కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో?

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో?

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

* ప్రభుత్వానికి తగిన బలం లేదు!
* పరోక్షంగా తేల్చేసిన పీసీసీ చీఫ్
* సాంకేతికంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 155 
* 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరించామన్న బొత్స
* 146కు తగ్గిన కాంగ్రెస్ బలం.. మెజారిటీకి 2 తక్కువ
* అయినా నోరు మెదపని టీడీపీ, విపక్ష నేత చంద్రబాబు
* మరోసారి రుజువవుతున్న ‘కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు’
* అవిశ్వాసానికి టీడీపీని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ
* సర్కారుకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్.. వ్యతిరేక ఓటుకు సిద్ధం 
* అవిశ్వాసానికి సహకరిస్తామన్న సీపీఎం నేత రాఘవులు
* ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలోనే ఓటేసిన టీఆర్‌ఎస్ 

 ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందా? అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? తమ ప్రభుత్వం ఎవరి దయాదాక్షిణ్యాల మీదా ఆధారపడలేదని, తగిన మెజారిటీ ఉందని ఇటీవల కిరణ్ చేసిన వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనా? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం స్వయంగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇది నిజమే అనిపించక మానదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించామని గాంధీభవన్ వేదికగా బొత్స చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రభుత్వ మెజారిటీపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం 295 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీకి 155 మంది ఎమ్మెల్యేలున్నారు.మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ బలం (కనీసం 148) ఉంటేనే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నట్టు. అప్పుడే అది మనగలుగుతుంది కూడా. ఆ లెక్కన 155 మంది ఎమ్మెల్యేలున్న కిరణ్ సర్కారు మనుగడకు ఢోకా ఏమీ లేదన్నది బయటకు కనిపించే విషయం. కానీ వారిలో 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినట్టు పీసీసీ అధ్యక్షుడే ప్రకటించడంతో తాజాగా అసెంబ్లీలో పార్టీ బలం 146కు పడిపోయినట్టే. అంటే సాధారణ మెజారిటీ కంటే ఇది రెండు స్థానాలు తక్కువ! ఈ లెక్కన కిరణ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని పీసీసీ చీఫ్ తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో బల నిరూపణ చేసుకోవాల్సిన నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం దీనిపై నోరైనా మెదపకపోవడం విచిత్రంగా ఉంది!

ఎన్ని పార్టీలు చెప్పినా...
ముస్లిం మైనారిటీల విషయంలో కిరణ్ వైఖరికి నిరసనగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ఏడుగురు ఎమ్మెల్యేలున్న మజ్లిస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. అంతేగాక అవిశ్వాస తీర్మానం ఎప్పుడు సభ ముందుకు వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేస్తామని ఆ పార్టీ బహిరంగంగా ప్రకటించింది. ఇక.. అన్ని రంగాల్లో విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. 

ఇక, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎవరు ప్రయత్నించినా తమ వంతు సహకారం అందిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కూడా నాలుగు రోజుల క్రితమే స్పష్టమైన ప్రకటన చేశారు. అవిశ్వాస తీర్మానంపై గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ నుంచి బహిష్కరించామని స్వయంగా పీసీసీ అధ్యక్షుడే ప్రకటించినా.. టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం పట్ల పార్టీల్లోనే గాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది.

బాబు తీరుపై టీడీపీలోనూ అసంతృప్తే
ప్రజా సమస్యలను పాలకులు గాలికొదిలేశారని, అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని ‘మీకోసం’ పాదయాత్రలో హామీలు గుప్పిస్తున్న బాబు.. అవిశ్వాస తీర్మానంపై మాత్రం నోరు మెదపకపోవడంపై టీడీపీ నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘బొటాబొటి సంఖ్యా బలంతో ప్రభుత్వాలు కొనసాగే రాష్ట్రాల్లో అవకాశం చిక్కుతూనే వాటిని కూల్చేయడానికి ప్రధాన ప్రతిపక్షాలు కాచుకుని కూర్చుంటాయి. 

కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రభుత్వాన్ని కాపాడేలా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వ్యవహరిస్తోందని ఆ పార్టీకి చెందిన కోస్తాంధ్ర ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. ‘అసలు బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ నుంచి ఎందరు ఎమ్మెల్యేలు బయటకు పోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లే’దని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు ఇటీవల సీఎల్పీ ఆవరణలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఉటంకిస్తున్నారు. అది నిజమేనని ప్రస్తుత పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయని వారంటున్నారు.

అందుకే ఆ ధీమా...
ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే అవకాశాల్లేవు. కానీ కీలకమైన టీడీపీయే అవిశ్వాసానికి సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి అంశాలను చర్చకు పెట్టడమే తప్పని తెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పిన, లేక అసంతృప్తి ప్రకటించిన, లేదా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా ఇచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని బొత్స అలా మాట్లాడి ఉంటారని కాంగ్రెస్‌కే చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరన్నారు. ‘కానీ బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్టే భావించాల్సి వస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

‘అయినా కూడా ప్రభుత్వ మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఇటు సీఎం, అటు మంత్రులు అంత ధీమాగా ఉన్నారంటే అందుకు కారణమేమిటో అందరికీ తెలిసిందే’ అని టీడీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని, చేతనైతే అవిశ్వాసం పెట్టుకోవచ్చని కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటీవల మీడియా సమావేశంలో కిరణ్ సవాలు చేయడాన్ని మరో పీసీసీ ముఖ్య నేత ఒకరు ప్రస్తావించారు. బాబు మద్దతుందన్న గట్టి నమ్మకమే కిరణ్‌తో అలా మాట్లాడించిందంటూ ఆయన విశ్లేషించారు.

ప్రభుత్వం మైనారిటీలో పడిందని స్వయానా పీసీసీ అధ్యక్షుడే పరోక్షంగా అంగీకరించినా, పరిస్థితిని గమనించి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం.. ఆ ఊసే ఎత్తకపోగా లోపాయకారీ ఒప్పందాలతో సర్కారును కాపాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, ఈ విషయంలో తాము అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు బాబు భరోసా ఇచ్చారంటూ అప్పట్లో జోరుగా వార్తలు రావడం తెలిసిందే. 

‘బాబు నన్ను కలిశారు’ అని కేంద్ర మంత్రి చిదంబరం స్వయంగా లోక్‌సభలోనే చెప్పారు! నిజానికి మూడేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ పరస్పరం కుమ్మక్కై ముందుకు సాగుతున్నాయని పలు రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో విమర్శిస్తూనే వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) కాంగ్రెస్‌లో విలీనం కాకముందు కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కాగా, అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంతగా డిమాండ్ చేసినా టీడీపీ అధినేత అందుకు ముందుకు రాకపోవడం, కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని నిర్ధారించుకున్నాక మాత్రమే అందుకు సిద్ధపడటం తెలిసిందే. 

అది పూర్తిగా వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని పెట్టిన అవిశ్వాస తీర్మానమేనని కాంగ్రెస్ నేతలే అప్పట్లో వ్యాఖ్యానించారు కూడా. ‘‘అవిశ్వాసంపై చర్చలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సింది పోయి, కేవలం వైఎస్సార్‌సీపీపై విమర్శలకే అసెంబ్లీ వేదికను టీడీపీ వాడుకున్న వైనాన్ని రాష్ట్రమంతా చూసింది. కానీ, అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు’’ అని కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గుర్తు చేశారు!
Share this article :

0 comments: