ఒకరి మతాన్ని మరొకరు దూషించడం తప్పే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకరి మతాన్ని మరొకరు దూషించడం తప్పే

ఒకరి మతాన్ని మరొకరు దూషించడం తప్పే

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013

వీరి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది
దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు: మైసూరా

 వైఎస్సార్ కాంగ్రెస్‌ది పూర్తిగా లౌకిక విధానమని, పరమత దూషణ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని అంగీకరించబోమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘‘అక్బరుద్దీన్.., చంద్రబాబు.., కేటీఆర్.. లేక ఇంకెవరైనా సరే, ఒకరి మతాన్ని దూషించడం తప్పు. ఇలా దూషించిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికెవ్వరూ కాదనరు. కానీ, కొందరు రాజకీయ లబ్ధి కోసం, వారి పార్టీల మనుగడ కోసం ఇతర పార్టీలపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను సన్మార్గంలో నడిపించాలి. ప్రజల్లో సహనం పెంపొందించడమే వారు చేయాల్సిన పని. అలా కాకుండా దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజలను ఇంకా రెచ్చగొట్టడం సరికాదు’’ అని చెప్పారు. ‘‘అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. అయితే, అధికారంలో ఉన్నవారు ఒకరి విషయంలో ఒక రకంగా, మరొకరి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తామని అనడం మంచి సంప్రదాయం కాదు. చట్టం అందరినీ ఒకేవిధంగా చూడాలి. మజ్లిస్ లేదా బీజేపీ లేదా టీఆర్‌ఎస్ లేదా ఇంకెవరైనా కావచ్చు. మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తప్పు’’ అని చెప్పారు. ‘‘నాలుకలు చీరేస్తాం.. తంతాం... వంటి రకరకాల మాటలను కొందరు వాడుతున్నారు. వారినేమన్నా అంటున్నామా? అందరి విషయంలో సమానంగా వ్యవహరించాలి’’ అని అన్నారు. బీజేపీ, మజ్లిస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మతతత్వ పార్టీలని చంద్రబాబు చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నపుడు బాబుకు తెలియదా బీజేపీ మతతత్వ పార్టీ అని? వారిది గురువింద విధానం. ఎదుటి వారిని ఉద్దేశించి ఒక వేలు చూపుతున్నపుడు నాలుగు వేళ్లు మన వైపు చూస్తుంటాయనేది బాబు గుర్తెరిగితే మంచిది’’ అని అన్నారు. టీఆర్‌ఎస్ విమర్శలపై స్పందిస్తూ.. ‘‘బట్ట కాల్చి మీద వేసి వెళ్లడం సరికాదు. మర్రి చెన్నారెడ్డి హయాంలో జరిగిన అల్లర్లపై అప్పట్లో విచారణ జరిపిన కమిషన్ దాని నివేదికలో ఎక్కడా వైఎస్ పేరును పేర్కొనలేదు’’ అని తెలిపారు. ‘‘రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేకే తొలినుంచీ ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అని చెప్పి లేనిపోని నీలాపనిందలు వేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తప్పుపట్టారు. అయినా ప్రజలు ఉప ఎన్నికల్లో అందరికీ తగిన గుణపాఠం చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇంకేమీ లేక చివరకు ఇలాంటి విమర్శలకు కూడా దిగుతున్నారు’’ అని మైసూరా అన్నారు.
సర్‌చార్జి చాలక మళ్లీ విద్యుత్ చార్జీలు పెంపా?

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఓ వైపు ఇంధన సర్‌చార్జిని విధిస్తూ, మరోవైపు బొగ్గు ధర పెరిగిందని చెప్పి టారిఫ్‌ను ఎందుకు పెంచుతున్నారని మైసూరా ప్రశ్నించారు. ‘‘రైల్వే శాఖ చార్జీలు పెంచినట్లు ఇప్పుడే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.13,000 కోట్ల మేరకు విద్యుత్ టారిఫ్ పెంచడానికి ఆమోదం తెలిపింది. ఓ వైపు నుంచి కేంద్రం, మరో వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు రావాల్సిన సహజవాయువును మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు తరలించారని, దీనివల్ల మన రాష్ట్రంలో 1,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదని, ఆ భారాన్ని కూడా రాష్ట్ర వినియోగదారులపైనే వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బెయిల్‌పై వాదించడానికి సీబీఐకి న్యాయవాదులే లేరంటారా?: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ప్రతివాదనలు చేయడానికి న్యాయవాదులు అందుబాటులో లేరని చెప్పడానికి సీబీఐకి సిగ్గుండాలని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తు రాజకీయ జోక్యంతోనే జరుగుతోందనడానికి ఈ ఉదంతం చాలని అన్నారు. కక్ష సాధింపులో కాంగ్రెస్ అధిష్టానానికి సీబీఐ పావులా ఉపయోగపడుతోందని అన్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ రెండూ రాజకీయ ఒత్తిడితోనే పని చేస్తున్నాయని దుయ్యబట్టారు. జగన్‌పై ఈ అక్రమ కేసులు రావడానికి మూలం చంద్రబాబేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో మిలాఖత్ అయి కేసులు పెట్టించారని అన్నారు. ఆయనకు ఏ చట్టం తెలుసునని మాట్లాడుతున్నారో తనకైతే తెలియదన్నారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమంలో స్వల్ప కాలంలోనే 1.26 కోట్ల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారంటే ఎంత స్పందన ఉందో తెలుస్తుందని అన్నారు.

సీఎంకు ఓర్పు ఉండాలి
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి ఓర్పు ఉండాలని, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఆ ఓర్పు లేదని మైసూరా అన్నారు. సాక్షి టీవీ ప్రైమ్‌టైమ్ షోలో పాల్గొ న్న ఆయన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉదంతంపై మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా కిరణ్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అక్బరుద్దీన్ విషయాన్ని సీఎం కొంత వ్యక్తిగతంగానే తీసుకున్నట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గవర్నర్‌తో సీఎం సమాలోచనలు జరపడం, ప్రసంగం సీడీలను తయారు చేసి బయటికి పంపడం, సంక్లిష్టమైన సెక్షన్లను కేసులో పెట్టడంవంటి అంశాలన్నీ గమనిస్తే ప్రభుత్వ జోక్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఓ విధంగా రాజకీయ జోక్యమే’’ అని చెప్పారు.
Share this article :

0 comments: