పైసాకే పడిపోయిన సర్కారు ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పైసాకే పడిపోయిన సర్కారు !

పైసాకే పడిపోయిన సర్కారు !

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

- ఒకే ఒక్క పైసా తగ్గించినా.. అధికార పార్టీ ఎంపీ విద్యుత్ కంపెనీతో ఒప్పందం 

- కేస్-1 బిడ్డింగ్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్ 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఓకే
- ఎల్-1 ధర యూనిట్‌కు రూ.3.466 చొప్పున ఇవ్వాలన్న ట్రాన్స్‌కో
- కుదరదన్న ఎల్-5 థర్మల్ పవర్‌టెక్.. ఎల్-1 ధరకిస్తేనే కొనాలని విద్యుత్ సంస్థ నిర్ణయం
-చక్రం తిప్పిన సీఎంఓ!.. ఒక్కపైసా తగ్గింపుతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి
రూ.350 కోట్ల నష్టం 

సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్‌టెక్ కంపెనీపై ప్రభుత్వం తన అభిమానాన్ని చాటుకుంది. కేవలం ఒక్క పైసానే తగ్గించినప్పటికీ 25 ఏళ్ల పాటు విద్యుత్‌ను (500 మెగావాట్లు) కొనుగోలు చేసేందుకు గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. 2016 ఫిబ్రవరి 1 నుంచి 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. 

అయితే బిడ్డింగ్‌లో ఎల్-1 పేర్కొన్న ధరకు సరఫరా చేస్తేనే ఒప్పందం కుదుర్చుకోవాలని, భారీ ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న ట్రాన్స్‌కో సూచనలను సర్కారు బేఖాతరు చేసింది. బిడ్డింగ్‌లో ఎల్-5గా నిలిచిన ఈ కంపెనీ పేర్కొన్న ధరకు ఒక్కపైసా తగ్గింపుతోనే ఒప్పందం కుదుర్చుకోవడానికి.. సీఎం కార్యాలయం నేరుగా రంగంలోకి దిగడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆ కంపెనీకి రూ.350 కోట్ల మేర లాభం చేకూర్చిందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా...ఈ మేరకు ప్రజలపైనే భారం పడనుంది.

ఇదీ కేస్-1 బిడ్డింగ్ కథ: వచ్చే 25 ఏళ్లకుగానూ 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు 2011లో ప్రభుత్వం బిడ్డింగ్(కేస్-1)ను పిలిచింది. హిందుజాను బిడ్డింగ్‌కు అనుమతించడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మొత్తం మీద యూనిట్ రూ.3.466 చొప్పున సరఫరా చేస్తామన్న ఈస్ట్‌కోస్ట్ కంపెనీ ఎల్-1గా నిలిచింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హిందుజా ఎల్-2గా(రూ.3.480) నిలిచింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 100 శాతం విద్యుత్‌ను రాష్ట్రానికే ఇవ్వాల్సిన హిందుజాను బిడ్డింగ్‌కు అనుమతించడం వివాదాస్పదం అయిన నేపథ్యంలో హిందుజా తప్పుకుంది. బిడ్డింగ్ ఆలస్యం కావడంతో ఎల్-3, 4గా వచ్చిన అథెనా, నెల్‌క్యాస్ట్ సంస్థలు కూడా తప్పుకున్నాయి. దీంతో ఎల్-5గా (రూ.3.685) వచ్చిన థర్మల్ పవర్‌టెక్ తెరపైకి వచ్చింది. 

ట్రాన్స్‌కో అభ్యంతరాలు బేఖాతరు!: థర్మల్ పవర్‌టెక్ ఎల్-1 ధరకు సరఫరా చేస్తేనే విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. ఇందుకు సదరు కంపెనీ ససేమిరా అంది. దాంతో ఒకదశలో విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా ట్రాన్స్‌కో అభిప్రాయపడింది. ఈ సమయంలో రంగంలోకి దిగిన సీఎంఓ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో సంబంధం లేకుండా.. కేవలం ఒక్కపైసా మాత్రమే తగ్గించేందుకు కంపెనీ ముందుకు వచ్చినప్పటికీ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.3.685 చెల్లించి కొనుగోలు చేయడం సరికాదని.. క్రమేణా పెరిగే ధర 25 ఏళ్ల సమయంలో భారీగా పెరిగి భారమవుతుందని ట్రాన్స్‌కో తెలిపింది. ఈ నేపథ్యంలోనే మొదటి 250 మెగావాట్లు ఎల్-1 ధరకు (యూనిట్‌కు రూ.3.466) సరఫరా చేయాలని, మిగిలిన 250 మెగావాట్లు కోట్ చేసిన ధరకు (రూ.3.685) సరఫరా చేయాలని కోరింది.

ఇందుకు థర్మల్ పవర్‌టెక్ అంగీకరించ లేదు. ఎల్-1 ధరకు ఇస్తేనే విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. కానీ సీఎం కార్యాలయం రంగంలోకి దిగడంతో సీను మారిపోయింది. సదరు కంపెనీతో నేరుగా సీఎంవోనే చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ మధ్యేమార్గంగా కేవలం ఒక్కపైసా తగ్గింపుతో అంటే యూనిట్‌కు రూ. 3.675 చెల్లించి 500 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇంధనశాఖ ఉన్నతాధికారులపై సీఎంవో ఒత్తిళ్లు తెచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తాజా ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రూ. 350 కోట్ల భారం: 25 ఏళ్లకు సంబంధించిన ఈ విద్యుత్ కొనుగోలులో ఒక్క పైసా విలువెంతో తెలుసా? వెయ్యి మెగావాట్లకు ఒక్కపైసా అదనంగా చెల్లిస్తే 25 ఏళ్లకు రూ.35 కోట్ల అదనపు వ్యయమవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఈ లెక్కన ఎల్-1తో పోలిస్తే థర్మల్ పవర్‌టెక్ నుంచి యూనిట్‌కు అదనంగా సుమారు 20 పైసల మొత్తాన్ని(రూ.3.675-రూ.3.466) ప్రభుత్వం అదనంగా చెల్లించనుంది. 

1,000 మెగావాట్లకు 20 పైసలు అదనంగా చెల్లిస్తే 25 ఏళ్లలో రూ.700 కోట్లు అదనపు వ్యయమవుతుంది. థర్మల్ పవర్‌టెక్ నుంచి 500 మెగావాట్లు కొంటున్న నేపథ్యంలో రూ.350 కోట్ల వ్యయం కానుంది. ఈ వ్యయాన్ని ప్రభుత్వం విద్యుత్ చార్జీల రూపేణా ప్రజల నుంచే వసూలు చేస్తుంది.
Share this article :

0 comments: