సహకార సభ్యత్వంపై దర్యాప్తు జరిపించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సహకార సభ్యత్వంపై దర్యాప్తు జరిపించాలి

సహకార సభ్యత్వంపై దర్యాప్తు జరిపించాలి

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

 గవర్నర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నేత సోమయాజులు డిమాండ్
- 2007లో వైఎస్ హయాంలో ఎన్నికలు జరిగినపుడు పాలక మండళ్లను రద్దు చేశారు
- ఇప్పుడు రద్దు కాకపోవడంతో అధికారులు పై వారి కనుసన్నల్లో పనిచేస్తున్నారు
- అందుకే సభ్యత్వ నమోదులో అవకతవకలు జరుగుతున్నాయి
- వైఎస్ పాదయాత్రతో చంద్రబాబు యాత్రకు పోలికా? 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సహకార ఎన్నికల ప్రక్రియ మోసపూరితంగా తయారైందని, గవర్నర్ నరసింహన్ వెంటనే జోక్యం చేసుకుని సభ్యత్వ నమోదుపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సహకార సంఘాల సభ్యత్వ నమోదులో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

అసలు సహకార సంఘాల పాలక వర్గాలకు ఎన్నికలు ప్రకటించడానికి ముందు వాటి పాలక మండళ్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సహకార ఎన్నికలు నిర్వహించినపుడు పాలకవర్గాలను రద్దు చేసి అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఇపుడు పాలక మండళ్లు రద్దు కాకపోవడం వల్ల అందులో పనిచేసే అధికారులు పై వారి కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తోందని, అందుకే సభ్యత్వ నమోదులో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అంత ఎలా పెరిగింది!
ఎన్నికలు ప్రకటించడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షలు మాత్రమే ఉన్న సభ్యత్వం 50 లక్షలకు ఎలా పెరిగిందని సోమయాజులు ప్రశ్నించారు. అందులోనూ పది లక్షల మంది సభ్యులు ఒకే రోజు చేరినట్లుగా రికార్డులున్నాయని, దీన్ని బట్టే ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందో అర్థం అవుతోందని ఆయన అన్నారు. సహకార ఎన్నికలు నిలిపివేయాలని తాము కోరడం లేదని, అయితే నిజమైన సభ్యత్వంతో జరపాలని కోరారు. ఒకటి రెండు రోజుల్లో తమ పార్టీ గవర్నర్‌ను కలిసి సభ్యత్వంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతుందని ఆయన వివరించారు. 

ఇంత భారీగా సభ్యత్వం పెరగడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే కౌలు రైతులకు అవకాశం కల్పించామని చెబుతున్నారని, ఇదెంత మాత్రం వాస్తవం కాదని విమర్శించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కౌలు రైతులు అధికంగా ఉంటే అక్కడ ఆ స్థాయిలో సభ్యత్వం పెరగలేదన్నారు. కౌలు రైతులు లేని జిల్లాల్లో సభ్యత్వం ఎక్కువగా నమోదైందని వివరించారు. చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ విడ్డూరంగా ఉందని, అక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కలిసిపోయి తమకు అనుకూలమైన వారిని సభ్యులుగా చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కు కావడం కొత్తేమీ కాదని, తాజాగా సహకార ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.

బాబు అబద్ధాల కోరు
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని, ఆయన చెప్పినన్ని అబద్ధాలు మరెవ్వరూ చెప్పరని సోమయాజులు వ్యాఖ్యానించారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా కోర్టులో కేసు వేశారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒవైసీ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిషేధించాలని డిమాండ్ చేయడం గర్హనీయమన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ అంటే టీడీపీ నాయకులు ఎంత భీతిల్లుతున్నారో అర్థమవుతోందని అన్నారు.

తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తన వెంట బైబిల్‌ను ఉంచుకోవడాన్ని సోమిరెడ్డి మళ్లీ వివాదం చేయాలనుకుంటున్నారని ఆయన తప్పు పట్టారు. మనోధైర్యం కోసం బైబిల్ తన వద్ద ఉంచుకున్నానని విజయమ్మ వివరణ ఇచ్చిన తరువాత కూడా అలా మాట్లాడ్డం తగదన్నారు. మనలో చాలా మంది ఇష్ట దైవం ఫోటోలను జేబుల్లో ఉంచుకుంటామని, అంత మాత్రాన దాన్ని తప్పంటామా అని ఆయన అన్నారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అసభ్యకరమైన మాటల ముందు వంద మంది ఒవైసీల వ్యాఖ్యలు కూడా చాలవన్నారు. దురదృష్టవశాత్తూ ఓ వర్గం మీడియా బాబు మాటలను పసిడి పలుకులుగా భావించి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. 

వైఎస్ పాదయాత్రతో పోలికా?
చంద్రబాబు పాదయాత్రతో వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డును అధిగమించామని టీడీపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని సోమయాజులు అన్నారు. క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మన్‌కు, అలాగే పాదయాత్రలో వైఎస్‌కు ఎవరూ సాటి రారన్నారు. ‘వైఎస్ రాజమండ్రిలో పాదయాత్ర చేసినప్పుడు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పాదయాత్ర అంటే అది. చల్లని వాతావరణం చూసి నడుస్తున్న చంద్రబాబుది పాదయాత్ర కాదు’ అని అన్నారు.
Share this article :

0 comments: