షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 73, కిలోమీటర్లు: 1,035 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 73, కిలోమీటర్లు: 1,035

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 73, కిలోమీటర్లు: 1,035

Written By news on Monday, February 25, 2013 | 2/25/2013

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఆవేదన
ఈ పాలకుల నిర్లక్ష్యం నిండా ముంచింది
అకాల వర్షాలతో నష్టపోయినవారికి భరోసా ఇచ్చేవారే కరువయ్యారు
అవిశ్వాసంతో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని దించాల్సిన చంద్రబాబు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 73, కిలోమీటర్లు: 1,035

‘‘పల్లెలు మళ్లీ కరువు కోరల్లో చిక్కి వల్లకాడుగా మారుతున్నాయి. అప్పులు చేసి భూమిలో విత్తనం వేసినా.. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట చేతికందలేదు. కొద్దోగొప్పో అందినా గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆదుకునే దిక్కులేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అప్పుల బాధలు తాళలేక కిడ్నీలు అమ్ముకుంటున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నదాతకు అండగా నిలబడి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దింపాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సాగింది. దాచేపల్లి మండలం గామాలపాడు, నారాయణపురం గ్రామాల్లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు విన్నారు. ‘‘మూడు ఎకరాల మాగాణిలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినా. అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నా. దేశం మొత్తం రైతులు ఇట్నే ఉన్నారమ్మా..’’ అని నారాయణపురానికి చెందిన నాగేశ్వర్‌రావు అనే రైతు చెప్పడంతో షర్మిల చలించిపోయారు. త్వరలోనే రైతన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. నారాయణపురంలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో షర్మిల రచ్చబండ వేదిక నుంచే మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇది రైతుల పట్ల చిత్తశుద్ధి లేని సర్కారు..

ఈ నెలలోనే అకాల వర్షాలు కురిశాయి. ఆరున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. నిజానికి ఇంతకన్నా మూడింతలు ఎక్కువగా నష్టం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నోటి కాడి ముద్ద నేలపాలయినట్లు మార్కెట్ యార్డుకు తెచ్చిన తర్వాత పత్తి, మిరప పూర్తిగా తడిసిపోయి రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా ఏ ఒక్క ఎమ్మెల్యే కాని, మంత్రి కాని, అధికారి కాని నష్టపోయిన రైతు వద్దకు వెళ్లి పలకరించ లేదు. పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపరిహారం ఇస్తామని రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి అకాల వర్షాలకే కాదు... నీలం తుపానుకు 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లైలా, జల్ తుపాన్ వచ్చినప్పుడు రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందని సర్కారే అంచనా వేసింది. అయినా రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంతో తెలుసా? కేవలం రూ.17 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇదీ మన పాలకులకు రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..

చంద్రబాబు గారు పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చెప్పగల సమర్థుడు ఆయన. చంద్రబాబు తన పాలన చాలా బాగుందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన గారు ఏ చార్జీలను పెంచలేదట. 8 సంవత్సరాల 8 నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. అవి కట్టలేమని రైతులు మొత్తుకున్నా వినలేదు. ప్రత్యేకంగా కోర్టులు, పోలీసు స్టేషన్లు పెట్టి రైతన్నలను చిత్రహింసలు పెట్టారు. ఆర్టీసీని బాదేశారు. గ్యాస్ ధర పెంచారు. అన్ని రకాల పన్నులు పెంచారు. అయ్యా..! నీ పరిపాలనలో రైతు కుటుంబాలు కుదేలై అప్పుల బాధలు ఒకవైపు, బిల్లుల కోసం పోలీసు స్టేషన్‌కు ఈడ్చితే ఆ అవమానం తట్టుకోలేక మరోవైపు 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

ఇంకో మాట కూడా చెప్తున్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారట! ఈ మాట వింటే నవ్వొస్తుంది. రాష్ట్రంలో మరోసారి చంద్రబాబునాయుడో.. ఈ కాంగ్రెస్ పార్టో అధికారంలోకి వస్తే అంతకన్నా శాపం మరోటి ఉండదు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏదో ఒక రోజున నిజం గెలుస్తుంది. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారు.

ఆదివారం 73వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దాచేపల్లి మండలం శ్రీనగర్ నుంచి ప్రారంభమైంది. గామాలపాడు, నారాయణపురం మీదుగా దాచేపల్లికి చేరింది. అబద్ధపు కేసులతో జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు కట్టుకొని షర్మిలతో పాటు కదం తొక్కారు. రాత్రి 8.15 సమయంలో తక్కెళ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 14 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 1035 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున,లక్ష్మీరాజ్యం, పి.గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: