చంద్రబాబూ.. ఎందుకు మీ సంస్కారం దిగజారిపోతోంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబూ.. ఎందుకు మీ సంస్కారం దిగజారిపోతోంది?

చంద్రబాబూ.. ఎందుకు మీ సంస్కారం దిగజారిపోతోంది?

Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013

మన పాలకులకు ప్రజా సమస్యలు పట్టడం లేదు
ప్రజల్ని గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు
108, 104, ఆరోగ్యశ్రీ సహా పథకాలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు
వైఎస్ మరణించాక ఒక్క కొత్త ఇల్లు, కార్డు, పింఛను ఇచ్చారా?
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు
ప్రజల్ని పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టండి
చంద్రబాబూ అంటే.. ఆయన కుంటిసాకులు చెప్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 64, కిలోమీటర్లు: 927.3

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నేను దారి వెంట వస్తూ ఏ పల్లెను పలకరించినా కష్టాలు.. కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వర్షాలు రాక.. కరెంటు లేక.. పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతన్నలు అల్లాడిపోతున్నారు. మహానేత ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు అన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త ఇల్లుగానీ, ఒక్క రేషన్ కార్డుగానీ, ఒక్క కొత్త పింఛనుగానీ ఇచ్చిన పాపన పోలేదీ సర్కారు. విద్యార్థులైతే ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. మన పాలకులకు ఈ సమస్యలేవీ పట్టడం లేదు.. వాళ్లకు ఉన్న సమయమంతా పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 64వ రోజు మంగళవారం నల్లగొండ నియోజకవర్గంలో సాగింది. కనగల్ మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

మహిళలపై రూ.2-3 వడ్డీ భారం పడుతోంది

‘‘అక్కా చెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగాలని, వాళ్లు సాధికారత సాధిస్తేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని వైఎస్సార్ పావలా వడ్డీ పథకాన్ని తెచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పావలా వడ్డీ రుణాన్ని తుంగలో తొక్కింది. మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. నేను దారివెంట వస్తున్నప్పుడు ఎంతో మంది అక్కా చెల్లెమ్మలు నన్ను కలిశారు. ‘అమ్మా పావ లా వడ్డీ రుణాలు మీ నాయినతోనే పోయినయి.. ఈ సర్కారు రూ. 2.. రూ. 3 వడ్డీ వేస్తోందమ్మా’ అని చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్లు? విద్యార్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది. విద్యార్థులనుఈ ప్రభుత్వం చదివిస్తుందని భరోసా లేదు. ఫీజుల రీయింబర్స్‌మెంటు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం రోజుకో ఎత్తు వేస్తోంది. రెండు వంతుల ఫీజు తల్లిదండ్రులు చెల్లిస్తే.. ఒక వంతు ప్రభుత్వం ఇస్తుందంటూ విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతోంది.

108 ఎక్కడ?

వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాల లోపు కుయ్..కుయ్...కుయ్.. అనుకుంటూ 108 వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. భూతద్దం పెట్టుకొని వెతికితే ఎక్కడో ఒకటో.. రెండో వాహనాలు కనిపిస్తాయి. ఇక ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసినట్లుంది. ప్రతి పథకాన్నీ సర్కారు అటకెక్కించేస్తోంది. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఎరువుల రేట్లు ముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నల్లగొండ జిల్లా బత్తాయి పంటకు పెట్టింది పేరు. వర్షాలు పడక... కరెంటు రాక... పండించిన బత్తాయి పండ్లకు ఇక్కడ సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో బత్తాయి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కష్టపడి పెంచిన తోటలను తెగ నరుక్కుంటున్నారు. ఈపాపం సర్కారుది కాదా? అని అడుగుతున్నా.

ఆ మేలు చంద్రబాబుకే..

ప్రజలకు మేలు చేయని ఈ సర్కారు ఎవరికి మేలు చేస్తుంది అంటే.. కాంగ్రెస్ వాళ్లకు తప్ప ఎవరికీ మేలు చేయడం లేదు. వాళ్లకు కాకుండా ఇంకా ఎవరికైనా మేలు చేస్తుందా అంటే .. అది ఒక్క చంద్రబాబు నాయుడుకే! ఐఎంజీ భారత కుంభకోణం, ఎమ్మార్ కేసుల్లో చంద్రబాబు నాయుడే సూత్రధారి అయినా ఆయనపై దర్యాప్తు జరపరు. తనపై దర్యాప్తు ప్రారంభం కాకుండా చూసుకోవడానికి చంద్రబాబు.. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తున్నారు కదా.. అప్పుడైనా అవిశ్వాసం పెట్టాలనిపించడం లేదా చంద్రబాబూ అని అడిగితే.. ఆయన కుంటిసాకులు చెప్తున్నారు. అవసరం ఉంటేగానీ అవిశ్వాసం పెట్టనంటున్నారు. అది ప్రజల అవసరం కాదు.. ఆయనకు అవసరం ఉంటేనే అవిశ్వాసం పెడతారాయన! కాంగ్రెస్, టీడీపీలు మూడేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయి. వీళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఈ రాష్ర్టంలో కాంగ్రెస్, టీడీపీలే ఉండాలట.. మరో పార్టీ, మరో వ్యక్తి ఉండకూడదట. అందుకే జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తున్నాడనే భయంతో రెండు పార్టీలూ కుమ్మక్కై అబద్ధపు కేసులు పెట్టి జైలుకు పంపించాయి.’’

64వ రోజు 15.3 కిలోమీటర్లు..

మంగళవారం షర్మిల పాదయాత్ర నల్లగొండ జిల్లా ఉడుతలపల్లి గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కుర్రంపల్లి, గడ్డవారి యడవెల్లి, బుడమార్లపల్లి గ్రామాల మీదుగా కనగల్ క్రాస్ రోడ్డుకు చేరింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి కనగల్ మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.3 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 927.3 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేకే మహేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, తలశిల రఘురాం, దేప భాస్కర్, గట్టు శ్రీకాంత్, ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకులు బోయపల్లి అనంత్‌కుమార్, కుంభం శ్రీనివాసరెడ్డి, అల్గుబెల్లి రవీందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, మందడి రామచంద్రారెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

చంద్రబాబూ.. ఎందుకు మీ సంస్కారం దిగజారిపోతోంది?
‘‘నిన్ననే(సోమవారం) గుంటూరులో ‘సాక్షి’ కార్యాలయం మీద దాడి జరిగింది. ఈ దాడికి కారణం ఎవరో కాదు. చంద్రబాబు నాయుడే. రెచ్చగొట్టే మాటలతో ‘సాక్షి’పైకి ఉసిగొలిపారు. సాక్షి విషకన్యనట... సాక్షి అబద్ధాలు.. అభూత కల్పనలు రాస్తుందట.. తన మనుషులను రెచ్చగొట్టి దాడి చేయించారు. చంద్రబాబుగారూ.. అప్పట్లో రామోజీరావు గారి ‘మార్గదర్శి’ని ఒక మాట అన్నందుకు మీరు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని గొంతు చించుకున్నారు. మరి ‘సాక్షి’పై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదా? ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి కాదా? చంద్రబాబూ.. రోజురోజుకూ మీ సంస్కారం ఎందుకు దిగజారిపోతోంది? ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడం అవసరమా! మీరు చెప్పే అబద్ధాలను.. అబద్ధాలు అని చెప్పినందుకా ‘సాక్షి’పై దాడికి దిగారు?’’
- షర్మిల
Share this article :

0 comments: