సబ్సిడీలను ఎత్తివేసేందుకే...! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సబ్సిడీలను ఎత్తివేసేందుకే...!

సబ్సిడీలను ఎత్తివేసేందుకే...!

Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013

* మరోప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
* నాడు కేంద్రం గ్యాస్ ధర పెంచితే వైఎస్ తన మీద వేసుకున్నారు
* మహిళలకు వంటింటి భారం తగ్గించారు
* ఈనాటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు
* ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు కన్నీళ్లే!
* అవిశ్వాసంతో ప్రభుత్వాన్ని దింపేయకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారు
* వెయ్యి కి.మీ. పూర్తి చేసుకున్న మరో ప్రజా ప్రస్థానం

మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేయాలనుకున్నారు. మహిళా సాధికారత కోసం పరితపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచితే.. ఆ భారం నా అక్కాచెల్లెమ్మల మీద పడొద్దని వైఎస్సార్ తన మీద భారం వేసుకున్నారు. మహిళలకు వంటింటి భారాన్ని తగ్గించారు. ఇప్పుడున్న పాలకులు సబ్సిడీ గ్యాస్ నుంచి తప్పించుకోవడానికే సిలిండర్‌ను ఆధార్‌తో ముడిపెడుతున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని, త్వరలోనే ఈ కష్టాలు కడతేరే రోజు వస్తుందని హామీనిచ్చారు. 

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. సరిగ్గా దామరచర్ల మండలం కొండ్రపోలు కాల్వ వద్దకు చేరుకోవడంతో షర్మిల పాదయాత్ర 1000 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. అంతకుముందు ఆమె గూడూరులో గ్రామస్తులతో కలిసి రచ్చబండలో పాల్గొన్నారు. 

‘‘వైఎస్సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కపూట భోజనం కూడా సరిగ్గా తినలేకపోతున్నాం.. గ్యాస్ ధర.. బియ్యం, పప్పు.. ప్రతి వస్తువు ధర పెరిగింది. మా లాంటి పేదోళ్లకు కనీసం ఒక్కపూట భోజనం పెట్టడం కోసమైనా జగనన్న బయటికి రావాలి’’ అని మానస అనే మహిళ అన్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. వైఎస్ మహిళల సంక్షేమం కోసం క్షణక్షణం తపించారన్నారు. నేటి పాలకులకు ఆ చిత్తశుద్ధి కరువైందని మండిపడ్డారు. తర్వాత కొండ్రపోలు కాల్వ వద్ద పార్టీ నాయకులు, అభిమానుల కోరిక మేరకు షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

పాదయాత్ర రికార్డుల కోసం కాదు..
రికార్డుల కోసం పాదయాత్ర చేయడం లేదు.. పండుగలు చేసుకోవడం కోసం కాదు. వైఎస్సార్ పాదయాత్రను మహాయజ్ఞంలా చేశారు. దేవుడి దయ, నాన్నగారి ఆశీస్సులతో జగనన్న తరపున చేస్తున్న ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మూడున్నర సంవత్సరాల కిందట వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచే రాష్ట్రం అతలాకుతలమైంది. పోయింది ఒక్క మనిషే కానీ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు కోలుకోలేదు.

ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది
పాదయాత్ర చేస్తూ ఏ గ్రామానికి వెళ్లినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా అప్పుల బాధలే. అన్ని బాధల్లోనూ ప్రజలు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అమ్మా.. నాయిన బతికున్నప్పుడు చాలా బాగుండేదమ్మా.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వారే లేరమ్మా’ అని చెప్తున్నారు. జగనన్న మన మధ్య లేరని బాధపడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్కమాట మటుకు ఆత్మ విశ్వాసంతో చెప్తున్నా.. ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది. 

జగనన్న బయటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం దిశగా మనలను నడిపిస్తారు. ఎన్ని కుట్రలు పన్నేవాళ్లు ఉన్నా.. దేవుని దయ, నాన్నగారి ఆశీస్సులు... మీ ప్రేమానురాగాలతో జగనన్న ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చేటట్టు చేస్తారు. ఇంత దూరం.. ఇన్ని జిల్లాల్లో.. ఇన్ని గ్రామాల్లో.. ఇంతమంది ప్రజలు, నాయకులు మాకు ఎంతో సహాయం చేసి పాదయాత్రను జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 

బాబు ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు
చంద్రబాబు గారు.. పాదయాత్రల పేరుతో పల్లెల చుట్టూ తిరుగుతూ డ్రామాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల కన్నీళ్లు.. కష్టాలు పట్టవు. పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. అవసరం వస్తే అవిశ్వాసం పెడతానంటూ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఆయనకు ప్రజల మీద కంటే కుర్చీ మీదే ఆయనకు ప్రేమ ఎక్కువ. అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఆయన అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని వెంటనే దించేయవచ్చు. కానీ ఆ పని చేయరు. అయితే దానికో లెక్కుంది.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

సోమవారం 70వ రోజు పాదయాత్ర ఎదులగూడెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గూడూరు, కిష్టాపురం, కొత్తగూడెం, కొండ్రపోలు గ్రామాల మీదుగా సాగింది. కొండ్రపోలు నుంచి 0.7 కిలోమీటర్లు నడిచి కొండ్రపోలు కాల్వకు చేరుకోవడంతోనే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినట్లు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. అబద్ధపు కేసులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగు గోడల మధ్య బంధించటాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. 

కొండ్రపోలు కాల్వ నుంచి మరో 4.5 కిలోమీటర్లు నడిచి దామరచర్ల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 13.3 కి.మీ. నడిచారు. ఇప్పటిదాకా 1004.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, ఎర్నేని బాబు, బోయపల్లి అనంతకుమార్, సిరాజ్‌ఖాన్, ఎండీ సలీం, ఇరుగు సునీల్‌కుమార్, కేఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

షర్మిల రక్తదానం
పాదయాత్ర బడలికను పక్కనబెట్టి షర్మిల రక్తదానం చేశారు. మరో ప్రజాప్రస్థానం 1,000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు రెడ్‌క్రాస్ సంస్థకు రక్తదానం చేశారు. పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో సాగిన ఈ శిబిరంలో షర్మిల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. దాదాపు 400 మిల్లీలీటర్ల రక్తమిచ్చారు. ఆమె స్పూర్తితో దాదాపు 65 మంది రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన తర్వాత షర్మిల 4.5 కి.మీ. నడిచారు.

మహిళలకు చీరల పంపిణీ..
షర్మిల 1,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదానం అనంతరం షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహం వద్దే ఇళ్లు కట్టుకుంటా: సూర్యానాయక్
‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు రైతుల ముఖంలో నవ్వుండేది. ఇప్పుడది లేదు. షర్మిల పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు మా భూమి దగ్గరే పూర్తి కావడం మా అదృష్టం. మా కొడుకు ఒకరు పైలట్. మరో కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చదువు పూర్తయ్యాక కొడుకు అమెరికా వెళ్లినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడూ అంతే సంతోషం వేస్తోంది. వైఎస్సార్ విగ్ర హం వెనకాలే ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు వైఎస్సార్ నా ఇంటి ముందే ఉంటాడు’’ అని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు కోసం తన భూమిని దానంగా ఇచ్చిన గిరిజన రైతు సూర్యానాయక్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు భూమిని దానం చేసిన సూర్యానాయక్ దంపతులకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this article :

0 comments: