కడవరకూ జగన్ నాయకత్వంలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కడవరకూ జగన్ నాయకత్వంలో

కడవరకూ జగన్ నాయకత్వంలో

Written By news on Monday, January 14, 2013 | 1/14/2013

వైఎస్సార్‌సీపీలోకి కాకినాడ సిటీ ఎమ్మెల్యే 
వైఎస్ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
ఆయన కుటుంబాన్ని వేధించారు..
అందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నా
కడవరకూ జగన్ నాయకత్వంలో కొనసాగుతానని ప్రకటన

కాకినాడ (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: పాతికేళ్లుగా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రముఖుల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాకినాడలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ద్వారంపూడి చేరికతో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ మరింతబలోపేతమవుతుందని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టటం లేదని ద్వారంపూడి విమర్శించారు. దీంతో కాంగ్రెస్‌లో కొనసాగటం వ్యర్థంగా భావించి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కర్రి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, 50 మంది మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.

అవిశ్వాసం పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకో: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదంటూ పాదయాత్రలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ద్వారంపూడి సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడితే.. దానికి మద్దతు ఇచ్చి డిస్‌క్వాలిఫై (అనర్హత) కావటం ద్వారా శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరినా తనకు తానుగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఉద్దేశం లేదన్నారు. 

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడినైన తాను చివరి వరకూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతానన్నారు. పార్టీ టికెట్టు ఇచ్చినా, కార్యకర్తగా పని చేయాలని జగన్ ఆదేశించినా కట్టుబడి ఉంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహానేత వైఎస్ హయాంలో ఇచ్చిన హామీలను మినహాయిస్తే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధీ చేయలేకపోయానన్నారు. వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారనే మనస్తాపం కూడా తానీ నిర్ణయం తీసుకోవటానికి కారణమైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, సభ్యులు ఎ.జె.వి.బుచ్చిమహేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Share this article :

0 comments: