తక్షణం రుణమాఫీ ప్రకటించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తక్షణం రుణమాఫీ ప్రకటించండి

తక్షణం రుణమాఫీ ప్రకటించండి

Written By news on Wednesday, February 20, 2013 | 2/20/2013

* రైతులకు, గ్రామీణ వృత్తి పనివారికి వర్తించేలా పథకాన్ని ప్రకటించాలని డిమాండ్
* సర్కారు వైఫల్యం, ప్రకృతి ప్రకోపం వల్ల వ్యవసాయంలో నెలకొన్న దుస్థితిని వివరించిన విజయమ్మ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు, గ్రామీణ వృత్తి పనివారి రుణాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం మాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు మంగళవారం ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను అందులో వివరించడంతో పాటు రుణాల మాఫీ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. విజయమ్మ లేఖ పూర్తి పాఠం...

ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ గారికి,
2012 నవంబర్ 1 నుంచి 4 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అతలాకుతలం చేసిన నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ గతంలో (10-11-2012న) నేను మీకు లేఖ రాసిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతుల రుణాలను ఆదుకునేందుకు కేంద్రం ఒక రుణ మాఫీ పథకాన్ని ప్రకటించాలని ఆ సందర్భంగా మిమ్మల్ని కోరాను. ఆ లేఖ సారాంశాన్ని దిగువ ప్రస్తావిస్తున్నాను:

‘‘ఎరువుల ధరలు ఏకంగా 200 శాతం పెరిగినా ధాన్యానికి కనీస మద్దతు ధరను కేవలం 25 శాతమే పెంచడంతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఇతర ఉత్పత్తి వ్యయాలు కూడా భారీగా పెరిగి సాగు అసలు గిట్టుబాటే కాని పరిస్థితిని కల్పించాయి. 2009-10, 2010-11 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర వైఫల్యం, దానికి తోడు 2011-12లో కనీవినీ ఎరుగని రీతిలో ఎరువుల ధరలను పెంచడం వల్ల మా రాష్ట్ర రైతులు అడుగడుగునా ఎదురు దెబ్బలే తిన్నారు. దాదాపుగా ప్రతి రైతూ రుణ ఊబిలో చిక్కుకున్నాడు. రుణ మాఫీ పథకంతో వారిని ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని మేం కోరుతున్నాం’’

2010లో క్వింటాలుకు రూ.1,000 ఉన్న సాధారణ రకం వరి ధాన్యం కనీస మద్దతు ధరను 2012-13లో రూ.1,250కి కేంద్రం పెంచిందన్నది వాస్తవమే. అంటే గత మూడేళ్లలో 25 శాతం పెంపు జరిగింది. కానీ అదే కాలంలో వితనాలు, ఇంధనం, ఎరువులు, కార్మికుల వంటి ఉత్పత్తి వ్యయాలతో పాటు ద్రవ్యోల్బణం కూడా అనేక రెట్లు పెరిగిపోయాయి. సాగును ఏమాత్రమూ గిట్టుబాటు కాని వ్యవహారంగా మార్చేశాయి. గత రెండేళ్లలో ఎరువుల ధరలు ఎంత భారీగా పెరిగిపోయాయో 14-12-2012న రాసిన లేఖలో నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. వాటిని తక్షణం తగ్గించాల్సిన ఆవశ్యకతను కూడా నొక్కిచెప్పాను. పంటల ఉత్పాదకత పెరిగేందుకు సాగునీటి తరవాత నేరుగా, అత్యధికంగా దోహదపడేది ఎరువుల వాడకమేనన్నది తెలిసిందే. గత రెండేళ్లలో ఎరువుల ధరలు ఎంతగా పెరిగాయో ఆ లేఖలో నేను పొందుపరిచిన ఈ కింది టేబుల్ స్పష్టంగా చెబుతోంది...

డీఏపీ ధరలు 150 శాతం ఎన్‌పీకే ధరలు 200 శాతం, ఎంఓపీ ధరలైతే ఏకంగా 300 శాతం పెరిగాయి! ఏ రకంగా చూసినా ఇది అనూహ్యం, అసాధారణమైన పెరుగుదలే.మన దేశంలో 1981-91 దశకంలో 5.2 శాతమున్న వార్షిక వ్యవసాయ వృద్ధి రేటు 1991-2001 దశకంలో ఏకంగా 2.2 శాతానికి పడిపోయిందన్న విషయం మీకు తెలిసిందే. 

1998-2010 మధ్య ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు రెండూ 4% వార్షిక వ్యవసాయ వృద్ధి రేటును లక్షించినా అది 2.5 శాతానికే పరిమితమైంది. జనాభాలో 70 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయం వంటి అతి ముఖ్యమైన రంగంలో వార్షిక వృద్ధిరేటు 5.5 శాతం నుంచి ఏకంగా 2.2 శాతానికి తగ్గిపోయి, రెండు దశాబ్దాల పాటు అలాగే కొనసాగిందంటే రైతుల వాస్తవాదాయాలు కూడా భారీగా పడిపోయాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

దాంతో దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని గ్రామీణ సంక్షోభం,నిరాశా నిస్పృహలు అలముకున్నాయి. 1990 ప్రాంతంలో దేశంలోని 15 జిల్లాలకే పరిమితమైన మావోయిస్టు కార్యకలాపాలు నేడు 150 జిల్లాలకు పాకడం కూడా ఇందుకు నిదర్శనమే. వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న ఈ దురవస్థను తొలగించాలంటే డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ సారథ్యంలోని రైతు కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్రం తక్షణం అమలు చేయాల్సిందే. రైతులు, గ్రామీణ వృత్తిదారుల విశాల ప్రయోజనాలతో పాటు దేశ ఆహార భద్రత దృష్ట్యా కూడా తక్షణం రైతులు, వృత్తి పనివారి కోసం రుణ మాఫీ పథకాన్ని ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని మేం కోరుతున్నాం. ఎరువుల ధరల పెరుగుదల బారి నుంచి రైతులకు రక్షణ కల్పించాలి. అంతేగాక పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరను కూడా పెంచేందుకు ఫార్ములాను రూపొందించాలి.

ఇట్లు
వైఎస్ విజయమ్మ

సాహసోపేతంగా ఆదుకున్న వైఎస్
2008లో కేంద్రం రైతులకు రుణ మాఫీ పథకం ప్రకటించినప్పుడు, అప్పటికే తమ రుణాలను సక్రమంగా చెల్లించడం వల్ల పథకం తాలూకు లబ్ధి పొందలేని అన్నదాతలను ప్రోత్సహించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ ప్రయోజనాన్ని పొందలేని ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నజరానా అందించాలని నిశ్చయించారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ప్రోత్సాహకం ప్రకటించారు. ఫలితంగా ఏకంగా 36 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. 

విపక్షాల నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యక్తిగత సంభాషణల్లో ప్రస్తుతించారు! వైఎస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద రూ.1,800 కోట్ల భారం పడింది. ఈ కారణంగా కొందరు మంత్రులు, అధికారులు వ్యతిరేకత వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఆయన తన నిర్ణయాన్ని అమలు చేసి చూపారు. సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకం అక్కర్లేదంటూ మంత్రివర్గ సహచరులు, అధికారులు సూచించినా వెనక్కు తగ్గలేదు. సకాలంలో రుణాలు చెల్లించేసిన రైతులను ప్రోత్సాహించాల్సిందేనని, అందుకోసం ఈ మాత్రం చేయడం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. ఆ క్రమంలో ఖజానాపై భారం పడినా వెనక్కు తగ్గేది లేదన్నారు.
Share this article :

0 comments: