ప్రజలపైనే ఉచిత విద్యుత్ భారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలపైనే ఉచిత విద్యుత్ భారం

ప్రజలపైనే ఉచిత విద్యుత్ భారం

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

* ప్రజలపైనే ఉచిత విద్యుత్ భారం
* గత రెండేళ్లలో రూ. 3,378 కోట్ల బాదుడు 

 ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ కొడుతోంది. ఉచిత విద్యుత్ భారాన్ని భరించకుండా ప్రజలపై వేస్తోంది. వ్యవసాయానికి సరఫరా చేసే ఉచిత విద్యుత్‌కు ఉద్దేశపూర్వకంగా తక్కువగా అంచనాలు రూపొందిస్తోంది. అయితే వాస్తవానికి ఈ విద్యుత్ సరఫరా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత రెండేళ్లలో ఇదేవిధంగా అధికంగా విద్యుత్ సరఫరా అయ్యింది. అయితే అంచనా వేసిన మొత్తానికే సబ్సిడీని భరిస్తున్న సర్కారు.. అదనంగా సరఫరా అయిన మొత్తానికి సబ్సిడీ చెల్లించకుండా ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. ఉచిత విద్యుత్ భారాన్ని తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు తెస్తున్న ప్రభుత్వం.. మరోవైపు వ్యవసాయానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌కు సబ్సిడీని చెల్లించడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కూడా ఇందుకు ఆమోదం తెలపడం శోచనీయం. దీంతో గత రెండేళ్లలోనే (2011-12, 2012-13) ప్రభుత్వం ఏకంగా రూ. 3,378 కోట్లకుపైగా ఉచిత విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపింది. ఫలితంగా ప్రజలకు నిరంతరం విద్యుత్ షాక్‌లు తగులుతున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి సరఫరా చేసే అదనపు విద్యుత్‌కు అదనపు సబ్సిడీని ప్రభుత్వం భరించింది. 2009 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అదనపువిద్యుత్ కొనుగోలు చేసినందుకుగానూ సుమారు రూ.7 వేల కోట్ల భారాన్ని భరిస్తామని వైఎస్ హామీ ఇచ్చారు. ఈ భారాన్ని ప్రజలపై మోపేందుకు ఆయన ససేమిరా అన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. 

సర్కారు సబ్సిడీ తగ్గించుకుంటోందిలా..!
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రంగాలకు చేయాల్సిన విద్యుత్ సరఫరా, డిమాండ్, లోటు వివరాలతో పాటు విద్యుత్ సంస్థలకు వచ్చే ఆదాయం, లోటు, ప్రభుత్వ సబ్సిడీ, చార్జీల పెంపు తదితర అంశాలకు సంబంధించిన వివరాలతో ‘వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)’ ను విద్యుత్ సంస్థలు ఏటా నవంబర్ చివరివారంలో ఈఆర్‌సీకి సమర్పిస్తాయి. ఇందులో వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ అవసరమో ఆ వివరాలను కూడా పేర్కొంటారు. ఇందుకు అనుగుణంగా యూనిట్ విద్యుత్‌కు అయ్యే సగటు వ్యయాన్ని లెక్కించి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. ఇక్కడే ప్రభుత్వం తన ‘చాకచక్యాన్ని’ ప్రదర్శిస్తోంది. వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అంచనాలను తగ్గించి చూపుతోంది. 

ఆ మేరకు ప్రభుత్వ సబ్సిడీ భారం కూడా తగ్గుతోంది. అయితే విద్యుత్ సంస్థలు సమర్పించిన వివరాలను ఈఆర్‌సీ పరశీలించి వాస్తవిక అంశాల ఆధారంగా అంచనా వేసుకుని విద్యుత్ వినియోగం, డిమాండ్, సరఫరా, లోటు వివరాలతో పాటు చార్జీల పెంపును నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ విధంగా నిర్ధారించిన తర్వాత మార్చి చివరివారంలో ఆమోదం తెలుపుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్తధరలు అమల్లోకి వస్తాయి. ఇక్కడే ఈఆర్‌సీ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తుతూ.. వ్యవసాయ విద్యుత్ అంచనాలను తక్కువగా చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలపై భారం పడేందుకు సహకరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రెండేళ్లుగా ఇదే తంతు: ఏటా వ్యవసాయ విద్యుత్ సరఫరా అంచనాలను తక్కువగా లెక్కిస్తున్న వైనం గత రెండేళ్ల లెక్కలను పరిశీలిస్తే బోధపడుతుంది. 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయానికి రాష్ర్టంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో అంచనాలకు మించి అదనంగా 6,143.15 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మేరకు విద్యుత్ సరఫరా అయ్యింది. 2011-12లో ఈఆర్‌సీ అనుమతి మేరకు వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన విద్యుత్ 16,569.22 ఎంయూలుకాగా, సరఫరా అయిన విద్యుత్ 19,924.40 ఎంయూలు. అంటే అదనంగా 3,355.18 ఎంయూల విద్యుత్ సరఫరా అయ్యిందన్నమాట. 

అదేవిధంగా 2012-13లో 2,787.97 ఎంయూల మేర అదనపు విద్యుత్ సరఫరా అయ్యింది. కొరత నేపథ్యంలో మార్కెట్లో ఏకంగా యూనిట్‌కు రూ.5.50 చెల్లించి ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన ఈ రెండేళ్లలో 6143.15 ఎంయూలకు యూనిట్‌కు రూ.5.50 చొప్పున రూ.3378.73 కోట్ల మేర అదనపు వ్యయం అయ్యిందన్నమాట. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాలి. కానీ అలా చేయకుండా వినియోగదారుల (గృహ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు)పై ఆ భారాన్ని మోపింది. వ్యవసాయానికి కచ్చితంగా ఏడుగంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయకపోతేనే పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకవేళ చేస్తే, అంచనాలు అదేవిధంగా రూపొందిస్తే ఈ భారం మరింత పెరగడం ఖాయం. 

సర్దుబాటూ ప్రజలపైనే..!: మొదటవేసిన అంచనాల కంటే విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. బొగ్గు ధరలు పెరగడం, గ్యాసు సర ఫరా తగ్గడంతో అధిక ధరను చెల్లించి గ్యాసును కొనుగోలు చేయడం మొదలైన కారణాల వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఈ విధంగా అంచనాలకు మించి పెరిగిన వ్యయాన్ని ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) రూపంలో వినియోగదారులందరి నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతున్నందున... వ్యవసాయ విద్యుత్‌కు గాను వసూలు చేయాల్సిన సర్దుబాటు చార్జీలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం దీన్ని కూడా ఇతర వినియోగదారుల నుంచే వసూలు చేస్తోంది. ఒకవైపు రెగ్యులర్, మరోవైపు సర్దుబాటు పోట్లతో ప్రజలు విలవిల్లాడాల్సి వస్తోంది. 

అందరిపై ఆర్-ఎల్‌ఎన్‌జీ భారం!: 2013-14 ఆర్థిక సంవత్సరంలో రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) ద్వారా 6,008 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రూ.6,008 కోట్లు వెచ్చించి ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే యూనిట్‌కు ఏకంగా రూ.10 చొప్పున వెచ్చించనుందన్నమాట. ఈ ఆర్-ఎల్‌ఎన్‌జీ విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేయనున్నట్టు గత నెలలో ట్రాన్స్‌కో సీఎండీ చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్న దృష్ట్యా ఆర్-ఎల్‌ఎన్‌జీతో చేసే అదనపు విద్యుత్ ఉత్పత్తికి అయ్యే అదనపు భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన రూ.12,723 కోట్ల విద్యుత్ చార్జీల పెంపులో ఆర్-ఎల్‌ఎన్‌జీ వాటా రూ.6,008 కోట్లుగా ఉంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తే... ప్రజలపై పడాల్సిన ప్రతిపాదిత భారం కేవలం రూ.6,715 కోట్లు మాత్రమే. కానీ ప్రభుత్వం మొత్తం భారాన్ని వినియోగదారులందరిపైనా మోపేందుకు సిద్ధమైంది. 

ఇలా షాకులు..
* సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేసే విద్యుత్‌ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తక్కువగా అంచనా వేస్తోంది.
* వాస్తవంగా వ్యవసాయానికి జరిగే కరెంటు సరఫరా ఏటా ఈ అంచనాలకు మించే ఉంటోంది.
* 2011-12 ఆర్థిక సంవత్సరానికి 16,569.22 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను అంచనా వేస్తే.. వాస్తవంగా జరిగిన సరఫరా 19,924.40 మిలియన్ యూనిట్లు. 

* అలాగే 2012-13కు గాను 18,225.90 మిలియన్ యూనిట్లు అంచనా వేయగా 21,013.87 మిలియన్ యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ సరఫరా జరిగింది.

* అయితే ముందుగా వేసుకున్న అంచనాలకు అనుగుణంగా ఆ మొత్తానికే ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తోంది.

* అదనంగా సరఫరా అయిన విద్యుత్‌కు సబ్సిడీ చెల్లించేందుకు ససేమిరా అంటూ ఆ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేస్తోంది.
* అలా 2011-12, 2012-13లలో రూ. 3,378 కోట్ల భారాన్ని మోపింది.
Share this article :

0 comments: