అందుకే ఆయనకు అన్నీ బోగస్‌లా కనిపిస్తున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందుకే ఆయనకు అన్నీ బోగస్‌లా కనిపిస్తున్నాయి

అందుకే ఆయనకు అన్నీ బోగస్‌లా కనిపిస్తున్నాయి

Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013

‘జగన్ కోసం.. జనం సంతకం’ ఎలా జరిగిందోరాష్ట్రంలోని మీడియాలన్నీ చూశాయి
అయినా బాబు కంపెనీలు ప్రజల్ని కించపరుస్తున్నాయి
బాబూ టీడీపీ నిన్ను ఎంతకు కొన్నదో చెప్పు: గట్టు
మైనార్టీలో ఉందని చెప్పినా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టవెందుకు?

సాక్షి, హైదరాబాద్: తప్పుడు కాగితాలను, బోగస్ సంఖ్యలను సృష్టించడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఆయన కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య అని, అందుకే ఆయనకు అన్నీ బోగస్‌లా కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ‘జగన్ కోసం.. జనం సంతకం’లో పాలుపంచుకున్న దాదాపు రెండు కోట్ల మంది ప్రజలను చంద్రబాబు అవమానపరిచేలా మాట్లాడటం చాలా హేయమైన చర్య అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్ వేదికగా నిర్వహించిన ఎమ్మెల్యేల క్యాంపునకు సంబంధించి బోగస్ సంఖ్యలు సృష్టించింది చంద్రబాబు, ఆయన కంపెనీలేనని అన్నారు. 

అందుకే తన మనసులో ఉన్న దురాలోచనలను బట్టి ఈరోజు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన చేసిన దొంగ పనులను ఇతరులకు ఆపాదించడం సమంజసం కాదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమం 20 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంత ఉధృతంగా జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. అంతేకాదు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు చేసిన సంతకాలను ప్రస్తావించారు. కొందరు రక్తంతో కూడా సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవన్నీ రాష్ట్రంలోని అన్ని మీడియాలూ చూసినప్పటికీ చంద్రబాబు కంపెనీలు మాత్రం ప్రజల్ని కించపరుస్తున్నాయని దుయ్యబట్టారు. జగన్‌కు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రతిసారీ రుజువవుతున్నా చంద్రబాబు తన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ రోజురోజుకు మరింత పలుచనవుతున్నారని విమర్శించారు. 

చంద్రబాబుకు జగన్ అంటే వణుకు: గట్టు

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు వింటే వణుకు పుడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. తన బినామీ పత్రిక, చానల్‌లో ముందుగా ఒక తప్పుడు కథనం ప్రసారం చేసి వాటినే ఆయన ప్రస్తావిస్తున్నారని సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా చరిత్ర ఏంటో జర్నలిజం రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అబద్ధాలు, బూతులు వల్లెవేయడం ఆ సంస్థ నైజమన్నారు. అనునిత్యం బ్లాక్‌మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు.

అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు..

ప్రజాదరణ కలిగిన పార్టీలోకి నేతలు వెళ్లడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని గట్టు అన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేందుకు చంద్రబాబు ఎంతకు అమ్ముడు పోయారో బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. అమ్ముకోవడం, అమ్ముడుపోవడం చంద్రబాబు నైజమన్నారు. పార్లమెంటులో ఎఫ్‌డీఐల బిల్లు సందర్భంగా ముగ్గురు ఎంపీలను హోల్‌సేల్‌గా అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఆయన పాదయాత్రలో అనునిత్యం ప్రభుత్వంపై శాపనార్థాలు పెడతారు, కానీ అవిశ్వాసం పెట్టడానికి ముందుకు రావడంలేదన్నారు. అధికార పార్టీ అధ్యక్షుడే ప్రభుత్వం మైనార్టీలో ఉందని స్వయంగా ప్రకటిస్తే చంద్రబాబు మాత్రం చీకటి స్నేహానికి కట్టుబడి అవిశ్వాసం మాటే ప్రస్తావించడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే చంద్రబాబు అవిశ్వాసం గురించి మాట్లాడుతారన్నారు. గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాతే అవిశ్వాసం పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. 
Share this article :

0 comments: