టీడీపీ కంచుకోట బద్దలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ కంచుకోట బద్దలు!

టీడీపీ కంచుకోట బద్దలు!

Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకప్పడు తనకు కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేం పార్టీ అత్యంత దయనీయ స్థితికి దిగజారిపోయింది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితిలో పడిపోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం) వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచారు. ఆ వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీప్రకటించడంతో జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండాపోయారు. 1983 తరువాత జిల్లాలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన 1983 ఎన్నికల్లో ఉన్న 12 స్థానాల్లో 11 చోట్ల ఆ పార్టీ గెలిచింది. సోంపేట మినహా అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 1985లో పది స్థానాలు చేజిక్కించుకుంది. కాగా 1989లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీరామారావు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ జిల్లాలో మాత్రం ఆ పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. 1994 ఎన్నికల్లో జిల్లాలో 11(అందులో ఒకటి టీడీపీ అనుబంధ సభ్యుడు) స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 1999 ఎన్నికల్లో కూడా టీడీపీ 11 స్థానాలు గెలుచుకుంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో జిల్లాలో టీడీపీ తిరోగమనం ప్రారంభమైంది. 

ఆ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ప్రత్యర్థి పార్టీ కంటే తక్కువ సీట్లకు పరిమితమైంది. వైఎస్ జనాదారణతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు చోట్ల ఘనవిజయం సాధించగా.. టీడీపీ ఐదు సీట్లకే పరిమితమైంది. కాగా 2009 ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గి 10 స్థానాలు ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో వై.ఎస్. నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ ఒక్క ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోనే గెలిచింది. వైఎస్ మరణానంతరం జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజ్ పునరాలోచనలో పడ్డారు. ప్రజాభీష్టం మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలవాలని నిర్ణయించారు. ఆయన శుక్రవారం జగన్‌ను కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోనూ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి దృష్ట్యా జగన్ తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. దాంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. విధిలేని పరిస్థితుల్లో సాయిరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ఇక కోలుకోవడం దుర్లభమేనని టీడీపీ శ్రేణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి.
Share this article :

0 comments: