వ్యక్తులనుబట్టి న్యాయం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వ్యక్తులనుబట్టి న్యాయం..

వ్యక్తులనుబట్టి న్యాయం..

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

* పటాన్‌చెరు సభలో వైఎస్ విజయమ్మ 
* మంచం కింద కోట్లు దొరికినా చిరంజీవిపై కేసుల్లేవు
* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందునే చంద్రబాబుపై దర్యాప్తులుండవు
* ఎఫ్‌డీఐ బిల్లుకు బాబుకెంతముట్టిందో చెప్పాలి
* వైఎస్ చొరవ వల్లే హైదరాబాద్ అభివృద్ధి 
* చంద్రబాబు మాటలకు విశ్వసనీయత లేదు
* వైఎస్ స్వర్ణయుగాన్ని తెస్తానని చెప్పాలి
* ఎఫ్‌డీఐ బిల్లుకు ఎంతముట్టిందో వెల్లడించాలి 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి (మెదక్): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేయడం లేదు. సీబీఐని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్, బాబు రాజకీయాలు చేస్తున్నారు. ఇక పార్టీని రూ.80 కోట్లకు హోల్‌సేల్‌గా అమ్ముకుని, రూ.30 కోట్లు మంచం కింద దొరికినా చిరంజీవిపైన కేసులే లేవు. 

ఇక్కడ వ్యక్తులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం దక్కుతోంది...’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులో మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా మైత్రి క్రీడా మైదానంలో గురువారం జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘కోర్టుకు వెళ్లి జగన్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయించారు. దివంగత సీఎం వైఎస్ పిలిస్తే పలకలేరని తెలిసీ ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు..’ అని విజయమ్మ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..
‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన నడకలోనూ, నడతలోనూ విశ్వసనీయత లేదు. తన రాజకీయ జీవితంలో ఏ జిల్లాకు, ఏ వర్గానికీ మేలు చేయని బాబు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు డిక్లరేషన్‌లు అంటూ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎఫ్‌డీఐ బిల్లుకు వ్యతిరేకంగా ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు ఓటు వేయలేదు. ఆ బిల్లు ఆమోదానికి రూ.125 కోట్లు ఖర్చు పెట్టినట్లు వాల్‌మార్ట్ చెప్పింది. చంద్రబాబుకు అందులో ఎంత ముట్టిందో చెప్పాలని’ విజయమ్మ విమర్శలు గుప్పించారు. ‘ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ చంద్రబాబు కాంగ్రెస్‌తో ఇదే రకంగా కుమ్మక్కయ్యారు’ అంటూ ఎండగట్టారు. ‘చంద్రబాబు చెప్పింది జీవితంలో ఏనాడూ చేయలేదు. వైఎస్ చేపట్టిన పథకాలను కొనసాగిస్తానని ఆయన చెప్తున్నారు. వైఎస్ స్వర్ణయుగాన్ని తెస్తానని అంటే బాగుంటుంది’ అని సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధి.. వైఎస్ చలవే...
‘హైదరాబాద్ అభివృద్ధి తన వల్లే జరిగిందని, సాఫ్ట్‌వేర్, ఐటీ, టూరిజం అభివృద్ధి తన వల్లేనంటూ బాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన చేసిందల్లా ఐఎంజీకి రూ.50 వేలకు ఎకరం చొప్పున 800 ఎకరాలు కట్టబెట్టడం. హైదరాబాద్ నడిబొడ్డున ఎంఆర్ ప్రాపర్టీస్‌కు రూ.29 లక్షలకు ఎకరం చొప్పున 537 ఎకరాలు కేటాయించడం. రహేజాకు హైటెక్ సిటీ సమీపంలో 110 ఎకరాలు పప్పు బెల్లాలు పంచినట్లు పంచడం...అని ఎద్దేవా చేశారు. ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ వంటి కంపెనీలు చంద్రబాబు హయాంలోనే మూత పడ్డాయని’ విజయమ్మ గుర్తు చేశారు. ‘పల్లెలతో పాటు హైదరాబాద్‌ను అదే స్థాయిలో వైఎస్ అభివృద్ధి చేశారు. ఎనిమిది లేన్లతో 160 కిలోమీటర్ల మేర అతిపెద్ద రింగు రోడ్డు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని కలిపేందుకు 11.6 కిలోమీటర్ల ఫ్లై ఓవర్, సిటీలో 14 ఫ్లై ఓవర్లు వైఎస్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.

వైఎస్ ముందు చూపు వల్లే ఫ్యాబ్‌సిటీ ఏర్పాటైంది. వైఎస్ హయాంలోనే నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌కు 5.5 టీఎంసీల తాగు నీరు వచ్చిందన్న విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటి ఎకరాలకు సాగు నీరు అందించడం, గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఆరోగ్య శ్రీ సమర్ధ నిర్వహణ, 104, 108 సర్వీసుల పునరుద్ధరణ, పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో రూ.500 జమ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రైతులకు రూ.3వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ వంటివి అమలు చేస్తామని’ విజయమ్మ పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ మెదక్ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, నేతలు కొండా రాఘవరెడ్డి, రహమాన్, అంజిరెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, విజయారెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: