ఇప్పుడు ఎన్నికలొస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు ఓటమే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పుడు ఎన్నికలొస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు ఓటమే!

ఇప్పుడు ఎన్నికలొస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు ఓటమే!

Written By news on Saturday, January 26, 2013 | 1/26/2013


http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013%2Fjan%2F26%2Fmain%2F26main18&more=2013%2Fjan%2F26%2Fmain%2Fmain&date=1%2F26%2F2013


ఇప్పుడు ఎన్నికలొస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు ఓటమే!
వైసీపీ, టీఆర్ఎస్‌లకు అధిక స్థానాలు
ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌దే హవా
ప్రధానిగా మోడీకే ఎక్కువ మంది ఓటు
ఇండియా టుడే నీల్సన్ సర్వేలో వెల్లడి

 ఉన్నఫళంగా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే...! కాంగ్రెస్ ఓటమి పాలవడం ఖాయం. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారి పోతోందని ఇండియాటుడే-నీల్సన్ 'దేశ ప్రజల మనోగతం' సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుందని స్పష్టమైంది. అంతేకాదు, వైసీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి 50 శాతానికి పైగా సీట్లు సంపాదించి అధికారాన్ని సొంతం చేసుకుంటాయని వెల్లడైంది. 2009లో కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో అధిక భాగం ఇప్పుడు ఈ రెండు పార్టీలకు మళ్లే అవకాశం కూడా ఉందని సర్వే పేర్కొంది. వైసీపీ రాష్ట్రం నుంచి లోక్‌సభలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.



కాంగ్రెస్ పరిస్థితి దారుణమే..
2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 33 లోక్‌సభ స్థానాలు గెలుచుకోగా.. వచ్చే ఎన్నికల్లో ఎనిమిదికి మించి సీట్లు చేజిక్కించుకునే అవకాశం లేదని సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52.5 శాతం ఓట్లు రాగా.. వచ్చే ఎన్నికల్లో 18 శాతం కంటే తక్కువకు పడిపోయే సూచనలున్నాయని వెల్లడించింది. ఈ ఓట్లలో ఎక్కువ భాగం వైసీపీ, టీఆర్ఎస్‌కు వెళ్లవచ్చని పేర్కొంది. రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో వైసీపీకి, తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా సర్వేలో తేలింది.

ఇక, 'ఉత్తమ ముఖ్యమంత్రి' విషయంలో 18 రాష్ట్రాల సీఎంల మధ్య సర్వే జరగగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కిరణ్ నాయకత్వం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే సూచనలే లేవని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా, సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది జగన్‌పై కేసులను వేధింపు చర ్యలుగానే పరిగణించారు.

ఎన్డీఏకి కొద్దిగా మొగ్గు!
ఇండియా టుడే-నీల్సన్ తాజా వార్షిక సర్వే ప్రకారం, దేశ ప్రజల్లో అధిక శాతం మందికి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ పట్ల విముఖత పెరిగిపోతోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పరిస్థితి మాత్రం యూపీఏ కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది. 2009లో 259 స్థానాలు సంపాదించుకున్న యూపీఏ.. 2014 ఎన్నికల్లో 152 నుంచి 162 స్థానాల దగ్గరే ఆగిపోవచ్చని సర్వే పేర్కొంది. ఇక, 2009 ఎన్నికల్లో 159 స్థానాలు చేజిక్కించుకున్న ఎన్డీఏ ఈసారి 198 నుంచి 208 స్థానాల వరకూ గెలుచుకునే సూచనలున్నాయి. ఇతర పార్టీలకు 178 నుంచి 188 స్థానాలు లభించవచ్చని సర్వేలో వెల్లడైంది.

రాహుల్‌కు ఎదురు గాలి
ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే గుజరాత్ సీఎం మోడీకే ఆదరణ ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. దేశ ప్రధానిగా మోడీ సమర్థుడైన నాయకుడని అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీని 41 శాతం మంది ప్రధానిగా కోరుకుంటే.. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని 57 శాతం మంది కోరుకుంటున్నారు. ముస్లింల విషయానికొస్తే.. ప్రధాని అభ్యర్థిగా 21 శాతం మంది మోడీకి, 77 శాతం మంది రాహుల్‌కు ఓటేశారు.

ఇక, ప్రధాని మన్మోహన్‌సింగ్ పాలన పట్ల అధిక శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోయారని 27 శాతం అభిప్రాయపడ్డారు. అయితే, 26 శాతం మంది మాత్రం మన్మోహన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు ఓ మోస్తరుగా ఉందని 42 శాతం మంది, అధ్వానంగా ఉందని 27 శాతం మంది అభిప్రాయ పడ్డారు.
Share this article :

0 comments: