శాతం ఉన్న లీటరు పాలకు రూ.18.27 మాత్రమే చెల్లిం చింది. ఇలా కేవలం రెండునెలల వ్యవధిలో రూ.4మేర సేకరణ తగ్గించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలల్లోని వెన్న తదితరాల్లో పెద్దగా మార్పు లేకున్నా పాల సేకరణ ధరను తగ్గించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. 

ఇదేం పద్ధతి

లీటరుపై రూ.4 తగ్గిస్తే ఎలా? రోజూ పది లీటర్ల పాలను హెరిటేజ్‌కు పోస్తాను. లీటర్‌పై రూ.4 తగ్గిస్తే నెలకు రూ.1200 మేర నష్టపోతున్నాం. మాకిచ్చే రేట్లైతే తగ్గిస్తారు గానీ వారు అమ్మే పాల ధరలను ఎందుకు తగ్గించరు?
- శారదమ్మ, పాపిరెడ్డి పల్లి, గంగాధర నెల్లూరు మండలం, చిత్తూరు జిల్లా

గిట్టుబాటు ధర ఇవ్వాలి

ఇప్పటికే పశువుల దాణా, గడ్డి ధరలు విపరీతంగా పెరగడంతో పశుపోషణకు ఇబ్బంది పడుతున్నాం. రెండునెలల వ్యవధిలో రూ.4మేర తగ్గిస్తా ఎలా.. ఇప్పటికైనా హెరిటేజ్ గిట్టుబాటు ధర కల్పించకపోతే ప్రత్యామ్నాయంగా ఇతర డెయిరీకు పాలను పంపుతాం.
- మనోహర్, గుట్టకిందవూరు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా
Share this article :

0 comments: