టీడీపీ అనుయాయుల కోసం... సర్కారు ‘ఎస్సార్’! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ అనుయాయుల కోసం... సర్కారు ‘ఎస్సార్’!

టీడీపీ అనుయాయుల కోసం... సర్కారు ‘ఎస్సార్’!

Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013

- పొంతనలేని నిబంధనలతో ఏపీఎండీసీకి షోకాజ్ నోటీస్ 
- ముందు దరఖాస్తు చేసిన సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలట
- ఏడేళ్ల తర్వాత అనుకోకుండా ‘గుర్తుకొచ్చిన’ నిబంధనలు
- ఎస్.ఆర్. కన్నా ముందు దరఖాస్తు చేసిన సంస్థల మాటేమిటో! 
- విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇవ్వటానికి ‘కేసులు’ అవరోధమట! 
- ఎస్.ఆర్. ప్లాంటుకు ఇవ్వటానికి అవే కేసులు అవరోధం కాదా? 
- ఈ మలుపుల వెనుక రాష్ట్రంలో కీలక నేత, కేంద్రమంత్రి ఒత్తిళ్లు 
- టీడీపీతో కాంగ్రెస్ కుమ్మక్కుకు నిదర్శనమంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అందరి నోటా నానుతున్న వివాదాస్పద ఓబుళాపురం ఇనుప గనులను ఎస్.ఆర్. మినరల్స్ అనే ప్రయివేటు సంస్థకు అక్రమంగా కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. అనంతపురం జిల్లా ఓబుళాపురం ప్రాంతంలో అత్యంత మేలురకం ఇనుప ఖనిజ నిల్వలున్న 45 ఎకరాల మైనింగ్ లీజును తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతకు సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఎస్.ఆర్. మినరల్స్‌కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం తాజాగా పొంతన లేని నిబంధనలను తెరపైకి తెచ్చింది. 

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీని దెబ్బతీసి ఎస్.ఆర్.కు అక్రమంగా అనుచిత లబ్ధి చేకూర్చేందుకు సర్కారు పడుతున్న పాట్లు చూసి అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ‘ఎలాగైనా ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఏపీఎండీసీకి ప్రభుత్వం గత ఆగస్టు 6వ తేదీన షోకాజ్ నోటీసు (మెమో నంబరు 19040) జారీ చేసింది. ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు కట్టబెట్టాలన్న తపన తప్ప నిబంధనల ప్రకారం ఏపీఎండీసీకి మెమో జారీ చేయడంలో ఔచిత్యం లేదు. ప్రభుత్వం ఒక్కో కేసులో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ చట్టంలోని నిబంధనలను తనకు కావాల్సిన విధంగా కోట్ చేస్తోందని మెమోలోని అంశాలను బట్టే అర్థమవుతోంది. ఈ విషయం ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో మేం ఉన్నాం. ప్రభుత్వ పెద్దల తీరు వల్ల మాకు ఇబ్బందిగా ఉంది...’ అని భూగర్భ గనుల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

ప్రయివేటు కోసం ఏపీఎండీసీకి బండ...: ‘అటవీశాఖ క్లియరెన్సు తెచ్చుకునేందుకు శ్రద్ధ చూపనందున మీ దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదో 15 రోజల్లో వివరణ ఇవ్వాల’ని ఏపీఎండీసీకి ప్రభుత్వం పంపిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఏపీఎండీసీ 25 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం 27-10-2005న దరఖాస్తు చేసింది. ఎస్.ఆర్. మినరల్స్ ఇదే ప్రాంతంలోని 18 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం 12-10-2005నే దరఖాస్తు చేసింది. ఏపీఎండీసీకి ఈ 25 హెక్టార్ల మైనింగ్ లీజు ఇవ్వాలని పరిశీలించిన ప్రభుత్వం ఎస్.ఆర్. మినరల్స్ దరఖాస్తును తిరస్కరించాలని అప్ప ట్లో నిర్ణయించింది. దరఖాస్తు తిరస్కరించేందుకు ఎస్.ఆర్. మినరల్స్ నుంచి అప్ప ట్లో వివరణ కోరింది. ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా ముందు దరఖాస్తు చేసిన సంస్థకు ప్రాధాన్యం నిబంధనను తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం ఎస్.ఆర్. మినరల్స్ దరఖాస్తుకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ‘ఎస్.ఆర్. మినరల్స్ ఫారెస్ట్ క్లియరెన్సు కూడా తెచ్చుకుంది. రెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేసి వంద మందికి ఉపాధి కల్పించేందుకు ఎస్.ఆర్. మినరల్స్ ముందుకొచ్చింది. 

ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇనుప ఖనిజాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్‌కు సరఫరా చేయాలన్న షరతుతో ఎస్.ఆర్. మినరల్స్ మైనింగ్ లీజు దరఖాస్తును పరిశీలించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం ఏపీఎండీసీ దరఖాస్తు ను తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంది.. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వండి. లేని పక్షంలో ఈ మైనింగ్ లీజుపై ఆసక్తి లేదని భావించి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది...’ అని ప్రభుత్వం ఏపీఎండీసీకి పంపిన మెమోలో స్పష్టంగా పేర్కొంది. దీనిని బట్టే ఏపీఎండీకీకి బండ వేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. 

ముందు దరఖాస్తుకు ప్రాధాన్యం నిబంధన కొత్తగా వచ్చిందా? 
2005 నవంబర్ 10వ తేదీన 25 హెక్టార్ల మైనింగ్ లీజును కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఏపీఎండీసీకి ఎలా రాతపూర్వకంగా తెలియజేసింది. 2007 జూన్ 18వ తేదీన మరోమారు ఏపీఎండీసీకి మైనింగ్ లీజు ఇస్తామంటూ ప్రభుత్వం ఎలా లేఖ పంపింది. అప్పుడు ప్రభుత్వానికి.. ‘ముందు దరఖాస్తుకు ప్రాధాన్యం’ అనే నిబంధన తెలియదా? అని అధికారులే ప్రశ్నిస్తున్నారు. ‘వాస్తవమేమంటే మైన్స్ అండ్ మినరల్స్ చట్టం -1957, ఖనిజ రాయితీల చట్టం 1960లో అనేక సెక్షన్లు ఉన్నాయి. మైనింగ్ లీజు కోసం మొదట వచ్చిన దరఖాస్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఓ సెక్షన్ చెబుతోంది. 

అయితే ఇదే అంతిమ నిబంధన కాదు. ప్రజా ప్రయోజనాలు, ఖనిజాన్ని తవ్వి సక్రమంగా వినియోగించుకునే విషయంలో సంస్థ అర్హతలు, అనుభవం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మైనింగ్ లీజులు కేటాయించవచ్చు. అందువల్ల మొదటి దరఖాస్తుకు ప్రాధాన్యం పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం దరఖాస్తుదారులకు లేదు..’ అని సంబంధిత నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘అందువల్లే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఈ ప్రాంతంలోని మొత్తం 93.5 హెక్టార్ల మైనింగ్ లీజుకోసం ముందుగా దరఖాస్తు చేసినా అప్పట్లో వైఎస్ సర్కారు ఆ సంస్థకు 68.5 హెక్టార్ల మైనింగ్ లీజు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 

వెనుక దరఖాస్తు చేసినప్పటికీ మిగిలిన 25 హెక్టార్లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీకి ఈ మేరకు రెండుసార్లు ప్రభుత్వం లేఖలు పంపింది’ అని గుర్తుచేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మొత్తం తాను దరఖాస్తు చేసిన 93.5 హెక్టార్లలో 68.5 హెక్టార్లు పోను మిగిలిన 25 హెక్టార్లు కూడా మొదటి దరఖాస్తుదారైన తనకే కేటాయించాలంటూ ఓఎంసీ కేంద్ర ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించటంతో కేంద్ర ప్రభుత్వం ఈ రివిజన్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీనినిబట్టే ముందు వచ్చిన దరఖాస్తు నిబంధన చెల్లదని స్పష్టమైంది. దీంతో ఎస్.ఆర్. మినరల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించాలన్న ప్రభుత్వ తాజా నిర్ణయంలో ఔచిత్యం లేదని స్పష్టమవుతోంది. ఫారెస్ట్ క్లియరెన్సు తెచ్చుకున్నంత మాత్రాన ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలని చట్టంలో నిబంధన ఎక్కడా లేదు. ఇలా కోరే హక్కు కూడా ఏ సంస్థకూ లేదు. ఖనిజ రాయితీ చట్టం - 1960 ఈ విషయం స్పష్టంగా చెబుతోంది. 

తనకు తానే మెమో ఇచ్చుకున్న ఉన్నతాధికారి?: పెపైచ్చు ఫారెస్ట్ క్లియరెన్సు ఇవ్వాల్సింది ప్రభుత్వం. ఏపీఎండీసీ ప్రభుత్వం రంగ సంస్థ. దీనికి ఫారెస్టు క్లియరెన్సు ఇప్పించాల్సింది ప్రభుత్వమే. ఈ పనిచేయకుండా ఫారెస్ట్ క్లియరెన్సు తెచ్చుకునే విషయంలో సరైన శ్రద్ధ చూపనందున ఏపీఎండీసీ మైనింగ్ లీజును రద్దు చేయాలని నిర్ణయించి మెమో జారీ చేయడం అన్యాయం. ఫారెస్ట్ క్లియరెన్సు సాధన కోసం ఏపీఎండీసీ శ్రద్ధ చూపనందున మైనింగ్ లెసైన్సు దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దాసరి శ్రీనివాసులు మెమో జారీ చేశారు. 

ఆయన ఏపీఎండీసీకి చైర్మన్‌గా కూడా ఉండటం విశేషం! ఏపీఎండీసీ ఫారెస్ట్ క్లియరెన్సు సాధనపై శ్రద్ధ చూపకపోతే ఆ సంస్థ చైర్మన్ హోదాలో అధికారులను ఆ దిశగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితోపాటు ప్రభుత్వంపైనా ఉంది. పెపైచ్చు ఫారెస్ట్ క్లియరెన్సు కోసం తాము 2005లోనే దరఖాస్తు చేశామని ఏపీఎండీసీ ప్రభుత్వానికి పంపిన వివరణలో స్పష్టం చేసింది. ఎస్.ఆర్. మినరల్స్‌కు జారీ చేసిన ఫారెస్ట్ క్లియరెన్సును రద్దు చేయించి తమకు ఫారెస్ట్ క్లియరెన్సు ఇప్పించి మైనింగ్ లీజు ఇవ్వాలని కూడా కోరింది. 

విశాఖ స్టీల్ ప్లాంటుకు ఎందుకివ్వరాదు?: విశాఖ స్టీల్ ప్లాంటుకు ఖనిజం సరఫరా చేయాలన్న షరతుతో ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలని ప్రతిపాదించడంలోనూ ఏమాత్రం అర్థంలేదు. దీని బదులు ఏపీఎండీసీకే మైనింగ్ లీజు ఇచ్చి ఆ సంస్థ ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంటుకు ఖనిజాన్ని సరఫరా చేయవచ్చు. లేదా నేరుగా విశాఖ స్టీల్ ప్లాంటుకే మైనింగ్ లీజు ఇవ్వవచ్చు. 

విశాఖ స్టీల్ ప్లాంటుకు మైనింగ్ లీజులు ఇస్తామని కొన్నాళ్ల కిందట ఇందిరమ్మ బాట సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నంలో చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు అనంతపురం జిల్లాలోనే మైనింగ్ లీజు కోసం దరఖాస్తు కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో గనుల సరిహద్దు వివాదం కోర్టులో ఉన్నందున కేటాయించలేమని ప్రభుత్వం తరఫున కొన్ని నెలల కిందట గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటించారు. మరి.. ఎస్.ఆర్. మినరల్స్‌కు లీజు మంజూరు చేయాలని అమితాసక్తి చూపుతున్న సర్కారుకు ఈ వివాదం ఎందుకు గుర్తుకు రావడంలేదు. ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించిన మైనింగ్ లీజును టీడీపీ అనుయాయునికి చెందిన ఎస్.ఆర్. మినరల్స్‌కు ఇవ్వాలని నిర్ణయించడాన్ని బట్టే టీడీపీ - కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం అర్థమవుతోందని అధికార వర్గాలతోపాటు రాజకీయ పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. 

తెరపైకి ఇనుము శుద్ధి కర్మాగారం
ఒకవేళ ప్రభుత్వం ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించినా ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు రాదు. ముందు దరఖాస్తు నిబంధన ప్రకారమే చూసినా ఎస్.ఆర్. మినరల్స్ కంటే ముందు దరఖాస్తు చేసిన సంస్థలు ఎనిమిది ఉన్నాయి. వాటిని కాదని ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినా కేంద్రం తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. అందువల్లే ఇనుము శుద్ధి కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదనను తాజాగా ఎస్.ఆర్. మినరల్స్ తెరపైకి తెచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల సూచన మేరకు ఈ ప్రతిపాదన రాగానే దీనికి అనుకూలంగా సచివాలయ స్థాయిలో ఫైలు చకచకా కదిలింది. ‘ఓబుళాపురం ప్రాంతంలో సరిహద్దు సర్వే పూర్తయ్యే వరకూ మైనింగ్ లీజులు కేటాయించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుకే విశాఖ స్టీల్ ప్లాంటు దరఖాస్తును కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మైనింగ్ లీజు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. అయితే ఎస్.ఆర్. మినరల్స్ కోసం చాలా పెద్ద తలలు ఒత్తిడి తెస్తున్నందున ఏమైనా జరగొచ్చు’ అని ఓ అధికారి పేర్కొన్నారు. రాయలసీమకు చెందిన ఓ మాజీ మంత్రితో పాటు రాష్ట్రంలో కీలక నేత, ఓ కేంద్రమంత్రి ఎస్.ఆర్.కు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

sakshi
Share this article :

0 comments: