కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌కు ఎందుకంత ప్రేమ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌కు ఎందుకంత ప్రేమ?

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌కు ఎందుకంత ప్రేమ?

Written By news on Tuesday, January 29, 2013 | 1/29/2013

ఓట్లు, సీట్ల కోసం ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇక్కట్లకు గురిచేస్తోంది
రాజకీయ స్వలాభం కోసం ప్రజాదరణ కలిగిన నాయకులను అక్రమంగా బంధించింది
తెలంగాణ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు
డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో జరిగిన బలిదానాలన్నీ కాంగ్రెస్ చేసిన హత్యలే

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి ఆ మంటల్లో చలి కాచుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను అవమానపరిచి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల్ని కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండేలు మరోసారి మోసం చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ దుశ్చర్యల కారణంగా రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంపై గత నెల 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల వైఖరులు తీసుకొన్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం వైఖరి ప్రకటించకుండా మోసగిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మూడు అఖిలపక్ష సమావేశాల్లోనూ కాంగ్రెస్ మోసపూరిత విధానాన్నే అవలంబించిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని, ఇక్కడ ఆ పార్టీకి చోటులేదని గ్రహించి ఓట్లు, సీట్ల కోసం ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం ప్రజాదరణ కలిగిన నాయకులను అక్రమంగా బంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం దాని ప్రయోగాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని అన్నారు. ప్రజల సెంటిమెంటును ఆసరా చేసుకొని రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల మధ్య విషబీజాలు నాటుతోందని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి, ఆలోచన కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో జరిగిన బలిదానాలన్నీ కాంగ్రెస్ చేసిన హత్యలేనని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌కు ఎందుకంత ప్రేమ?

తెలంగాణ విషయంలో ప్రతిసారీ మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై టీఆర్‌ఎస్ ఎందుకంత మెతక వైఖరి అవలంబిస్తోందని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. మిగతా పార్టీల నేతలపై దాడులకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్.., కాంగ్రెస్ విషయంలో మాత్రం తమలపాకుతో తాకినట్లు వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని పల్లెత్తుమాట అనకపోవడంలో ఆంతర్యమేమిటని అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి తెలంగాణ ప్రజలను ఎంతకాలం మోసం చేయదలిచాయని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీల రాజీనామాలను విలేకరులు ప్రస్తావించగా.. వారు చేసేవన్నీ డ్రామాలేనని చెప్పారు. రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడకుండా గల్లీలో నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. టి-ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే సోనియా ఇంటి ముందు బైఠాయించి, తాడోపేడో తేల్చుకోవాలని అన్నారు.

కృతజ్ఞత యాత్ర వాయిదా

‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో రెండు కోట్ల మంది ప్రజలు సంతకాలు చేసిన ప్రతులను ఇడుపులపాయకు తీసుకెళ్లడానికి తలపెట్టిన కృతజ్ఞత యాత్రను వాయిదా వేసినట్లు గట్టు తెలిపారు. సహకార ఎన్నికల నేపథ్యంలో ఈ యాత్రను వాయిదా వేశామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ యాత్ర ఉంటుందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
Share this article :

0 comments: