తొలిరోజు 15.5 కి.మీ. నడవనున్న షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలిరోజు 15.5 కి.మీ. నడవనున్న షర్మిల

తొలిరోజు 15.5 కి.మీ. నడవనున్న షర్మిల

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

తొలిరోజు 15.5 కి.మీ. నడవనున్న షర్మిల
ఈ నెల 8న నల్లగొండ జిల్లాలోకి ప్రవేశం

 ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, ఆ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా దాన్ని తన భుజాన మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికీ నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం పునఃప్రారంభం కానుంది. గత డిసెంబర్‌లో మోకాలి గాయం కారణంగా రంగారెడ్డి జిల్లాలో యాత్ర నిలిచిపోయిన చోటు నుంచే తిరిగి షర్మిల యాత్ర కొనసాగించనున్నారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి తెలిపారు.

‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి నగర్‌లో జరిగిన సభలో బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ప్రసంగించి, కిందకు దిగుతూ షర్మిల గాయపడిన సంగతి తెలిసిందే. ఎమ్మారై స్కానింగ్ పరీక్షలో ఆమె మోకాల్లోని లేట్రల్ మెనిస్కస్, మీడియల్ కొల్లేట్రల్ లిగమెంటుకు బలమైన గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించి, అత్యవసరంగా శ్రస్త్ర చికిత్స చేశారు. సుమారు ఏడు వారాలపాటు ఆమెకు వైద్య చికిత్సలు అందించిన డాక్టర్ రఘువీర్‌రెడ్డి.. పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షర్మిల తిరిగి యాత్రకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్స్‌కు ఆమె చేరుకుంటారని, (డిసెంబర్ 15న ఇక్కడే పాదయాత్రకు విరామం ప్రకటించారు) ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభిస్తారని తలశిల రఘురాం, కేకే మహేందర్‌రెడ్డి తెలిపారు. తుర్కయాంజాల్, రాగన్నగూడెం, బొంగులూరు గేటు, మాన్‌సాన్‌పల్లి గేటు, శేరిగూడెం మీదుగా 15.5 కిలోమీటర్లు ప్రయాణించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారని, అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని వారు తెలిపారు.

నల్లగొండ జిల్లాలో 11 రోజులపాటు యాత్ర 
‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈ నెల 8న నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ నేతలు తలశిల రఘురాం, జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎనిమిదో తేదీ మధ్యాహ్నం దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ ద్వారా పాదయాత్ర జిల్లాలోకి చేరుకుంటుందని వారు తెలిపారు. దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని వారు చెప్పారు. సుమారు 11 రోజుల పాటు 150 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. షర్మిల డిసెంబర్ 14 వరకు.. 57 రోజుల పాటు 824 కిలోమీటర్ల మేర కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: