రైతుల్ని మోసగించడమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల్ని మోసగించడమే

రైతుల్ని మోసగించడమే

Written By news on Wednesday, February 20, 2013 | 2/20/2013

* అధికారంలో ఉన్నప్పుడు కనీసం వడ్డీ మాఫీ కూడా చేయలేదేం!
* ఇప్పుడు రుణాలు మాఫీ చేస్తానంటే ప్రజలు నమ్మాలా?
* రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదుకాబట్టే విజయమ్మ ప్రధానికి లేఖ రాశారు
* వైఎస్ ఒకసారి వడ్డీ మాఫీ, మరోసారి రుణ మాఫీకి కృషి చేశారు

సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తానని, తొలి సంతకం సంబంధిత ఫైలుపైనే చేస్తానని టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు చెప్పడం రైతులను మోసగించడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. రైతు రుణాల మాఫీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేని పనిని చేస్తానని చెప్పి ఆయన రైతులను మభ్య పెడుతున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రుణాల మాఫీ కాదు కదా.. కనీసం వడ్డీని కూడా రద్దు చేయలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా రుణాలే మాఫీ చేస్తానని వాగ్దానం చేస్తే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్‌తో కలిసి సోమయాజులు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘దేశంలో ఇప్పటికి మూడుసార్లు రైతుల రుణాలు లేదా వడ్డీ మాఫీ చేశారు. 1989-90 మధ్యకాలంలో దేవీలాల్ ఉప ప్రధానిగా ఉన్న రోజుల్లో రైతు రుణాల మాఫీ జరిగింది. ఆ తరువాత 2004లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేను ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితిని ప్రధానికి వివరించి రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ నేపథ్యంలో ప్రధాని మన రాష్ట్రం సహా దేశంలోని మొత్తం 31 జిల్లాలకు ఒక ప్యాకేజీ ప్రకటిస్తూ అందులో రుణాలపై వడ్డీలను మాఫీ చేశారు. అంతేగాక తాజాగా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. పరిస్థితులు చక్కబడకపోవడంతో 2008లో రాజశేఖరరెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దాంతో దేశవ్యాప్తంగా రూ.74 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

చంద్రబాబు పాలనలో 2001 నుంచి 2003 వరకూ ఎన్నడూ లేనివిధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పట్లో దేశ ప్రధానులను తానే చేశానని ఆయన చెప్పుకున్నారు. మరి అప్పట్లో ఆయన రైతుల రుణాల మాఫీ కోసం ఎందుకు ప్రయత్నించలేదు?’ అని సోమయాజులు సూటిగా ప్రశ్నించారు. వైఎస్ మాదిరిగా చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానిని అడిగి ఎందుకు ఒప్పించలేకపోయారని నిలదీశారు. రైతుల మొత్తం రుణ బకాయిలు రూ.1,16,000 కోట్లు ఉన్నాయని, రాష్ట్ర బడ్జెట్టే లక్ష కోట్లు అయినప్పుడు ఆ రుణాలను ఎలా మాఫీ చేస్తారని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించిన తరువాత చంద్రబాబు మాట మార్చారని సోమయాజులు ఎద్దేవా చేశారు. 

టీడీపీని 42 లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మాఫీ చేయిస్తామని కొత్త పల్లవి అందుకున్నారని చెప్పారు. రుణాల మాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని తెలుసు కనుకనే.. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గత ఏడాది నవంబర్ 10వ తేదీన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖలో రుణాల మాఫీ చేయాలని కోరారన్నారు. రైతుల పరిస్థితి బాగుపడాలంటే రుణమాఫీ చే యాలని ఆమె తాజాగా లేఖ రాసినట్లు చెప్పారు. 

నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బాబు
30 ఏళ్ల రాజకీయ జీవితం గల చంద్రబాబు పూర్తి నిరాశా నిస్పృహలకు లోనై నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తుండటంతో ఓర్వలేక ఆమె భర్త అనిల్‌పై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారన్నారు. చర్చి భూమితో, హెలికాప్టర్ కుంభకోణంతో, రక్షణ స్టీల్స్‌తో సంబంధాలున్నాయని చెప్పడం తగదన్నారు. వీటితో అనిల్‌కు అసలు సంబంధం ఉందో లేదో తెలుసుకోవాలంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు వెళ్లి కనుక్కోవచ్చని సూచించారు. తనకు ఈ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని అనిల్ పదేపదే చెబుతున్నా చర్వితచరణంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారన్నారు. తాను వివరణ ఇచ్చిన తరువాత కూడా ఆరోపణలు చేస్తున్నందున వారిపై క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తానని అనిల్ చెప్పారని తెలిపారు. 

‘సహకారం’ ప్రజాస్వామ్యానికే తలవంపులు
రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగిన తీరు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయని సోమయాజులు వ్యాఖ్యానించారు. తన 30-40 ఏళ్ల అనుభవంలో ఇంత అవినీతి, అధికార దుర్వినియోగం, కుమ్మక్కు రాజకీయాలు చోటు చేసుకున్న ఎన్నికలే లేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు ఇలా జరక్కుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: