అన్యాయాన్ని సరిచేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్యాయాన్ని సరిచేయండి

అన్యాయాన్ని సరిచేయండి

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

జగన్‌ను ఏడున్నర నెలలుగా అన్యాయంగా జైల్లో నిర్బంధించారు
మానవ హక్కులను సీబీఐ బాహాటంగా ఉల్లంఘిస్తోంది
ఏదైనా కేసులో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయకపోతే ఆటోమేటిక్‌గా బెయిల్ మంజూరు చేయాలన్నది చట్టం
కానీ.. సీబీఐ కుంటిసాకులు చెప్తూ అడ్డుకుంటోంది
జోక్యం చేసుకుని... ఈ అన్యాయాన్ని సరిచేయండి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రెండు కోట్ల మంది సంతకాలతో వినతిపత్రం సమర్పించిన విజయమ్మ
విజయమ్మ వినతిపత్రం పూర్తిపాఠం ఇదీ...


శ్రీ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ గారికి...
‘‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కోట్ల మంది ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిబింబించే ఈ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దర్యాప్తు పేరుతో మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఏడున్నర నెలలుగా కస్టడీలో నిర్బంధంలో ఉంచుతూ.. మానవ హక్కులను సీబీఐ బాహాటంగా ఉల్లంఘిస్తున్న ఉదంతాన్ని ఆంధ్రప్రదేశ్ వీక్షిస్తోంది. ఆయనను అక్రమంగా నిర్బంధంలో కొనసాగించటాన్ని నిరసిస్తూ రెండు కోట్ల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ ఉదంతంలో మీరు జోక్యం చేసుకుని సత్వర న్యాయం చేకూర్చాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించారని, అందుకు ప్రతిగా ఆ సంస్థలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఉన్నంత కాలం.. ఆయన, ఆయన తండ్రి కాంగ్రెస్ దృష్టిలో గౌరవనీయులైన వ్యక్తులుగానే ఉన్నారు. కానీ.. వైఎస్సార్ విషాద మరణాన్ని జీర్ణించుకోలేక గుండె ఆగి చనిపోయిన వారి, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు.. కాంగ్రెస్ నుంచి జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చిన క్షణంలో.. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిల్ వేశారు. ఆ వెంటనే శంకర్రావును రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎందుకో ఈ పరిణామాలే చెప్తున్నాయి. ఇక టీడీపీ కూడా అదే పిటిషన్‌ను వేయటం ఆశ్చర్యం కలిగించదు. ఆ పిటిషన్‌ను కూడా శంకర్రావు పిటిషన్‌తో జతచేశారు.

ప్రజలకు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం కోసం ప్రయత్నిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు ప్రాసిక్యూట్ చేయటానికి అత్యంత అనైతికంగా అధికార, ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రభుత్వ వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించారా లేదా, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి జీవోలు జారీ చేయటం ద్వారా లబ్ధి చేకూర్చారా లేదా అన్నదానిపై ముందుగా దర్యాప్తు చేయటానికి బదులు.. జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పలువురు వ్యక్తులు, సంస్థలు పెట్టిన పెట్టుబడులపై దర్యాప్తు చేయటం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించేందుకు సీబీఐ కక్ష సాధింపు ప్రారంభించింది. జగన్‌మోహన్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరుక్షణంలోనే.. అనూహ్యమైన రీతిలో 28 సీబీఐ బృందాలు.. జగన్‌మోహన్‌రెడ్డి యాజమాన్యంలోని సంస్థలు, వాటిలో పెట్టుబడి పెట్టిన సంస్థలపై దాడులు చేసింది.

దివంగత వైఎస్సార్ గురించి వ్యక్తిగతంగా తెలిసున్న అప్పటి కాంగ్రెస్ నాయకునిగా.. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ దశాబ్దాల పాటు ఒక బలమైన పునాదిగా ఉన్నారని, ఆయన తన చివరి శ్వాస వరకూ దేశానికి, ప్రజలకు సేవ చేశారని మీకు బాగా తెలుసు. నిబద్ధత గల వ్యక్తిగా డాక్టర్ వైఎస్సార్ ఎల్లప్పుడూ పేదల సంక్షేమానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. తను ఇచ్చిన హామీలపై ఎన్నడూ వెనుకడుగు వేయని అసాధారణమైన సద్గుణం ఆయన సొంతం.

వ్యవస్థీకృతమైన విధివిధానాలు, ప్రభుత్వ విధానాల నుంచి డాక్టర్ వైఎస్సార్ ఎన్నడూ దారితప్పరు. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు తన తరఫున వాదన వినిపించటానికి జీవించిలేని డాక్టర్ వైఎస్సార్ తప్పు చేశారని ఆపాదించటం సీబీఐకి న్యాయం కాదు. ప్రత్యేకించి వైఎస్సార్ మంత్రివర్గం జారీ చేసిన జీవోల్లో ఎలాంటి విధానపరమైన లోపాలూ లేనప్పుడు ఇలా చేయటం అన్యాయం. వివిధ మంత్రిత్వశాఖలు జారీ చేసిన 26 జీవోల విషయంలో సుప్రీంకోర్టుకు జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు.. ప్రభుత్వమే ఈ విషయాన్ని నిర్ధారించింది.

డాక్టర్ వైఎస్సార్ మంత్రివర్గం జారీ చేసిన జీవోలన్నీ సరైనవేనని, అందులో ఎలాంటి విధానపరమైన లోపాలూ లేవని, ఎటువంటి ప్రాధాన్యతాపూర్వక కేటాయింపులు జరగలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అధికారికంగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్విడ్ ప్రొ కో అనే ప్రశ్న ఎక్కడుంది? అలాంటప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కస్టడీలో ఎందుకున్నారు?

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విషయానికి వస్తే.. 2004-2009 మధ్యలో వైఎస్సార్ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందిన వారు ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. పెట్టుబడులు పెట్టిన వారు వారి షేర్ సర్టిఫికెట్లు అందుకున్నారు. తమ షేర్లను విక్రయించుకునే స్వేచ్ఛ వారికి ఉంది. షేరు ధరను ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా నిర్ణయించారు. ఆ పెట్టుబడులన్నీ ఒకేసారి రాలేదు. ఐదారేళ్ల కాలంలో వచ్చాయి. డాక్టర్ వైఎస్సార్ మరణించిన ఏడాది తర్వాత కూడా పెట్టుబడిదారులు అదే రేటుకు పెట్టుబడులు పెట్టారు.

పైగా.. ఈ రెండు సంస్థల (జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) విలువలను (వాల్యుయేషన్స్‌ను) కూడా.. పోటీదారులు వసూలు చేసిన దానికన్నా చాలా తక్కువగా నిర్ణయించారు. ఉదాహరణకు.. సాక్షి దినపత్రికను నిర్వహిస్తున్న జగతి పబ్లికేషన్స్ విలువ - మా పోటీదారైన మరో స్థానిక భాషా పత్రిక ఈనాడు విలువలో సగమే.

ఈ పెట్టుబడిదారుల్లో ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయనప్పుడు.. ఒక వ్యక్తి వ్యక్తిగత వ్యాపారాలు, వ్యవహారాల్లోకి చొరబడే హక్కు ప్రభుత్వానికి ఏముంది? ఒక ప్రైవేటు వ్యక్తి వ్యక్తిగత వ్యవహారాలపై దర్యాప్తు చేయలేమని మన ఆర్థికమంత్రి ఇటీవలే అధికారికంగా స్పష్టంచేశారు. అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్‌యాదవ్ ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేరని, కాబట్టి ఆమె వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేయజాలదని పేర్కొంటూ.. ఆమె వ్యవహారాలపై దర్యాప్తు చేయరాదని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది.

సీబీఐ దర్యాప్తు చేస్తున్న కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏ పదవిలోనూ లేరు. ఆయన బెంగళూరులో నివసిస్తున్న ఒక ప్రయివేటు వ్యక్తి మినహా మరేమీ కాదు. ఆయన ఎన్నడూ ఏ మంత్రితో కానీ, ఏ ఐఏఎస్ అధికారితో కానీ మాట్లాడలేదు. సచివాలయంలో కానీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు.

జగన్‌మోహన్‌రెడ్డి యాజమాన్యంలోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన డబ్బు.. ఆయన చేతుల్లోకి రాలేదు. ఆ ప్రాజెక్టుల్లోకి వెళ్లింది. ఆ డబ్బు ఆయన పెట్టుబడులతో పాటు ఇంకా అక్కడే ఉంది. ఈ స్థాపించిన సంస్థలు వాటి సామర్థ్యం మేరకు ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాయి. అవి 30 వేలకు పైగా కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాయి. భారతి సిమెంట్‌లో పెట్టుబడి పెట్టిన వారు.. ఆ సంస్థలో ప్రధాన వాటాను ఫ్రెంచ్ సిమెంట్ దిగ్గజం వికాట్ సిమెంట్స్‌కు విక్రయించినప్పుడు.. వారు పెట్టిన పెట్టుబడితో పోలిస్తే తమ సొమ్ముకు రెట్టింపు పొందారు.

జగతి పబ్లికేషన్స్ నిర్వహిస్తున్న సాక్షి దినపత్రిక.. ఏబీసీ ధ్రువీకృత సర్క్యులేషన్, ఇండియన్ రీడర్‌షిప్ సర్వేల ప్రకారం దేశంలో 8వ స్థానంలో ఉంది. ఈ దినపత్రిక ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలకు పైగా కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.

చట్టం దృష్టిలో అంతా సమానులుగా ఉండే, ప్రతి వ్యక్తికీ తన జీవితానికి, స్వేచ్ఛకు రాజ్యాంగం భద్రతలు, పరిరక్షణ కల్పించే మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో.. ఆరోపణలు నిరూపించకుండా, దోషిగా నిర్ధారించకుండా దాదాపు 8 నెలల కాలం జైలులో ఉండాల్సి రావటం విచారకరం. అరెస్టు చేసిన తర్వాత 90 రోజుల్లో దర్యాప్తు పూర్తికాకపోతే.. సహజంగానే (ఆటోమేటికల్లీ) బెయిల్ మంజూరు చేయాలని చట్టం విస్పష్టంగా చెప్తోంది.

కానీ.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ కోసం మేం ఎప్పుడు కోర్టులను ఆశ్రయించినా.. ఆయనకు బెయిల్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ చెప్తున్న కారణాలు నిస్సారంగా, మోసపూరితంగా ఉన్నాయి. జగన్ పార్లమెంటు సభ్యుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినందున.. సాక్ష్యాలను తారుమారు చేయగలరని, సాక్షులను ప్రభావితం చేయగలరని సీబీఐ చెప్తోంది. సీబీఐ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకుండానే బెయిల్ పొందిన మంత్రులు అధికార పార్టీలో ఉన్నారు. వారు.. ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి కన్నా ఆర్థికంగా, రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపగలవారు కాదా? పైగా.. ఆ 26 జీవోలకు సంబంధించిన అంశాలు 3 నుంచి 5 సంవత్సరాల పాతవి. అంటే.. స్వభావ రీత్యా అవి పురాతనమైనవి. అలాంటప్పుడు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రశ్న ఎక్కడిది?

దేవుడు మీకు ప్రసాదించిన మంచితనంతో ఈ ప్రగాఢమైన అన్యాయాన్ని సరిచేయాలని, మంచి చేయాలని విన్నవిస్తూ.. రెండు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విజ్ఞాపన పత్రంపై సంతకాలు చేసి మీకు సమర్పిస్తున్నారు. మేలు చేయటం, ఆపదలో ఉన్న వారికి ఉపశమనం అందించటం.. మనుషులు, దేవుడు మీకు అందించిన పవిత్రమైన బాధ్యత. మీ దయాపూరితమైన జోక్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆదర్శవంతమైన ఈ దేశంలో ఇక ఒక్క రోజు కూడా ఇలాంటి తీవ్రమైన అన్యాయం జరగకుండా మీరు చూడాలని మేం ప్రార్థిస్తున్నాం’’

వై.ఎస్.విజయమ్మ
గౌరవాధ్యక్షురాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Share this article :

0 comments: