అదే ఆదరణ.. అదే ఆప్యాయత.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అదే ఆదరణ.. అదే ఆప్యాయత..

అదే ఆదరణ.. అదే ఆప్యాయత..

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013

అదే ఆదరణ.. అదే ఆప్యాయత.. నాడు వైఎస్, జగన్‌లకు.. నేడు షర్మిలకు బ్రహ్మరథం
రెండు కళ్లు కాదుగదా, ఒళ్లంతా కళ్లు చేసుకున్నా చాలదు.... ఆ అపురూప ఘట్టాలను తిలకించడానికి, ఆ అద్భుత దృశ్యాలను వీక్షించడానికి....ఒకరా ఇద్దరా... వందలా వేలా.. లక్షల మంది. ఆర్తిగా తలనిమిరేవారు కొందరైతే... ఆప్యాయంగా కరచాలనం చేసేవారు మరికొందరు.. ప్రేమగా పలకరించేవారు.. అనురాగం పంచేవారు.. ఆర్ద్రత నిండిన కళ్లతో హత్తుకునే వృద్ధులు... నుదుటన చుంబించి .

ఆత్మబంధాన్ని గుర్తు చేసేవారు.. తమ ఇంటి ఆడపడుచు వచ్చినట్టుగా భావోద్వేగాలకు లోనవుతున్న పల్లెలు.. అడుగడుగునా హారతులిస్తున్న వాకిళ్లు.. గుమ్మడి పండ్లతో దిష్టితీస్తున్న మహిళలు... అపురూపంగా చూసుకుంటూ.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ.. అడుగులో అడుగేస్తున్నారు. రాజన్న బిడ్డ, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నీరాజనాలు పడుతోంది. ప్రేమానురాగాలను పంచుతోంది. గుండె ధైర్యం చెబుతోంది.. ఊరూవాడా కదిలివస్తోంది.... పిడికిళ్లు బిగిస్తూ ఎలుగెత్తి చాటుతోంది. మీ వెంటే మేమంటూ భరోసా ఇస్తోంది.. అన్న జగన్ నాయకత్వానికి జేజేలు పలుకుతోంది. నాడు వైఎస్, జగన్‌లపై చూపిన ఆదరణ నేడూ ప్రస్ఫుటమవుతోంది. జనప్రభంజనమవుతోంది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు; మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పోటెత్తినఈ ప్రభంజనానికి బస్టాండ్ సెంటర్ కిక్కిరిసిపోయింది. ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. రాజన్న బిడ్డ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను ఒక్కసారి చూడాలని, ఆమె ప్రసంగాన్ని ఆలకించాలని అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చారు. జోహార్ వైఎస్‌ఆర్, జై జగన్ అంటూ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినదించడంతో దిక్కులు పిక్కటిల్లాయి. 

మహానేత వైఎస్, జగన్ మోహన్‌రెడ్డిలను అదరించిన రీతిలోనే షర్మిలకు ప్రజలు స్వాగతం పలికి ఆ కుటుంబంపై వున్న అభిమానాన్ని చాటుకున్నారు. తమ ఇంటి ఆడపడుచు వచ్చినట్టుగా సంబరపడి ఆహ్వానం పలికారు.‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా షర్మిల మంగళవారం కారంపూడి మండలంలో పాదయాత్ర, రచ్చబండ కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలో ప్రసంగించారు.

‘‘నాన్న ఈ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల విలువైన పథకాలను అమలులోకి తీసుకువచ్చారు, మనసులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి అంటకాగుతున్న తెలుగుదేశం పార్టీ వల్ల ఆ పథకాలన్నీ నిలిచిపోయి మీరు బాధలు పడుతున్నార’’ని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని షర్మిల భరోసా ఇచ్చారు. మీ కష్టాలు తీరే రోజు సమీపంలోనే ఉందని, అప్పటి వరకు ఓపికతో ఉండాలని కోరారు.తొలుత పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగించారు.

ఆ తరువాత 40 నిమిషాల పాటు ప్రసంగించిన షర్మిల రైతు బాధలను ప్రస్తావిస్తూ జగనన్న రానున్నారని కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రలు, దివంగత వైఎస్‌పై టీడీపీ అధినేత బాబు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఆమె ప్రసంగానికి అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. స్ధానిక సమస్యలను ప్రస్తావించడంతో ఆయా వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.అంతేకాక మాచర్ల నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాల్లో మిర్చిని పండిస్తున్న రైతులకు దుర్గిలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు నాన్న ప్రయత్నం చేశారని,. సాగునీటి కొరత రాకుండా ఎత్తిపోతల పథకాలను తీసుకు వచ్చే యత్నం చేశారని గుర్తు చేశారు.

బాబు చీకటి ఒప్పందం..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై షర్మిల చేసిన ప్రసంగాలకు విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో పడగొట్టకుండా చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించినప్పుడు అవును... అవును అంటూ ప్రజలు బదులిచ్చారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా ఉన్నారని, మీ కోసం ఆయన పాదయాత్ర చేయడం లేదని, ఆయన కోసమే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

పీఆర్కేని గెలిపించినందుకు కృతజ్ఞతలు 
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండోసారి మాచర్ల ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న నిర్దోషి అని ఉప ఎన్నికలు రుజువు చేసే విధంగా తీర్పు ఇచ్చిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. తొమ్మిది నెలల క్రితం ఇదే సెంటర్‌లో జగనన్న బహిరంగ సభ నిర్వహించిన తరువాత సీబీఐ హైదరాబాద్ పిలిపించి అరెస్టు చేసిందని, అప్పుడు జగనన్నను ఆదరించిన విధంగా ఇప్పుడు కూడా సభకు ప్రజలు తరలి రావడంపై షర్మిల అభినందనలు తెలిపారు.

కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రోగామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గుంటూరు, కృష్ణాజిల్లాల కో-ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహరనాయుడు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ల రేవతి, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనరు అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ జానీ బాషా, ఎస్‌టీ సెల్ జిల్లా కన్వీనర్ హనుమంత నాయక్, జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నాయకులు యెనుముల మురళీధరరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మేరుగ నాగార్జున, చిట్టావిజయభాస్కరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లతీఫ్‌రెడ్డి, యేటిగడ్డ బుజ్జి, బొమ్మారెడ్డి సునీతారెడ్డి, చీడిపూడి జయలక్ష్మి. తాళ్లపల్లి పద్మజారెడ్డి, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆల్తాఫ్, ముస్తఫా, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులుపాల్గొన్నారు.

మహానేత రుణం తీరనిది
 షర్మిల బస చేసిన ప్రాంత నుంచి మంగళవారం జరిగిన పాదయాత్రను చక్రాలబండిపై ఓ విగలాంగుడు అనుసరించాడు. రెడ్డిపాలేనికి చెందిన మేకపోతు హనిమిరెడ్డి తన ఇద్దరు సహాయకులతో పాదయాత్రలో పాల్గొన్నాడు. అతనికి పోలియో కారణంగా రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఇంటర్ వరకు చదువుకున్న తాను రాజీవ్ యువశక్తి పథకం కింద రుణం తీసుకొని చిన్న ఎలక్ట్రికల్ దుకాణం పెట్టుకున్నట్లు తెలిపాడు. వికలాంగుల పింఛను కూడా మంజూరైందన్నారు. వైఎస్సార్‌పై అభిమానంతో షర్మిల పాదయాత్రలో తాను పాల్గొంటున్నానని హనిమిరెడ్డి తెలిపాడు.

ప్రత్యేక ఆకర్షణగా భారీ జెండాలు
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ జెండాలు షర్మిల పాదయాత్రలో ఆకట్టుకున్నాయి. వాటిని చేతబూని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిమానులు సందడి చేశారు.

తొలి అడుగు నుంచీ తోడుగా..
 విశ్రాంతి తీసుకునే వయసులో ఆ వృద్ధ దంపతులు మహానేత వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్నారు. మరో ప్రజాప్రస్థానం ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి షర్మిల వెంట అలుపెరగని పాదచారుల్లా నడుస్తున్నారు. వైఎస్సార్ జిల్లా దుండూరు మండలం గంగనపల్లెకి చెందిన 82 ఏళ్ల కల్లంకుంట్ల సాంబశివారెడ్డి, ఆయన భార్య గంగమ్మలు కారంపూడి మండలంలో జరుగుతున్న పాదయాత్రలో సైతం మండుటెండను లెక్కచేయకుండా పాల్గొన్నారు. 

ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం.. షర్మిల వెంటే
 మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వలన లబ్ధి పొందిన పలువురు ఆ అభిమానంతో షర్మిల పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె వెంటే నడుస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎం.గంగిరెడ్డి, మాదిగ మహాజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తిరాజు, అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి శంకర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.మంగమ్మతో పాటు మరో 20 మంది పాదయాత్రలో పాల్గొంటూ కారంపూడికి చేరుకున్నారు. షర్మిలతో ఇచ్ఛాపురం వరకు పాదయాత్రలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకుంటామని వారు తెలిపారు. 

పరుగు పరుగున వచ్చి..
తమ అభిమాన నాయకుడి కుమార్తె షర్మిల చినకొదమగుండ్ల గ్రామానికి వచ్చిందనే విషయం తెలుసుకుని చూసేందుకు మహిళలు పొలాల్లో ఉన్న రాళ్లు, ముళ్ల కంపలను లెక్క చేయక పరుగు పరుగున వచ్చారు. వారికి షర్మిల అభివాదం చేశారు.
Share this article :

0 comments: