సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది

సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది

Written By news on Wednesday, January 23, 2013 | 1/23/2013

హైకోర్టు దృష్టికి తెచ్చిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది 
దర్యాప్తు సంస్థ తీరుపై అభ్యంతరం 
పరిస్థితులు మారితే బెయిలు ఇవ్వొచ్చని వెల్లడి
దర్యాప్తునకు మరింత గడువు కోరిన సీబీఐ.. ఎన్నాళ్లు కొనసాగిస్తారని హైకోర్టు ప్రశ్న
జగన్ బెయిలు పిటిషన్‌పై వాదనలు పూర్తి; తీర్పు రేపటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్: దిగువ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఒక్కోచోట ఒక్కోలా చెబుతోందంటూ సీబీఐ తీరుపై వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చెబుతూ కోర్టుల్ని సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తన సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో జగన్ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వాదనల సందర్భంగా మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తునకు మరింత గడువు కావాలన్న సీబీఐ తీరును వ్యతిరేకించారు. ఈ కేసు చాలా క్లిష్టమైనదని, అందుకే దర్యాప్తు పూర్తి చేయలేకపోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వమూ తమకు సహకరించడం లేదని.. అయినా సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామంటూ దాటవేత ధోరణిలో సీబీఐ వినిపించిన వాదనను న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. దర్యాప్తునకు నిర్దిష్ట గడువనేది ఉండాలని, అలాంటిదేమీ లేకుండా ఎన్నాళ్లు సాగదీస్తారని నిలదీసింది. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేయటాన్ని కూడా న్యాయమూర్తి శేషశయనారెడ్డి ప్రస్తావించగా... తాము పేర్కొన్న ఏడంశాలకు గాను మూడింటిలో మాత్రమే మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామన్నామని సీబీఐ తరఫు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ భాన్ జవాబిచ్చారు. దీనిపై నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల్ని సీబీఐ పదేపదే ప్రస్తావించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఒక ఉదాహరణ చెబుతూ... ‘‘ఒక కేసులో సుప్రీం బెయిలు ఇవ్వరాదని చెప్పిందనుకోండి. మరి ఆ కేసులో రెండు పార్టీలూ ఒక రాజీకి వస్తే రాజీ చేయకుండా ఊరుకుంటామా? అందుకు వీల్లేదంటామా?’’ అని ప్రశ్నించారు. బోఫోర్స్‌లో లెటర్ ఆఫ్ రొగేటరీలకు సమాధానం రావటానికి పదేళ్లకు పైనే పట్టిందని గుర్తు చేస్తూ... ‘‘అలాంటి సందర్భాల్లో పదేళ్ల పాటు నిందితులను జైల్లో ఉంచేస్తారా?’’ అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సహకరించకపోవచ్చు. మరి అదే సాకుతో పిటిషనర్‌ను జైల్లో ఉంచేస్తారా? రాజకీయ దురుద్దేశాలతో కూడిన కేసుల్లో దర్యాప్తునకు ఎన్నాళ్లయినా పట్టొచ్చు. మరి అన్ని రోజులూ బెయిలు ఇవ్వకూడదనటం కరెక్టా?’’ అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి... తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. 

పరిస్థితులు మారితే బెయిలివ్వొచ్చు: సీబీఐ పదేపదే సుప్రీం ఉత్తర్వులను ప్రస్తావిస్తుండటంతో... ఈ బెయిలు పిటిషన్ దాఖలు చేయటానికి అవి అడ్డు రావటం లేదా? అని కోర్టు జగన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘‘పై కోర్టు బెయిలును తిరస్కరించినా సరే... ఆ తరవాత గనక పరిస్థితులు మారినట్లయితే కింది కోర్టు బెయిలు మంజూరు చేసే అవకాశం ఉంది’’ అంటూ నిరంజన్‌రెడ్డి రెండు కేసులను ప్రస్తావించారు. బాబు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (1978), కల్యాణ్ చంద్ర సర్కార్ వర్సెస్ రాజేష్ రంజన్ (2005) కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేనాటికి, ఇప్పటికి పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఎలా మారాయో నిరంజన్‌రెడ్డి వివరంగా తెలియజేశారు. 

అరెస్టుపై వైఖరి మారింది: ‘‘మొదటి చార్జిషీట్లో (సీసీ-8) జగన్‌ను అరెస్టు చేసినట్లుగా సుప్రీంకోర్టులో చెప్పిన సీబీఐ... తానెన్నడూ ఈ చార్జిషీట్లో ఆయన్ను అరెస్టు చేయలేదని, రిమాండ్‌ను కూడా కోరలేదని ఇప్పుడు చెబుతోంది. ఈ పిటిషన్‌కు ప్రతిగా దాఖలు చేసిన కౌంటర్‌లోని 4, 5 పేరాల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టులో మాత్రం బెయిలు ఇవ్వొద్దని అభ్యర్థిస్తూ పేర్కొన్న అంశాల్లో సీసీ-8ను స్పష్టంగా పేర్కొంది. సుప్రీం ముందు సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో దీన్ని స్పష్టంగా చూడొచ్చు కూడా. మొదటి చార్జిషీట్లో నిందితుడి రిమాండ్ తమకు అక్కర్లేదని ఇప్పుడు సీబీఐ తనంత తనే చెబుతున్న నేపథ్యంలో ఇక జగన్‌మోహన్‌రెడ్డిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి కింది కోర్టు కూడా ఈ చార్జిషీటును విచారణకు స్వీకరిస్తూ వారెంట్లేమీ జారీ చేయలేదు. కేవలం సమన్లు మాత్రమే ఇచ్చింది’’ అని తెలిపారు. 

వాన్‌పిక్ కేసులో బాండ్‌ను అనుమతించారు: వాన్‌పిక్ కేసులో జగన్‌కు బెయిలు మంజూరైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా... తాము జగన్‌ను సీసీ నంబర్ 14లో అరెస్టు చేశామని, దాన్లోనే రిమాండ్ అడిగామని సీబీఐ పేర్కొంది. నాటి సుప్రీం ఉత్తర్వుల అనంతరం సీసీ-14లో (వాన్‌పిక్ కేసు) బాండ్‌ను సమర్పించటం, దాన్ని కోర్టు అంగీకరించటం జరిగింది. పరిస్థితులు మారాయనటానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. మొదటి చార్జిషీట్లో దర్యాప్తు పూర్తయిందని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది కూడా’’ అని తెలియజేశారు. ఏడు అంశాలపై మాత్రమే దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సుప్రీంకు సీబీఐ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లోనూ (ఎఫ్‌ఐఆర్ లేదా ఆర్‌సీ-19) పిటిషనర్‌ను అరెస్టు చేశామని సీబీఐ చెబుతోందని, కానీ సుప్రీంకోర్టులో చెప్పిన ఆ ఏడంశాలకూ సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 167 కింద ఎన్నడూ రిమాండ్‌ను పొడిగించాలని కోరలేదని తెలిపారు. ఈ అంశాన్ని కోర్టు కూడా గుర్తించిందని, ఈ వైఖరి పిటిషనర్ కస్టడీ తీరును పూర్తిగా మార్చేసిందని ఆయన వివరించారు. ఇలా పరిస్థితులు మారాయి కనుక సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ పిటిషనర్ బెయిలుకు అర్హుడని తెలియజేశారు. 

మారిన పరిస్థితులు గమనించాలి: దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని గతేడాది అక్టోబర్ 5న సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసిందని చెబుతూ...‘‘సాధారణంగా అయితే దర్యాప్తును 24 గంటల్లో పూర్తి చేయాలన్నది సుప్రీంకోర్టు నిర్దేశం. దాన్ని ఒకసారి 15 రోజులుకు పొడిగించొచ్చు. కానీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినా సరే మూడున్నర నెలలుగా సీబీఐ దర్యాప్తును పూర్తి చేయలేదు. పిటిషనర్ రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇలా కస్టడీని పొడిగించటమే మారిన పరిస్థితిగా గుర్తించాలి’’ అని కోరారు. 1992లో సీబీఐ వర్సెస్ అనుపమ్ కులకర్ణి మధ్య నడిచిన కేసులో సుప్రీం కోర్టు తీర్పును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే సీఆర్‌పీసీలోని సెక్షన్ 309 కింద... పిటిషనర్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాక రిమాండ్‌ను ఒకసారి 15 రోజుల పాటు మాత్రమే పొడిగించే వీలుందని నిరంజన్ గుర్తు చేశారు. ‘‘ప్రతి 15 రోజుల తరవాత రిమాండ్‌ను పొడిగించాల్సిన అవసరం ఉందని భావిస్తే... దానికి తగ్గ కారణాలను రికార్డు చేశాక కోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టి రిమాండ్ పొడిగించిన ప్రతిసారీ పరిస్థితులు మారినట్లేనని గమనించాలి’’ అంటూ ఆ సెక్షన్‌ను ఆయన పూర్తిగా వివరించారు. 

ఇలా చూసినా బెయిలిచ్చి తీరాలి: కేసు అంశాలను చూసినా పిటిషనర్‌కు బెయిలిచ్చి తీరాలని నిరంజన్‌రెడ్డి గట్టిగా వాదించారు. మొదటి చార్జిషీటుకు సంబంధించి తొలి నిందితుడు జగన్‌మోహన్ రెడ్డితో పాటు పలువురికి కోర్టు సమన్లిచ్చిందని, కానీ మొదటి నిందితుడిని, రెండో నిందితుడైన విజయసాయిరెడ్డిని మినహా ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరిలో కూడా రెండో నిందితుడికి బెయిలు మంజూరైందన్నారు. ‘‘జగన్ ఒక్కరే తొలి చార్జిషీటుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. నిజానికి ప్రాథమికంగా నిందితులైన వ్యక్తుల్ని కనీసం కస్టడీలోకి కూడా తీసుకోలేదు. పెపైచ్చు దర్యాప్తు కూడా పూర్తయింది. కానీ పిటిషనర్‌ను మాత్రం కస్టడీలో కొనసాగిస్తున్నారు. ఇది అవసరం లేదు. ఇవన్నీ కాకుండా పిటిషనర్‌పై వేరువేరు కేసులు పెడుతున్నారు. ఆయన్ను జైల్లో ఉంచి ఇలా కేసులు పెట్టడం వల్ల ఆయనకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి సరైన అవకాశం ఇవ్వనట్లే. ఇది సరైన విచారణ కాదు. ఇలాంటి సమయాల్లో బెయిలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు కూడా చెబుతోంది’’ అని వివరించారు. 

ఆయన ప్రజా ప్రతినిధి కూడా

పిటిషనర్‌ను కస్టడీలో ఉంచటం వల్ల ఆయన ఒక్కరే కాదు. ఆయన నియోజకవర్గ ప్రజలు, సామాన్యులు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కనుక, ఎంపీ కనుక.. బయట ఉంటే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. ఆయన్ను కస్టడీలో కొనసాగించటం వల్ల వారందరి హక్కులు కూడా దెబ్బతింటున్నాయి. సానుకూలతల సమానత్వాన్ని చూసినపుడు అది పిటిషనర్‌వైపే మొగ్గుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా తన నియోజకవర్గంలోని ప్రజలకు, పార్టీ సభ్యులకు తగిన విధంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది’’ అని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Share this article :

0 comments: