‘ఉచిత’ భారమూ జనం నెత్తినే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఉచిత’ భారమూ జనం నెత్తినే!

‘ఉచిత’ భారమూ జనం నెత్తినే!

Written By news on Sunday, January 13, 2013 | 1/13/2013

ఉచిత విద్యుత్ సర్దుబాటు చార్జీలను భరించాల్సింది ప్రభుత్వమే 
కానీ.. ఆ భారాన్ని కూడా వినియోగదారులపైనే మోపుతున్న వైనం
చార్జీలు, సర్‌చార్జీల్లో కలిపేసి వడ్డన 
గతేడాది సర్దుబాటు చార్జీల్లో రూ. 3వేల కోట్ల వసూళ్లు 
2013-14 పెంపు ప్రతిపాదనల్లో రూ. 6,000 కోట్లు 
ఉచిత విద్యుత్‌కు మొత్తం రూ. 9 వేల కోట్లు
సబ్సిడీ రూపంలో సర్కారే భరించాలి 
ఆ మొత్తం అన్ని వర్గాల నుంచీ వసూలుకు ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల భారాన్ని ప్రజల నెత్తినే మోపుతూ చార్జీల మీద చార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం చావబాదుతోంది! అసలే అన్ని రకాల ధరలూ పెరిగిపోతూ కుంగిపోయి ఉన్న జనంపై.. విద్యుత్ సర్‌చార్జీల భారం మోపి బతుకు భారం చేసి.. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా ప్రజల నుంచే వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 3,000 కోట్ల మేర ఉచిత విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాన్ని కూడా.. గడచిన సంవత్సరాల సర్‌చార్జీల రూపంలో ప్రజలపై మోపి వసూలు చేస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే సమర్పించిన రూ. 12,000 కోట్ల మేర చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల ప్రతిపాదనల్లోనూ.. రూ. 6,000 కోట్లు ఉచిత విద్యుత్ సర్దుబాటు చార్జీలే కావటం విశేషం. 

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఉచితంగా విద్యుత్ అందించాలని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఆయన ఆకస్మిక మరణానంతరం..రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే రెండున్నర ఎకరాల తరి పొలం (మాగాణి) కంటే ఎక్కువ ఉన్న రైతులతో పాటు ఐఎస్‌ఐ మోటార్లు, కెపాసిటర్లు లేని రైతుల నుంచి చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. తాజాగా వ్యవసాయ రంగానికి సంబంధించి తాను భరించాల్సిన సర్దుబాటు చార్జీలను కూడా ప్రజల నుంచే వసూలు చేస్తోంది. 

ఇప్పటికే రూ. 3,000 కోట్ల బాదుడు... 

విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ఇంధనాల (బొగ్గు, గ్యాసు తదితరాల) ధరలు పెరిగినప్పుడు.. విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అలా పెరిగిన మొత్తాన్ని ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేయటం కొన్నాళ్లుగా పరిపాటిగా మారింది. అన్ని రకాల విద్యుత్ వినియోగదారుల నుంచీ ఈ సర్దుబాటు చార్జీలను వసూలు చేయాలి. అయితే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్న నేపథ్యంలో.. ఆ రంగానికి అందించే విద్యుత్‌కు అయ్యే అదనపు వ్యయాన్ని.. అంటే ఉచిత విద్యుత్ సర్దుబాటు చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలి. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్‌పై కూడా సర్దుబాటు చార్జీలను వసూలు చేయాలని.. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున ఆ భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కూడా అభిప్రాయపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ భారాన్ని తాను భరించేందుకు ససేమిరా అంటోంది. ఆ భారాన్ని కూడా జనం మీదే వేసేస్తోంది. 

ఉచిత విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాన్ని కూడా.. గృహ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటి విద్యుత్ వినియోగదారుల నుంచే వసూలు చేస్తోంది. 2010-11, 2011-12 సంవత్సరాలతో పాటు 2012-13 మొదటి త్రైమాసికపు సర్దుబాటు చార్జీల రూపంలో రూ. 9,264 కోట్లు వసూలు చేస్తుండగా.. అందులో సుమారు రూ. 3,000 కోట్ల మేర సర్దుబాటు చార్జీలు.. వ్యవసాయ రంగానికి అందించిన ఉచిత విద్యుత్‌కు సంబంధించినవే. ఈ రూ. 3,000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించేందుకు నిరాకరించటంతో.. ఆ భారం కూడా గృహ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల వినియోగదారులపైనే పడింది.

ఆ 12 వేల కోట్లలో సగం ఉచిత విద్యుత్ భారమే

ఇక వచ్చే (2013-14) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,06,061 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్ అవసరం ఉంటుందని ప్రభుత్వం లెక్కకట్టింది. కానీ.. సరఫరా మాత్రం 1,03,535 ఎంయూలు మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నివేదికలో తెలిపింది. మిగిలిన 2,526 ఎంయూల మేరకు లోటు ఉంటుందని అంచనా వేసింది. ఇందులో యూనిట్‌కు ఏకంగా 10 రూపాయల చొప్పున రూ.6,008 కోట్లు వెచ్చించి రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జీ) కొనుగోలు చేసి.. దాని ద్వారా 6,008 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు రెండు రోజుల కిందట ట్రాన్స్‌కో సీఎండీ సమారియా స్వయంగా వెల్లడించారు. 

అంటే వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ కోసమే రూ. 6,008 కోట్ల మొత్తం వెచ్చించనున్నారన్నమాట. రైతు సంక్షేమ పథకం కోసం వెచ్చిస్తున్న ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ మొత్తాన్ని కూడా సామాన్య ప్రజల విద్యుత్ చార్జీలను పెంచటం ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. ఆమేరకు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల ప్రతిపాదనల్లో ఈ మొత్తాన్ని వినియోగదారులందరిపైనా మోపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు వచ్చే ఏడాదిలో ఏకంగా రూ. 12,723 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచాలని ఈఆర్‌సీకి విద్యుత్ సంస్థలు ప్రతిపాదనలు ఇచ్చాయి. 

ఈ విషయం ఇప్పటికే ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ రూ. 12,723 కోట్లలో సగానికి సగం.. అంటే రూ. 6,008 కోట్ల మొత్తం.. ఉచిత విద్యుత్ సరఫరా కోసం వెచ్చించిన సొమ్ము. దీనిని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాలి. అంటే.. వాస్తవానికి వచ్చే ఏడాది ప్రజలపై అదనంగా పెరగాల్సిన చార్జీలు రూ. 6,715 కోట్లు మాత్రమే. అయితే.. ప్రభుత్వం తను భరించాల్సిన సబ్సిడీ భారాన్ని కూడా ప్రజల నెత్తినే రుద్దాలని నిర్ణయించటంతో.. చార్జీల వడ్డనలు మొత్తం రూ. 12,723 కోట్లకు పెరిగాయన్నమాట. మొత్తంమీద.. ఇప్పటికే సర్దుబాటు చార్జీల (2010-11, 2011-12, 2012-13 మొదటి త్రైమాసికానికి) రూపంలో రూ. 3,000 కోట్లు, వచ్చే ఏడాదిలో చార్జీల పెంపు ప్రతిపాదనల్లో రూ. 6,008 కోట్లు కలిపి.. మొత్తం రూ. 9,000 కోట్లకు పైగా ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఇలా ప్రజల ముక్కు పిండి పైసలు వసూలు చేస్తూ.. తాను మాత్రం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది!!
Share this article :

0 comments: