బాబును రక్షిస్తోంది కాంగ్రెస్ సర్కారే .బాబు ‘షుగర్’కు సర్కారు మందేదీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబును రక్షిస్తోంది కాంగ్రెస్ సర్కారే .బాబు ‘షుగర్’కు సర్కారు మందేదీ?

బాబును రక్షిస్తోంది కాంగ్రెస్ సర్కారే .బాబు ‘షుగర్’కు సర్కారు మందేదీ?

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

చర్యలు తీసుకోకపోవడంపై రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు

సభాసంఘం చెప్పిందిదీ...

నిజాం షుగర్స్‌ను బాబు కారుచౌకగా అమ్మి ఖజానాకు నష్టం కలిగించారు.. ఆయన సర్కారులోని ముగ్గురు మంత్రులు మోసానికి పాల్పడ్డారు
స్విస్ చాలెంజింగ్ పద్ధతే పెద్ద గోల్‌మాల్ 
ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్, కేబినెట్ కుమ్మక్కయ్యాయి
అడ్వొకేట్ జనరల్ సలహానూ పట్టించుకోలేదు
కేబినెట్ సబ్‌కమిటీ భేటీలో తప్పుడు లెక్కలు చెప్పిన బాబు
.............................
అయినా సభా సంఘాలు తప్పుపట్టలేదంటూ ఇప్పుడు చంద్రబాబు ఉపన్యాసాలు

బాబును రక్షిస్తోంది కాంగ్రెస్ సర్కారే 

 ‘‘నేనేదో అక్రమాలు చేశానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సభా సంఘాలు వేసింది... ఏ సభాసంఘమూ నన్ను తప్పుపట్టలేదు’’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఊరూరా ఉపన్యాసాలు దంచుతున్నారు.. ఆయన అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు యథాశక్తిగా సాయం చేస్తోంది. బాబు హయాంలో జోరుగా సాగిన అవినీతిపై సభా సంఘాలు ఇచ్చిన నివేదికల గుట్టుమట్లు విప్పేందుకు, చర్యలు తీసుకునేందుకు అది ఏ మాత్రం ఆసక్తిని కనబరచడంలేదు. హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెడుతున్నా దానిలో చలనం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఏర్పాటైన శాసనసభా సంఘం నివేదికపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు 2012 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో పిటిషనర్లు మళ్లీ హైకోర్టు గడపెక్కగా... ‘గడువు’ పేరుతో కేసు నాన్చివేతకు ప్రయత్నించిన సర్కారుకు చీవాట్లు కూడా పెట్టింది. మూడువారాల్లోగా సభాసంఘం నివేదికపై నిర్ణయం తీసుకోవాలని తాజాగా ఆదేశించింది. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సభాసంఘం వేసింది. దర్యాప్తు అనంతరం ఆ సభా సంఘ ఇచ్చిన నివేదిక పేర్కొన్న అంశాలను చూస్తే.. బాబును తప్పు బట్టిందో లేదో తేలిగ్గా అర్థమౌతుంది.

నిజాం షుగర్స్ యూనిట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసేందుకు అనుసరించిన ‘స్విస్ చాలెంజింగ్ పద్ధతే’ పెద్ద గోల్‌మాల్ వ్యవహారం. ఆస్తులను అమ్మటానికి ప్రైవేట్ వ్యక్తులతో చర్చలు జరపడమనేది ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వ్యవహారమని బాబు నిత్యం కొలిచే ప్రపంచ బ్యాంకు అధికారులే చెప్పారు. పెపైచ్చు ఈ పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి మంత్రివర్గం అనుమతి కూడా లేదు. ఈ పద్ధతి అనుసరించి ప్రభుత్వం మోసానికి పాల్పడింది. (నివేదికలోని 204 పేజీలో..)

నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల అమ్మకం విషయంలో అడ్వొకేట్ జనరల్, ప్రపంచ బ్యాంకు సలహాలను మంత్రివర్గ ఉపసంఘం పెడచెవిన పెట్టింది. (పేజీ 74లో)

మంత్రివర్గ సబ్‌కమిటీలోని యనమల (అప్పటి ఆర్థికమంత్రి), ఇ. పెద్దిరెడ్డి (చక్కెరశాఖ మంత్రి), కె. విద్యాధరరావు(పరిశ్రమలశాఖ మంత్రి) ముగ్గురూ ఈ మోసానికి ప్రధాన కారకులు. (పేజీ 204లో)

ప్రైవేట్ వ్యక్తులతో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్, మంత్రివర్గ ఉపసంఘం కుమ్మక్కవడం కారణంగా ప్రభుత్వానికి రూ.300 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. (పేజీ 204లో)

నిజాం షుగర్స్‌కి ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్‌లో నాటి సీఎం చంద్రబాబు అసెంబ్లీకి తప్పుడు సమాచారమిచ్చారు. నిజానికి అదేమీ సహాయం కాదు. వివిధ కార్పొరేషన్ల నుంచి నిజాం షుగర్స్ తీసుకున్న రుణాలవి. వాటిలో 2000 సెప్టెంబర్ నాటికి రూ. 127 కోట్లు తిరిగి చెల్లించేశారు. మిగిలిన రూ. 46 కోట్లు కూడా తర్వాత చెల్లించారు. (పేజీ 206, 207లో..)

2001 ఆగస్టు 1న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ కంపెనీకి రాష్ట్రప్రభుత్వ సాయం గురించి చంద్రబాబు తప్పుడు లెక్కలు వినిపించారు. (పేజీ 208లో..)

అమ్మకానికి పెట్టిన నిజాం షుగర్స్ ఆస్తుల్లో కొన్నింటికి అతి తక్కువ విలువ కట్టారు. కొన్నింటికి అసలు విలువే కట్టలేదు. అలా ప్రస్తావించని ఆస్తుల విలువ రూ. 40 కోట్లు. దీంతో కొనుగోలుదారులు ఈ నాలుగు యూనిట్లకు చాలా తక్కువ బిడ్లు దాఖలు చేశారు. (పేజీ 210లో..)

సీజన్ ప్రారంభంలోనే (2002 జనవరి 1న) ఫ్యాక్టరీలను అప్పగించేశారు. దాంతో కొనుగోలుదారుడు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఉద్యోగులపై ఖర్చు, వడ్డీ నామమాత్రమే. ఏ ఇతర షుగర్ ఫ్యాక్టరీతో పోల్చినా ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు లేదా మినహాయింపులు కూడా ధారాళంగా అందజేసింది. వీటిలో ఆస్తుల బదిలీపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు, కొనుగోలు, అమ్మకపు పన్నులో ఏడేళ్లపాటు రాయితీ, కొత్త డిస్టిలరీల స్థాపనకు లెసైన్స్ ఫీజు మినహాయింపు వంటివి అనేకం. (పేజీ 213లో..)

నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను బాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు, భారీ నష్టానికి అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తరువాత, ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 14న. సేల్‌డీడ్ 2004 ఫిబ్రవరి 25న, 2004 మే20న రిజస్టరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొద్దిరోజుల్లో రానుండగా చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ తంతు పూర్తి చేసింది. అదనపు భూమికి సంబంధించిన సేల్‌డీడ్స్ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక జరిగినప్పటికీ తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతో నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ(పీఈడీ) పన్వర్ ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వానికి తెలియకుండానే భూమి బదిలీ జరిగిపోయింది. (పేజీ 214లో..)

అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ రాసిన లేఖకు 2002 మే 3న జవాబు రాస్తూ నాటి ఆర్థిక మంత్రి యనమల ‘అదనపు ఆస్తులలోని 101 ఎకరాలకు డీపీఎం రూ. 10 కోట్లను చెల్లిస్తోంది’ అంటూ అబద్ధమాడారు. నిజానికి డీపీఎం చెల్లించింది రూ. 6. 16 కోట్లే. (పేజీ 215లో..)

అమ్మింది ఆపద్ధర్మ సీఎం హోదాలో...

నిజాం షుగర్స్‌కు చెందిన నాలుగు యూనిట్లను శాసనసభ రద్దయిన తర్వాత 2003 నవంబరు 14న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అస్మదీయులకు కట్టబెట్టేశారు. ఇందులో ఒకటైన పాలేరు షుగర్ ఫ్యాక్టరీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (టీడీపీ)కి ఇచ్చారు.

సభా సంఘం చెప్పిందిదీ...

దీనిపై ప్రతిపక్ష నేత హోదాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చాక సభా సంఘం వేశారు. 2004 ఆగష్టు నుంచి 2006 ఆగష్టు వరకు... రెండేళ్లు విచారణ జరిపిన సభాసంఘం ఈ అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 300 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. ఉపసంఘంలోని ముగ్గురు మంత్రులు మోసం చేశారని పేర్కొంది.

బాబు చెప్పుకుంటోంది...

నేనేదో అక్రమాలు చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సభాసంఘాలు వేసింది. ఏ సభాసంఘమూ నన్ను తప్పుపట్టలేదు. నాపై అనేక విచారణలు కూడా చేశారు. ఏమీ రుజువు చేయలేకపోయారు. నేనే తప్పూ చేయలేదు కాబట్టే వారేం చేయలేకపోయారు.

కోర్టు ఆగ్రహం

సభాసంఘం సిఫారసులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ 2012లో కొందరు హైకోర్టుకు వెళ్లారు. దాంతో నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్కారులో కదలిక లేదు. దాంతో పిటిషనర్లు మళ్లీ కోర్టు తలుపు తట్టారు. ఎందుకీ జాప్యమంటూ హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 13, 2013) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

కాపాడుతోంది ఎవరు?

అంటే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు. ఎందుకు? ఏ చీకటి ఒప్పందాలు, తెరచాటు పొత్తులు పనిచేస్తున్నాయి? విపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు తమ చేతిలో అస్త్రం (సభాసంఘం సిఫారసులు... చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం) సిద్ధంగా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? 
Share this article :

0 comments: