ఏడు అంశాల్లో జగన్‌ను సీబీఐ కావాలనే రిమాండ్ కోరలేదని... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏడు అంశాల్లో జగన్‌ను సీబీఐ కావాలనే రిమాండ్ కోరలేదని...

ఏడు అంశాల్లో జగన్‌ను సీబీఐ కావాలనే రిమాండ్ కోరలేదని...

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

జస్టిస్ శేషశయనారెడ్డి తీర్పు
సీబీఐ కావాలనే జగన్ రిమాండ్ కోరలేదనే విషయం తెలుసునని వ్యాఖ్య

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏడు అంశాల్లో సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన తరువాతనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ మేరకు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. ఏడు అంశాల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా సీబీఐ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదని, అందువల్ల బెయిల్ మంజూరు చేయలేమని పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ను గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

దీన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై వాదనలు విని రెండ్రోజుల క్రితం తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి... గురువారం ఉదయం 10.25 గంటలకు తీర్పు వెలువరించారు. ఆ సమయంలో కోర్టుహాలు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. 
‘సుప్రీంకోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌పై జారీ చేసిన ఉత్తర్వుల్లో మూడు అంశాల గురించి స్పష్టంగా పేర్కొంది. అందులో మొదటిది, సీబీఐ చెప్పిన ఏడు అంశాల్లో దర్యాప్తు పూర్తి చేసి సమగ్రంగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలి. రెండోది, సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన తరువాతనే జగన్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించొచ్చు. మూడోది, జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావానికి లోనుకాకుండా, జగన్ దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్‌ను దిగువ కోర్టు విచారించాలి. 

ఈ నేపథ్యంలో ఏడు అంశాలకు సంబంధించి సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేయకుండానే జగన్ దాఖలు చేసిన ఈ బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం న్యాయపరంగా సముచితం కాదు. కాబట్టి సీఆర్‌పీసీ సెక్షన్లు 436, 439 కింద జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆమేరకు కొట్టివేస్తున్నా...’ అని జస్టిస్ శేషశయనారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ... సీబీఐ దర్యాప్తునకు కాలవ్యవధి నిర్ణయించాలని, ఆ మేర ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. దీనికి జస్టిస్ శేషశయనారెడ్డి స్పందిస్తూ, జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఇరుపక్షాల న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఉన్నారని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టునే అడిగి ఉండాల్సిందని అన్నారు. ఏడు అంశాల్లో జగన్‌ను సీబీఐ కావాలనే రిమాండ్ కోరలేదని, ఈ విషయం తనకు స్పష్టంగా తెలుసునని, అయినప్పటికీ ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: