దేదీప్యమానంగావిరాజిల్లే రోజు త్వరలోనే వస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేదీప్యమానంగావిరాజిల్లే రోజు త్వరలోనే వస్తుంది

దేదీప్యమానంగావిరాజిల్లే రోజు త్వరలోనే వస్తుంది

Written By news on Sunday, January 13, 2013 | 1/13/2013

మొన్న జనవరి 2వ తేదీ రాత్రి మా పెద్ద పాప ప్రార్థన చేస్తూ అంది - ‘‘ప్రతిసారిలా వాయిదా పడకుండా ఈసారి తప్పకుండా డాడీకి బెయిల్ రావాలని మమ్మల్ని దీవించండి దేవా’’. జగన్ బెయిల్ కేసు... మొదట డిసెంబర్ 24వ తేదీకి, తరువాత డిసెంబరు 26కి, తరువాత జనవరి 4కు వాయిదా పడుతూ వచ్చింది. ఇలా డేట్ వచ్చిన ప్రతిసారీ ఆశతో ఎదురు చూడటం, సీబీఐ వాళ్ల నిర్దాక్షిణ్యమైన ధోరణితో నిరాశకు గురికావడం లెక్కలేనన్ని సార్లు జరిగింది. కోర్టుకు వెళ్లే ముందు షర్మిల దగ్గరికి వెళ్లి - ‘‘కోర్టుకు వెళుతున్నాను పాపా’’ అంటే, తను ప్రార్థన చేసి ఏడ్చింది. ‘‘ఈ రోజు అన్న తప్పకుండా వస్తాడు వదినా... తప్పకుండా రావాలి వదినా’’ అంది. తను అంత బాధతో ఏడుస్తూ అంటే, నేను కూడా అన్నాను - ‘‘పాపా.. మీ అన్న ఈ రోజు ఇంటికి వస్తాడు’’ అన్నాను. 

కానీ ఆ రోజు కూడా సీబీఐ - ‘లాయర్ లేడు’ అనే ఒక గుడ్డిసాకు చెప్పి 18 రోజుల పాటు కేసు వాదనలకు కూడా రాకుండా అడ్డుకుంది. కోర్టుకు నాతో వచ్చిన మా అక్క అంది - ‘‘వీళ్లకు నిద్ర ఎలా పడుతోంది! ఒక మనిషి మన మూలంగా ఇన్ని నెలలు ఇబ్బంది పడ్డాడన్న ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా అన్యాయంగా మరో పద్దెనిమిది రోజుల గడువు అడగడానికి వీళ్లకు అసలు మనస్సాక్షి ఉందా’’ అని. ఆ రోజు కోర్టులో మా లాయర్ అన్నాడు - ‘‘డిసెంబర్ 26నే సీబీఐకి తెలుసు కేసు జనవరి 4న వస్తుందని. ఆ రోజు ఒప్పుకొని ఇన్ని రోజుల తరువాత వాదించవలసిన రోజున లాయర్ లేడు అంటున్నారు. గవర్నమెంట్‌కు హైదరాబాదులోను, ఢిల్లీలోను ఇంతమంది లాయర్స్ ఉన్నాకూడా పద్దెనిమిది రోజులు పొడిగించారు’’ అని! జగన్‌ను అక్రమంగా నిర్బంధించి జనవరి 22కు దాదాపు 8నెలలు అవుతుంది. నాకనిపిస్తుంది - 

‘‘వీళ్లకు మాలాంటి అక్కలు, చెల్లెళ్లు, ఆడబిడ్డలు, తల్లులు లేరా? అదే వాళ్లవాళ్లెవరైనా జైల్లో ఉంటే... అసలు నేరారోపణ రుజువు కాకుండా, నేర నిర్ధారణ జరగకుండా ఎనిమిది నెలలు అన్యాయంగా బెయిల్‌ను అడ్డుకుంటుంటే... ఆ చెల్లెళ్లకు, బిడ్డలకు, తల్లులకు ఎలా ఉంటుందో ఆలోచించరా అని. 90 రోజులలో విచారణ ముగియకుంటే బెయిలు రావాలని తెలుసు. ఒకే కేసులో ఇన్ని చార్జిషీట్లు వేయడం కేవలం ఇబ్బంది పెట్టడం కోసం అని తెలుసు. ఇంత బాహాటంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మనుషుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. మా మామగారు అనేవారు - ‘‘పోనీలే ఎవరి పాపానికి వాళ్లే పోతారు’’ అని. ఆయన మాటలు గుర్తు చేసుకొని నేను అనుకుంటాను. పోనీలే తప్పు చేసేవాళ్లను దేవుడు చూస్తున్నాడు. బాధపడే మమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్యాయం చెయ్యడు. ప్రజలు అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరు. దేవుడు కరుణిస్తాడు. దేవుని దయతో, ప్రజల ప్రేమతో మేము సంతోషపడే దినం తప్పక వస్తుంది అని. 

జనవరి 22కి వాయిదా అంటే మా అమ్మ ఫోన్ చేసి ఏడ్చింది. ‘‘ఇలా ఎన్ని రోజులమ్మా! దీనికి అంతం ఉండదా? ఇంత అన్యాయమా..!’’ అని. నేను మా అమ్మతో అన్నాను. ‘‘నువ్వు ఏడవద్దు అమ్మా. అసలు మనమెందుకమ్మా ఏడవాలి. తప్పు చేస్తున్నందుకు వాళ్లు ఏడవాలి. ఒకరికి అన్యాయం చేస్తున్నందుకు వాళ్లు ఏడవాలి. దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు’’ అని. 

మా మామగారు ప్రతిక్షణం ప్రజలకోసం ఏం చేయగలమా అని ఆత్రుత పడ్డారు. ఆరోగ్యశ్రీ, ఇళ్లు, వృద్ధులకు, వికలాంగులకు పింఛను, 104, 108, ఫీజ్‌రీయింబర్స్‌మెంట్... ఇలా ఎన్నో చేపట్టారు. ఆయన ప్రభుత్వంలో ఏ సమస్యా లేకుండా ప్రజలు హాయిగా జీవించారు. దేవుడు ఆశీర్వదించాడు. వర్షాలు బాగా పడ్డాయి. లా అండ్ ఆర్డర్ బాగుంది. అటువంటిది ఇన్ని చేస్తే ఆయన చనిపోయిన తరువాత ఆయన వల్ల అధికారంలో కూర్చొని ఆయనను నానా మాటలు మాట్లాడారు. గవర్నమెంట్ అనే పదం తీసేసి ఆయన పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారు. ఆయన కుమారుడిని జైల్లో పెట్టారు. ఆయన భార్యకు తీరని అన్యాయాన్ని చేశారు. ఆయన కుటుంబాన్ని కష్టాలపాలు చేశారు. 

కేవలం రాజకీయ మనుగడకోసం ఇలా చేసేవారి గురించి ఏమి చెప్పగలం? ఎవరి విజ్ఞతకు, సంస్కారానికి వాళ్లను వదిలి వేయాలి. వాళ్లతో ఉంటే మంత్రులను చేస్తారు, ముఖ్యమంత్రులను చేస్తారు. లేదంటే ఇబ్బందులు పెడతారు. ఇవే కదా అజాద్‌గారు బాహాటంగా అన్న మాటలు. నేను దిగులు పడినప్పుడు జగన్ నాతో అంటాడు ‘‘కొంతకాలం నిబ్బరం కలిగి వుంటే దాన్ని దాటేయగలం. కొంచెం ధైర్యం తెచ్చుకో అంతే. చీకటి ఎంతో కాలం ఉండదు. అది శాశ్వతం కాదు’’ అని. దేవుని దయతో, మామ ఆశీర్వాదంతో, ప్రజల అండతో త్వరలోనే మళ్లీ సూర్యుడు మా జీవితాల్లో ఉదయించడమే కాదు, దేదీప్యమానంగా విరాజిల్లే రోజు త్వరలోనే వస్తుంది.


- వైఎస్ భారతి
w/o 
వైఎస్ జగన్
Share this article :

0 comments: