నట్టింట్లో పేలనున్న కరెంట్ బాంబులు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నట్టింట్లో పేలనున్న కరెంట్ బాంబులు.

నట్టింట్లో పేలనున్న కరెంట్ బాంబులు.

Written By news on Monday, January 7, 2013 | 1/07/2013

విద్యుత్ చార్జీల పెంపుతో పేద, సగటు కుటుంబాలపై పెనుభారం
2 కోట్ల గృహ వినియోగదారుల్లో కోటిన్నర మందికి షాక్


సాక్షి, హైదరాబాద్: మీ ఇంట్లో ఓ టీవీ.. రెండు ఫ్యాన్లు.. రెండు ట్యూబులైట్లు న్నాయా..? అయితే మీ ఇంట్లో బిల్లు బాంబు పేలబోతున్నట్టే! ప్రభుత్వం అడ్డగోలుగా పెంచేసిన కరెంటు చార్జీలతో ఇక మీ బిల్లు రూ.600కు తక్కువ రాకపోవచ్చు!! ఒక్కరిద్దరు కాదు.. రాష్ట్రంలోని 2 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో కోటిన్నర మందికి చార్జీల షాక్ తగలనుంది. డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనల్లో నెలకు 100 యూనిట్లకు మించి వాడే గృహ వినియోగదారులందరికీచార్జీలను పెంచేశారు. దీంతో సగటు పేదింటిలో కూడా బిల్లులు మోతెక్కనున్నాయి. ప్రస్తుతం ప్రతీ ఇంట్లో ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబులైట్లు ఉంటున్నాయి. వీరి సగటు వినియోగం నెలకు 100 యూనిట్లకు మించనుంది. అదెలాగంటే.. ఒక కిలో వాటు (1000 వాట్స్) సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉపకరణాలను ఒక గంటసేపు వినియోగిస్తే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన ఒక కలర్ టీవీ సామర్థ్యం సుమారు 200 వాట్స్ ఉంటుంది. టీవీ రోజుకు 10 గంటలు నడిస్తే.. 2000 వాట్స్ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. 

ఈ లెక్కన రోజుకు 2 యూనిట్లు కేవలం టీవీకే ఖర్చవుతుంది. అంటే నెలకు 60 యూనిట్లు. ఇక ఒక ఫ్యాను సామర్థ్యం 60 వాట్స్ ఉంటుంది. రెండు ఫ్యాన్లను తీసుకుంటే 120 వాట్స్. ఫ్యాన్లను రోజుకు 10 గంటలు వాడితే 1,200 వాట్స్ అవుతుంది. అంటే ఫ్యాన్లకు రోజుకు 1.2 యూనిట్ల విద్యుత్. ఇది నెలకు 36 యూనిట్లు. ఒక ట్యూబ్ లైటు సామర్థ్యం 50 వాట్స్.... రెండు ట్యూబు లైట్లకు లెక్కిస్తే 100 వాట్స్. వీటిని రోజుకు 5 గంటలు వాడితే 500 వాట్స్ ఖర్చవుతుంది. అంటే నెలకు 15 యూనిట్లు. వీటికి కావాల్సిన కరెంటును మొత్తంగా లెక్కేస్తే నెలకు 111 యూనిట్లు అవుతుంది. ఇక సెల్‌ఫోన్ చార్జింగ్, జీరో బల్బు వినియోగం కలుపుకుంటే నెలకు కనీసం 4 యూనిట్ల విద్యుత్ అయినా ఖర్చు అవుతుంది. అంటే మొత్తం 115 యూనిట్ల విద్యుత్‌ను సగటు పేద, మధ్యతరగతి కుటుంబం వినియోగించుకుంటుంది. తాజా విద్యుత్ ప్రతిపాదనల్లో 100 యూనిట్లు దాటిన వారందరికీ టెలిస్కోపిక్ విధానం ఎత్తివేశారు. ఫలితంగా ప్రతీ యూనిట్‌కు 5.65 చెల్లించాల్సి ఉంటుంది. 115 యూనిట్లకు కరెంటు బిల్లుకే రూ.649.75 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం వీరు 115 యూనిట్లకు రూ.314 చెల్లిస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని 2 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో కోటిన్నర మందికి షాక్ తగలనుంది.

చార్జీల పెంపుపై సామాన్యుడు ఏమంటున్నాడు?

మా కష్టమంతా బిల్లులకే పోతోంది 
చార్జీలు పెంచడం వల్ల మాపై అధిక భారం పడుతుంది. హెయిర్ కటింగ్ సెలూన్‌లో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇలాగైతే మా కష్టమంతా బిల్లులు చెల్లించడానికే సరిపోతుంది.
- రాజలింగం, క్షురకుడు, చిక్కడపల్లి

ఇలాగైతే ఎలా బతికేది? 
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి. ఇంటి కిరాయిలు, పిల్లల చదువుల ఫీజులు కట్టడానికే నానా కష్టాలు పడుతున్నాం. ఇలా మాటిమాటికి విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ పోతే మాలాంటి సామాన్య ప్రజలు ఎలా బతికేది?
- శ్రీధర్‌రెడ్డి, జిరాక్స్ నిర్వాహకుడు, చిక్కడపల్లి

ఇంకెన్నిసార్లు పెంచుతారు? 
ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు చార్జీలు పెంచింది. ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఇలా చార్జీలను పెంచడం దారుణం.
- నర్సింగరావు, కవాడిగూడ, ైెహ దరాబాద్

ఏం పాపం చేశామని మాకీ మోత?

వినియోగిస్తున్న విద్యుత్‌కు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించడమేనా? ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని అందించడమేనా? ఇంతకీ ఏం పాపం చేశామని తమపై అధిక చార్జీల మోత మోపుతున్నారని రాష్ట్ర పారిశ్రామిక వర్గం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. నెమ్మదించిన వృద్ధిరేటు, అధిక వడ్డీరేట్లతో సతమతమవుతున్న పరిశ్రమలపై మరోవైపు విద్యుత్ చార్జీల భారం మోపి ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వదల్చుకుందని ప్రశ్నిస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ కింద రూ. 20 వేల కోట్లు సబ్సిడీ అందిస్తూ ఆ భారం మొత్తాన్ని పరిశ్రమల నుంచి భర్తీ చేయాలనుకోవడం ఎంతవరకు సబబో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని పేర్కొంటున్నాయి. ఇప్పటికే నెలలో 12 రోజుల పవర్ హాలిడే పేరుతో విద్యుత్ కోత పెడుతూ ఇప్పుడు విద్యుత్ చార్జీలను భారీగా పెంచుతూ పరిశ్రమలను ఎందుకు శిక్షిస్తోందో అర్థం కావట్లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏపీ శాఖ చైర్‌పర్సన్ సుచిత్ర కె.ఎల్లా వాపోయారు. 

ఇటువంటి విధానాల వల్ల రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవే మూతపడే పరిస్థితి ఏర్పడుతోం దని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు చార్జీల పెంపును భరించే స్థితిలో పారిశ్రామిక రంగం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) అధ్యక్షుడు దేవేంద్ర సురానా అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి రూ.వెయ్యి కోట్లే కేటాయిస్తున్నా పన్నుల రూపేణా ఈ రంగం నుంచి రూ.14 వేల కోట్లు సమకూరుతుందని తెలిపారు. ఈ సమస్యపై త్వరలోనే రాష్ట్ర పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ఎ.పి.కె.రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే పరిశ్రమలు మూతపడతాయని, లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. 


sakshi

Share this article :

0 comments: