న్యాయవాదులు లేరని సీబీఐ చెప్పడం శోచనీయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయవాదులు లేరని సీబీఐ చెప్పడం శోచనీయం

న్యాయవాదులు లేరని సీబీఐ చెప్పడం శోచనీయం

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుందని ముందే తెలుసుకదా!
అయినా సీనియర్ న్యాయవాదులు లేరంటూ గడువు కోరడం గర్హనీయం
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ సీబీఐ కుట్రపూరితంగా మోకాలడ్డుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. తాజాగా హైకోర్టులో విచారణకొచ్చిన బెయిల్ పిటిషన్‌పై సీబీఐ గడువు కోరడం గర్హనీయమని మండిపడ్డారు. శుక్రవారంనాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐపై తాము మొదటి నుంచీ చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని పద్మ వివరించారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడమేగాక బెయిల్ పిటిషన్‌పై కూడా సీబీఐ మోసపూరిత కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 

‘హైకోర్టులో బెయిల్ పిటిషన్ సందర్భంగా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు లేరని సీబీఐ చెప్పడం శోచనీయం. కేసు విచారణకు రానుందని పదిరోజుల కిందటే తెలిసినప్పటికీ నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించింది. జగన్ పట్ల సీబీఐ మొదటి నుంచీ కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. కాంగ్రెస్- టీడీపీ నాయకులు చెప్పిన మాదిరిగానే ముందుకెళ్తోంది’ అని పద్మ మండిపడ్డారు. సీబీఐ వ్యవహారశైలి ఒక దురుద్దేశ పద్ధతిలో, రహస్య ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లుగా ఉందన్నారు. మీడియాలో ఓ వర్గానికి లీకులిచ్చి, వారితో పుంఖానుపుంఖాలుగా జగన్‌పై అసత్య కథనాలు రాయిస్తోందన్నారు. తమ నేతను అక్రమంగా జైల్లో బంధించి 225 రోజులు గడుస్తున్నా బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని దుయ్యబట్టారు. వ్యక్తులను బట్టి సీబీఐ వ్యవహారశైలి మారుతుంటుందని, అందుకు చంద్రబాబు పట్ల వారు వ్యవహరించిన వైఖరే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.

ప్రజాదరణ పొందడమే జగన్ చేసిన తప్పా?

రాష్ట్ర ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందడమే జగన్ చేసిన తప్పా? కడప ఉప ఎన్నికల్లో 5.30 లక్షల మెజార్టీతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే ఆయన చేసిన నేరమా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పడంలో నిజం లేదన్నారు. 26 జీవోలకు సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు ప్రభావితం చేయలేనిది, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఎలా చేయగలుగుతారని నిలదీశారు. న్యాయస్థానాలను, ప్రజాస్వామ్య వాదులను సీబీఐ పక్కదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ సీబీఐ వ్యవహరిస్తున్న ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు తగినబుద్ధి చెప్తారన్నారు. అదే విధంగా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు న్యాయస్థానాల్లో కూడా బట్టబయలుకాక తప్పదని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. మంచిపై చెడు నెగ్గలేదని, న్యాయస్థానాలపై తమకు నమ్మకముందని, అంతిమంగా న్యాయం గెలిచితీరుతుందని అన్నారు. 

సోదర భావంతో మెలగాలి..

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకవర్గం ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడ్డాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పద్మ తెలిపారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పాటైన తమ పార్టీ అన్ని మతాలు, వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకొని ఒకరికొకరు సోదరభావంతో మెలగాల్సిన దేశంలో అక్బరుద్దీన్ కించపరిచేలా మాట్లడటం సరైందికాదన్నారు. ఆయన వ్యవహరించిన తీరుపట్ల తమ పార్టీ విచారం వ్యక్తం చేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పద్మ కోరారు.
Share this article :

0 comments: