ఉచితానికి ఎసరు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉచితానికి ఎసరు!

ఉచితానికి ఎసరు!

Written By news on Wednesday, January 2, 2013 | 1/02/2013

రెండున్నర ఎకరాలకు మించి మాగాణి ఉంటే బాదుడే
యూనిట్‌కు రూపాయిన్నర వరకు విద్యుత్ చార్జీ వసూలు చేసే యోచన
2004లో కూడా యూనిట్‌కు 50 పైసల చార్జీ నిబంధన ఉన్నా అమలు కాని వైనం
రూ. 20 సర్వీసు చార్జీ కూడా వసూలు చేయని వైఎస్ ప్రభుత్వం
పాత బకాయిలూ వసూలు చేసేందుకు ప్రస్తుత సర్కారు సిద్ధం!
మెట్ట రైతులకు కనెక్షన్లు కుదించే యోచన

సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే దిశలో ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. ఆంక్షలతో అన్నదాతను ఉచిత విద్యుత్‌కు దూరం చేసే యోచనలో ఉంది. పాత, ఇప్పటివరకు అమలుకాని నిబంధనలు తెరపైకి తెస్తోంది. అలాగే రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ తరి పొలం (మాగాణి) ఉన్న రైతుల నుంచి యూనిట్‌కు ఏకంగా రూపాయి నుంచి రూపాయిన్నర వరకూ విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. పాత బకాయిల వసూలుకూ సిద్ధమవుతోంది. మరోవైపు మెట్ట రైతులకు ఇచ్చే కనెక్షన్ల సంఖ్యను కుదించే యోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరపు (2013-14) విద్యుత్ చార్జీల విధానంపై సర్కారు కసరత్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరులోగానే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించాల్సి ఉంది. అయితే మరో పదిరోజులు గడువివ్వాలని విద్యుత్ సంస్థలు ఈఆర్‌సీని కోరాయి. 

మొత్తం మీద రూ.10 వేల కోట్ల రెగ్యులర్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వం... రైతులకు సరఫరా అవుతున్న ఉచిత విద్యుత్ పైనా కన్నేసింది. వాస్తవానికి ఇప్పటికే రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ తరి పొలం ఉన్న రైతుల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున విద్యుత్ చార్జీలు వసూలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ వైఎస్ ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు. దీంతో రైతులకు పూర్తి ఉచితంగా విద్యుత్ అందినట్టయింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి చార్జీల వసూలు పకడ్బందీగా జరగనుంది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఈ చార్జీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇక మెట్టరైతులకు ఇచ్చే కరెంటు కనెక్షన్లకూ పరిమితులు విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మెట్టరైతులకు ఇప్పటివరకు పొలం ఎంత ఉన్నది అన్న అంశంతో సంబంధం లేకుండా.. 3 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వరకూ ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కనెక్షన్లకు పరిమితులు విధిం చి కేవలం ఒకటి లేదా రెండు విద్యుత్ కనెక్షన్లకే దీనిని కుదిం చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలావుండగా కేవలం 3 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లు ఉన్న రైతులకే ఉచిత విద్యుత్ ఇచ్చే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

వైఎస్ హయాంలో అందరికీ లబ్ధి

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని 2004లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చారు. కేవలం కార్పొరేట్, ఐటీ చెల్లించే రైతులు మినహా అందరికీ ఈ పథకంతో లబ్ధి చేకూరుతోంది. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో 29 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. అయితే వైఎస్ మరణానంతరం ఈ పథకంపై ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తోంది. ఉచిత విద్యుత్ రైతుల నుంచి నెలకు సర్వీసు చార్జీ రూపంలో రూ.20 వసూలు చేయాలని 2004లోనే నిబంధన ఉంది. అలాగే యూనిట్‌కు 50 పైసల నిబంధన ఉన్నప్పటికీ.. వైఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతుల నుంచి ఆ మేరకు వసూలు చేయలేదు. గత ఏడాది ప్రభుత్వం ఈ సర్వీసు చార్జీని రూ.20 నుంచి రూ.30కి పెంచింది. ఆ మేరకు 2004 నుంచి ఉన్న బకాయిలను, అలాగే రెండున్నర ఎకరాల కంటే అధికంగా ఉన్న మాగాణి రైతుల నుంచి 2004 నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ఉన్న బకాయిలను వసూలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఉచిత విద్యుత్ విధానానికి స్వస్తి పలికే క్రమంలోనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=515967&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: