ఏప్రిల్ 1 నుంచి 30-50% పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏప్రిల్ 1 నుంచి 30-50% పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు!

ఏప్రిల్ 1 నుంచి 30-50% పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు!

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013


 రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల స్థలాలు, కట్టడాల మార్కెట్ (రిజిస్ట్రేషన్) విలువలు మరింత పెరగనున్నాయి. స్థూలంగా సగటున 30 నుంచి 50 శాతం వరకూ పెరగనున్నాయి. కొన్ని నగరాల పరిధిలోని గ్రామాల్లో 200 నుంచి 300 శాతం వరకూ పెరిగాయి. వైఎస్‌ఆర్ జిల్లా కడప నగరంలో కొన్ని చోట్ల ప్రతిపాదిత విలువలు 100 నుంచి 125 శాతం వరకూ పెరిగాయి.

పులివెందుల రోడ్డు, రాజంపేటరోడ్డు ప్రాంతాల్లో ప్రతిపాదిత మార్కెట్ విలువ సెంటుకు రూ.2 లక్షల నుంచి రూ.4.5 లక్షలకు పెరిగింది. కృష్ణా జిల్లాలో భూముల విలువలు 20 నుంచి 50 శాతం శాతం వరకూ పెరిగాయి. విజయవాడ బీసెంట్ రోడ్డు, బెంజి సర్కిల్ ప్రాంతాల్లో ప్రస్తుతం గజం విలువ రూ.60 వేలు ఉండగా ఇప్పుడు రూ.80 వేలకు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 20 నుంచి 25 శాతం మాత్రమే విలువలు పెరిగాయి. ఇప్పటికే మార్కెట్ విలువలు ఎక్కువగా ఉన్నందున ఈ పర్యాయం తక్కువగా పెంచామని ఆ శాఖ అధికారులు తెలిపారు.

15వ తేదీ వరకు ప్రదర్శన: సవరించిన మార్కెట్ విలువలు మార్చి 15వ తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంటాయి. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లోనూ పెట్టారు. అయితే కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని భూములు, కట్టడాల విలువలు ఇంకా వెబ్‌సైట్‌లో పెట్టలేదు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మార్కెట్ రివిజన్ కమిటీ బుధవారం సమావేశమై కొత్త రిజిస్ట్రేషన్ విలువలకు ఆమోదం తెలిపింది.

అందువల్ల ఇక్కడి వివరాలు ఇంకా వెబ్‌సైట్‌లోగానీ, సబ్ రిజిస్ట్రార్, మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో కానీ లేవు. కొత్త రిజిస్ట్రేషన్ విలువలపై ప్రజలకు ఎవరికైనా అభ్యంతరాలున్నా, సలహాలు ఇవ్వదలచుకున్నా వచ్చే నెల 15వ తేదీలోగా నేరుగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లిఖిత పూర్వకంగా అందజేయవచ్చు. వీటిని మార్చి 16 నుంచి 20వ తేదీ వరకూ మార్కెట్ సవరణ కమిటీలు పరిశీలిస్తాయి. సవరించిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

ఈ ధరలపైనే భూముల రిజిస్ట్రేషన్ సమయంలో పట్టణ ప్రాంతాల్లో 7.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ కమిటీలు ఆమోదించిన కొత్త మార్కెట్ విలువలను సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రభుత్వం మొదటిసారి నిర్ణయించింది. అయితే వెబ్‌సైట్‌లో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని వివరాలూ ఒకే విధంగా లేవు. చాలామంది సబ్ రిజిస్ట్రార్లు ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలు పెట్టకుండా కొత్త (ప్రతిపాదిత) విలువలు మాత్రమే పెట్టారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఎంత మేరకు విలువలు పెరిగాయో తెలియడం లేదు.
Share this article :

0 comments: