ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయకున్నా పట్టని వైనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయకున్నా పట్టని వైనం

ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయకున్నా పట్టని వైనం

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013

కసబ్, అఫ్జల్ ఉరికి ప్రతీకార దాడులు జరగవచ్చని వెల్లడి 
బుధ, గురువారాల్లో కూడా ప్రత్యేక అలర్ట్‌లు
అయినా పెడచెవిన.. ఫలితంగానే జంట పేలుళ్లు
ఐదు నెలల క్రితమే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల రెక్కీ
భారీ జనసమ్మర్ద ప్రాంతం... భద్రతా చర్యలు శూన్యం
ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయకున్నా పట్టని వైనం
హుబ్లీ కేంద్రంగా దక్షిణాదిన చురుగ్గా ముజాహిదీన్

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులకు దిగే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘావర్గాలు అందించిన హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం వల్లే దిల్‌సుఖ్‌నగర్ దుర్ఘటన చోటు చేసుకుందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ముంబై దాడుల దోషి కసబ్ ఉరితీతకు ప్రతీకారంగా ఉగ్రవాదలు దాడులు జరగవచ్చంటూ కేంద్ర నిఘా వర్గాలు జనవరి 19, 23, 25న అన్ని రాష్ట్రాలకూ హెచ్చరికలు పంపాయి. అఫ్టల్‌గురు ఉరికి ముందు ఫిబ్రవరి 3, 7న, తరవాత ఫిబ్రవరి 11, 13, 16, 17, 19 తేదీల్లో కూడా ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఓ ప్రత్యేక బృందాన్ని కూడా హైదరాబాద్ పంపినట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటన్నింటికీ మించి, హైదరాబాద్ సహా బెంగళూరు, హుబ్లీ (కర్ణాటక), కోయంబత్తూరు (తమిళనాడు)ల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదముందంటూ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకు ఒక రోజు ముందు బుధవారం, దాడులు జరిగిన గురువారం ఉదయం కూడా రాష్ట్రానికి ప్రత్యేకంగా అలర్ట్‌లు అందాయి. కానీ వీటిని సాధారణ హెచ్చరికలుగానే ప్రభుత్వం భావించడం దుర్ఘటనకు కారణమైందని నిపుణులు చెపుతున్నారు. రాష్ట్రాలకు నిఘా హెచ్చరికలు రావడం సాధారణమే అయినా ... కనీసం కసబ్, అఫ్జల్ గురు ఉరితీత నేపథ్యంలోనైనా, బుధ, గురువారాల్లో వచ్చిన తాజా అలర్ట్‌లను సీరియస్‌గా తీసుకుని ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశముండేదని అభిప్రాయపడుతున్నారు. 

దీనికి తోడు స్థానిక నిఘా విభాగం తీవ్రమైన అలక్ష్యం కనబరిచిందని, తాజా దాడులే అందుకు నిదర్శనమని మాజీ డీజీపీ ఒకరన్నారు.

రెక్కీ వెలుగులోకి వచ్చినా...: దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించామని పుణే పేలుళ్ల నిందితుడైన ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ 2012 అక్టోబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో వెల్లడించాడు. సహచర ఉగ్రవాది ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లోని బేగం బజార్, అబిడ్స్‌లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా మోటార్‌సైకిల్‌పై విస్తృతంగా తిరుగుతూ పక్కాగా రెక్కీ నిర్వహించామంటూ వాంగ్మూలమిచ్చాడు. ఆ సమాచారం మన పోలీసులకు వెంటనే అందింది కూడా. దాంతోపాటు బెంగళూరులో పట్టుబడ్డ ఉబేదుర్ రెహమాన్ కూడా విచారణలో అదే విషయం వెల్లడించాడు. దిల్‌సుఖ్‌నగర్, సుల్తాన్‌బజార్, అబిడ్స్‌ల్లో బాంబులు పేల్చేందుకు రెక్కీ నిర్వహించామని అతడు పేర్కొన్నట్టు బెంగుళూరు పోలీసులు అక్కడి కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో పేర్కొన్నారు. అయినా దిల్‌సుఖ్‌నగర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలే చేపట్టలేదు. దాంతో ముష్కరులు మరోసారి ఆ ప్రాంతాన్నే లక్ష్యం చేసుకుని మారణహోమం సృష్టించారు. వ్యూహాత్మకంగా పక్కపక్కనే రెండు చోట్ల బాంబులు పెట్టడం, ఒకచోట పేలగానే భయోత్పాతంతో అంతా ఎటువైపు పరుగులు తీస్తారో ఊహించి, ఆ దిశలోనే కాసేపటికి పేలేలా మరో బాంబు పెట్టారంటే భారీగా ప్రాణనష్టం జరిగేలా ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచించారో అర్థం చేసుకోవచ్చు!

భద్రతా చర్యలు శూన్యం

హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కొద్ది ప్రాంతాల్లో దిల్‌సుఖ్‌నగర్ ఒకటి. ఇక్కడ సాయంత్రం సమయంలో అర కిలోమీటర్ పరిధిలో కనీసం వెయ్యి మంది సంచరిస్తుంటారు. ఉగ్రవాదులు గతంలో రెండుసార్లు ఇక్కడ బాంబులు పేల్చేందుకు విఫలయత్నం చేశారు. మామూలుగా అయితే ఫలానా ప్రాంతంలో బాంబు దాడులు జరుగుతాయని ఊహించడం ఎవరికైనా కష్టమే. కానీ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నా కట్టుదిట్టమైన భద్రతా చర్యల దిశగా పోలీసులు ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడంపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సౌదీ టు సౌతిండియా, వయా పాక్

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సౌదీ అరేబియా కూడా ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలకు సౌదీనే వేదికగా మార్చుకుంది. పాక్ అండదండలు, ఐఎస్‌ఐ దన్నుతో , సౌదీ నుంచి అందుతున్న ఆర్థిక, ఇతరత్రా సాయాలతో దక్షిణ భారతదేశంలో అది పక్కాగా పాగా వేసింది. కర్ణాటకలో హుబ్లీతో పాటు పలు ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనూ అత్యంత చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా హుబ్లీని ఐఎం తన స్థావరంగా మార్చుకున్నట్టు వెల్లడైంది. అవసరాన్ని బట్టి అటు మహారాష్ట్ర, గోవాలకు గానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోకి పారిపోయేందుకు అనువుగా ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హుబ్లీలో ఉండగా స్థానికంగా ఏకంగా ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలే తెరిచి కొన్నాళ్ల పాటు నిర్నిరోధంగా నడిపాడంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. 

ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి 2012 ఆగస్టు 29, సెప్టెంబర్ 2 మధ్య కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లో పోలీసులు కనీసం 18 మందిని అరెస్టు చేశారు. దక్షిణాదిన పెను విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తొయిబా, హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) పన్నిన కుట్రను విఫలం చేసినట్టు ప్రకటించారు. వీరంతా ఐఎస్‌ఐతో పాటు ప్రధానంగా సౌదీలోని ‘ఉగ్ర’ నేతల ఆదేశానుసారమే పని చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అరెస్టయిన వారిలో ఒక జర్నలిస్టు, ఇంకో విద్యాధికుడు, ఇద్దరు డాక్టర్లతో పాటు ఏకంగా ఒక డీఆర్‌డీఓ శాస్త్రవేత్త కూడా ఉండటం గమనార్హం! ఉగ్రవాదులు ఎన్ని వ్యవస్థల్లోకి, ఎంతగా చొచ్చుకుపోయారనేందుకు ఇదో నిదర్శనం మాత్రమే. ‘‘ఆరేళ్ల క్రితం హుబ్లీ నుంచి సౌదీకి ‘వలస వెళ్లిన’ జకీర్ మహ్మద్ అనే డాక్టర్ ఈ మొత్తం కుట్రకు సూత్రధారి. ఇంగ్లిష్ మాట్లాడగలిగి, కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకంలో నైపుణ్యముండి, జీన్స్ వంటి సాధారణ వస్త్రధారణతో జనంలో తేలిగ్గా కలిసిపోయే యువతను అతను లక్ష్యంగా చేసుకున్నాడు. 50 మందికి పైగా 2003 నుంచి 2008 మధ్య ఐదేళ్ల కాలంలో ఉగ్రవాద శిక్షణ కోసం పాకిస్థాన్‌కు పంపాడు’’ అని కూడా వారు వెల్లడించారు. వీరిలోనే పలువురు హైదరాబాద్‌ను లక్ష్యం చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ సమాచారం కూడా మన పోలీసు, నిఘా వర్గాలకు అప్పుడే చేరింది. అయినా పట్టించుకోలేదు!

నాలుగు రోజుల క్రితమే సీసీ కెమెరా వైర్లు కట్!

దిల్‌సుఖ్‌నగర్ జంక్షన్‌లోని ఎనిమిది సీసీ కెమెరాలు పని చేయడం లేదన్న విషయం కూడా జంట పేలుళ్లు జరిగేదాకా స్థానిక పోలీసులకు తెలియదు! వైర్లు కట్ కావడం వల్లే అవి పని చేయడం లేదని వారు తీరిగ్గా గుర్తించారు. అది బాంబు పేలుళ్ల తరువాతే కావడం గమనార్హం. అవి మూగబోవడం కూడా ముష్కరుల పనేనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే మెట్రో రైలు నిర్మాణ పనుల కారణంగా సీసీ కెమెరా వైర్లు కట్ అయి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ ఈ విషయంలో స్థానిక పోలీసుల తీరు సహించరానిదేనంటూ తమ తప్పిదాన్ని అంగీకరించారు!
Share this article :

0 comments: