అధికారం లేకుంటే సోనియాపై వంద కేసులుండేవి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారం లేకుంటే సోనియాపై వంద కేసులుండేవి!

అధికారం లేకుంటే సోనియాపై వంద కేసులుండేవి!

Written By news on Monday, January 21, 2013 | 1/21/2013

 అధికారంలో లేకపోతే యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలపై కనీసం వంద నేరారోపణలపై విచారణ జరుగుతూ ఉండేదని ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సాంస్కృతిక ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యాకేంద్రం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధీలు కేంద్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వామపక్ష భావాల వైపు మొగ్గుచూపే లౌకికవాద పార్టీగా వ్యవహరిస్తుందని, వారు లేని పీవీ నరసింహారావు ప్రభుత్వం మాత్రం మృదువైన హిందూత్వ పార్టీగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి యోగ్యుడా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, రాజకీయాలంటే ఆసక్తి, శ్రద్ధ, ఓపిక ఉండాలని, అవి ఆయనలో లోపించాయని చెప్పారు. ఆయన సోదరి ప్రియాంక వధేరాకు నాయకురాలిగా ఎదిగే సామర్థ్యం ఉందని, అయితే ఆమె రాజకీయాల్లోకి రావడం సోనియాకు ఇష్టం లేనట్లుందని అభిప్రాయపడ్డారు. 

సోనియాగాంధీకి కూడా స్వయంగా ప్రధాని పదవిని నిర్వహించేటంతటి ప్రతిభ లేదన్నారు. చిదంబరం ప్రధాని పదవికి యోగ్యుడా అన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా అవినీతి ఆరోపణలను మూట కట్టుకున్న వ్యక్తి ఆయనేనని వినోద్ మెహతా అన్నారు. కుటుంబ బాదరబందీలేని మోడీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ వంటివారు మంచి పాలన అందిస్తారనే భావన కొందరిలో ఉందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ మంచి ప్రధాని కాగలరనే వాదనతో తాను విభేదించాల్సిందేమీ లేదన్నారు. మత రాజకీయాల్లేని బీజేపీ మంచి పార్టీగా మారగలదని అభిప్రాయపడ్డారు. మనదేశంలో చాలా పార్టీలు పరస్పర వ్యతిరేకమైనా సంకీర్ణాలలో చేరేందుకు తమ సౌకర్యాన్నే ప్రధానంగా చూసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ‘నిర్భయ’పై సామూహిక అత్యాచారం ఘటనపై స్పందిస్తూ, సోషల్ మీడియా కారణంగానే యువత అసాధారణ స్థాయిలో చైతన్యాన్ని ప్రదర్శించిందని వినోద్ మెహతా ప్రశంసించారు. ఎలక్ట్రానిక్ మీడియా అతి ఎంత ఉన్నా మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతతో చిన్నారులు, రోగులు ప్రాణాలు కోల్పోతున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చి కొంత మార్పునకు కృషి చేస్తున్నాయని అన్నారు. 
Share this article :

0 comments: