పత్రిక యజమాని ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పత్రిక యజమాని ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?

పత్రిక యజమాని ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?

Written By news on Tuesday, January 1, 2013 | 1/01/2013

ఆ పత్రిక తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తా 
ఓ కేసులో నేను స్టే ఎత్తివేయకపోయినా.. స్టే ఎత్తివేశానని రాసింది 
డైరీ ఆవిష్కరణలో నేను మాట్లాడింది ఒకటి.. ఆ పత్రిక రాసింది మరొకటి 
ఇటువంటి పత్రికలు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాయి
న్యాయమూర్తి ఓ చిన్నకారు కొంటే.. దానిని పెద్ద న్యూస్ చేస్తారు 
మరి పత్రిక యజమాని ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?
‘ఆంధ్రజ్యోతి’ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి
ఆ పత్రిక కథనాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు చేపట్టాలి 
ఇవి పునరావృతం కాకుండా చూడాలన్న న్యాయవాది రవిచందర్
దీనిపై బుధవారం నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్న న్యాయమూర్తి

సాక్షి, హైదరాబాద్: తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆ పత్రికా యాజమాన్యం గత కొంత కాలంగా తనను లక్ష్యంగా చేసుకుంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ పత్రిక సర్క్యులేషన్‌ను పెంచుకునే ఉద్దేశంతోనే ఆ పత్రిక ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 

తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఓ భారీ తప్పుడు కథనం ప్రచురించి, తరువాత అది సరికాదని తెలుసుకుని, ‘సారీ’ అంటూ చిన్న అక్షరాలతో ప్రచురించటం అందులో భాగంగానే జరిగిందని ఆయన తెలిపారు. గత వారం జస్టిస్ నర్సింహారెడ్డి వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు కూడా హాజరయ్యారు. ప్రభుత్వంలో వాణిజ్యపన్నుల శాఖ ఎంత కీలకమైందో వివరిస్తూ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రసంగించారు. అంతకుముందు చుక్కా రామయ్య తెలంగాణ గురించి మాట్లాడారు. జస్టిస్ నర్సింహారెడ్డి మాత్రం తెలంగాణ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అయితే.. తెలంగాణను ఏ శక్తి ఆపలేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ పెద్ద కథనం ప్రచురించింది.

దీనిపై సోమవారం ఉదయం 10.30 గంటలకు కోర్టు ప్రారంభం కాగానే సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ ఆంధ్రజ్యోతి కథనం గురించి జస్టిస్ నర్సింహారెడ్డి వద్ద ప్రస్తావించారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని, ఆ మేర చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై జస్టిస్ నర్సింహారెడ్డి స్పందించారు. ‘‘ఉద్దేశపూర్వకంగానే ఆ పత్రిక గత కొంత కాలంగా నన్ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రెండు రోజుల కిందట కూడా నేను ఓ కేసులో స్టే ఎత్తివేశానని, దానివల్ల అక్రమాలు జరిగిపోతున్నాయని ఆ పత్రిక రాసింది. వాస్తవానికి నేను ఆ కేసులో స్టే ఎత్తివేయలేదు. డైరీ ఆవిష్కరణలో నేను మాట్లాడింది ఒకటి.. ఆ పత్రిక రాసింది మరొకటి. ఆ పత్రిక ప్రచురించిన తప్పుడు కథనం వల్ల నాకు జరిగిన నష్టం మాటేమిటి..? చిన్న అక్షరాలతో ‘సారీ’ అని చెప్తే సరిపోతుందా..? ఇటువంటి కథనాలను ప్రచురిస్తూ ఆ పత్రిక న్యాయమూర్తులను బెదిరించే రీతిలో వ్యవహరిస్తోంది. ఎందుకంటే న్యాయమూర్తులు బహిరంగంగా పోరాటానికి దిగలేరు కాబట్టి. న్యాయమూర్తులకు ఉన్న పరిమితులను కొన్ని పత్రికలు అడ్డంపెట్టుకుని ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నాయి. 

పత్రికల్లో వచ్చే కథనాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ నాయకులు కూడా న్యాయమూర్తులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత అనేస్తున్నారు. పర్యవసానాల గురించి లెక్క చేయటం లేదు. నా విషయంలో ఆ పత్రిక ఇలా వ్యవహరించటం ఇది మొదటిసారి కాదు. న్యాయమూర్తుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల సంగతి ఏమిటి..? ఇటువంటి పత్రికలు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఓ న్యాయమూర్తి తన మీద జరిగే ఇటువంటి దాడుల గురించి ఎవరికి చెప్పుకోగలరు? ఎక్కడ చెప్పుకోగలరు? మేం నోరువిప్పలేం కాబట్టి.. ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని మరీ దాడులు చేస్తారా..? ఎంత కాలం? ఎప్పటి వరకు ఇలా జరుగుతూ పోతుంది..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రవిచందర్ స్పందిస్తూ.. న్యాయమూర్తుల మౌనాన్నీ వారు చేతగానితనంగా భావిస్తున్నారని, అందువల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలని, ఆ సమయం కూడా ఆసన్నమైందని పేర్కొన్నారు. 

తిరిగి జస్టిస్ నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ‘‘ఆ పత్రిక లాంటి వాళ్లు చేతిలో రాళ్లు పట్టుకుని న్యాయమూర్తులపైకి విసురుతున్నారు. ఎందుకంటే న్యాయమూర్తులు గాజు గదుల్లో ఉంటారని వాళ్లకు తెలుసు. రాళ్లు విసిరితే న్యాయమూర్తులు భయపడతారని వాళ్లు అనుకుంటున్నారు. అదే న్యాయమూర్తులు గాజు గదులు వీడి బయటకు వస్తే..? ఓ న్యాయమూర్తి నెల నెలా వచ్చిన జీతంలో ఓ చిన్న కారు కొనుక్కొంటే అది ఓ పెద్ద న్యూస్. ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఆ కారు ఎలా కొన్నారు..? ఇలా ఆరాలు తీస్తూ వార్తలు రాస్తారు. మరి పత్రికా యజమాని గతం ఏమిటి..? ఆయన ఎక్కడ ప్రస్థానం ప్రారంభించారు..? ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నారు..? ఇదంతా ఎలా సాధ్యమైంది..? అని ఎవరైనా ప్రశ్నిస్తారా..? ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?’’ అని ప్రశ్నించారు. దీనిని తేలికగా తీసుకోకూడదని, ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్టు ధిక్కారంగా తీసుకోవాలని, అది కూడా క్రిమినల్ కోర్టు ధిక్కారంగా పరిగణించాలని, అడ్వొకేట్ జనరల్ సహకారం తీసుకోవాలని న్యాయమూర్తిని రవిచందర్ కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ధిక్కార అభ్యర్థనపై పునరాలోచించాలని రవిచందర్‌కు సూచించారు. దీనిపై బుధవారం నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం తీరుపై హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=515277&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: