నాడు నిద్రపోయి.. నేడు డ్రామాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు నిద్రపోయి.. నేడు డ్రామాలా?

నాడు నిద్రపోయి.. నేడు డ్రామాలా?

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

కర్ణాటక.. ఆలమట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల ఎత్తు పెంచుతున్నప్పుడు ఏం చేశారు
రాష్ట్రానికి నీళ్లు రాకపోతే చరిత్రహీనుడిగా మిగులుతావని
వైఎస్ చెప్పినా కూడా వినిపించుకోలేదు.. పైగా వ్యవసాయం దండగన్నారు
మీ హయాంలో సాగర్ రైతులు వ్యవసాయాన్నే వదిలేశారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 69, కిలోమీటర్లు: 991.2

 ‘‘చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆలమట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాంల ఎత్తు పెంచుకుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే మన రాష్టానికి నీళ్లు రాక పంట పొలాలు బీడు భూములుగా మారతాయని, అదే జరిగితే నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు అని వైఎస్సార్ ఎంత చెప్పినా ఆనాడు చంద్రబాబు నాయుడు వినిపించుకోలేదు. వ్యవసాయం దండగ... ప్రాజెక్టులు నష్టం అన్నాడు. కృష్ణా నీళ్లు మన రాష్ట్రానికి రాకపోవడానికి కారణం చంద్రబాబు గారు. ఇప్పుడేమో కృష్ణా జలాల కోసం ధర్నా చేస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడు...’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. పొరుగు రాష్ట్రాలు మన రాష్ట్ర నీటి ప్రయోజనాలకు గండి కొడుతుంటే ఆనాడు అధికారంలో ఉంటూ నిద్రపోయారా అని చంద్రబాబును నిలదీశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. నియోజకవర్గ కేంద్రంలో భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఆ పాపం నీది కాదా..?: చంద్రబాబు ఆడుతున్న పాదయాత్ర నాటకంలో వైఎస్సార్‌ను ఒక మాట అన్నారు. కృష్ణా జలాలు మన రాష్ట్రానికి రాకపోవడానికి కారణం వైఎస్సార్ అట. చంద్రబాబు గారూ.. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా.. మీరు సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంల ఎత్తు పెంచి కట్టుకుంటుంటే నిద్రపోయారు. మీరు నిద్రపోతుంటే కర్ణాటక ప్రభుత్వం రెండు డ్యాంల నిర్మాణాలను పూర్తి చేసింది. అంతేకాదు మహారాష్ర్ట ప్రభుత్వం కూడా కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టుకుంది. అందుకే ఈరోజు మనకు కృష్ణా నీళ్లు తక్కువై పోయాయి. ఈ పాపం నీది కాదా? కింగ్ మేకర్‌ను అని, ఢిల్లీలో తానే చక్రం తిప్పుతున్నానని చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకుంటారు. మరి ఆలమట్టి నిర్మాణం ఎందుకు ఆపలేదు బాబూ.. అని అడుగుతున్నా.

మీ హయాంలో సాగర్ రైతులు సాగునే వదిలేశారు..

నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద 40 ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. దీని కింద 80 వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఆ ప్రాంత రైతులంతా కలిసి వెళ్లి తాము విద్యుత్తు మోటార్లు కొనుక్కునేందుకు సాయం చేయాలని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా..! మోటార్లు మీరే కొనుక్కోండి అన్నాడు. ఆ పెద్ద మోటార్లకు అయ్యే ఖర్చులు భరించ లేక, అప్పుడు ఉన్న కరెంటు చార్జీలు కట్టలేక రైతులు సాగు చేయడమే మానేశారు. అంతటి ఘనుడు చంద్రబాబు. వైఎస్సార్ సీఎం అయిన తరువాత వ్యవసాయానికి సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి పెద్ద మోటార్ల కోసం కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల విలువైన విద్యుత్ లైను వేశారు. అంతేకాదు మోటార్లు నడవడానికి 7 గంటలు సరిపోదని 16 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన నేత వైఎస్సార్. అదీ వైఎస్సార్ పెద్ద మనసు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిద్ర లేచి సాగర్ జలాల కోసం ధర్నా చేస్తా అంటున్నాడు.

మోసగాళ్లు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు: వైఎస్సార్‌ను చంద్రబాబు ఇంకో మాట కూడా అన్నారు. రాజశేఖరరెడ్డి గారు రైతులను చాలా మోసం చేశారట! వైఎస్ రైతులను ఎలా మోసం చేశారని చంద్రబాబును అడుగుతున్నా. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చి మోసం చేశాడా? రుణాలు మాఫీ చేసి మోసం చేశాడా? రైతు పక్షాన నిలబడి వారికి మద్దతు ధర కల్పించి మోసం చేశాడా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు, రైతులకు పావలా వడ్డీకే రుణాలిచ్చి మోసం చేశాడా? పేదలందరికీ పక్కా ఇల్లు కట్టించి మోసం చేశాడా? చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. ఆయన హయాంలో హింస తట్టుకోలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు గారూ.. మోసం చేయడంలో తమరిని మించిన వాళ్లు లేరు. సొంత మామను వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్‌ను మోసం చేసి కుర్చీ లాక్కుంది మీరు కాదా? మోసగాళ్లు ఎవరో.. మంచి వాళ్లు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు.

సహకార రంగాన్ని ముక్కలు చేశావు: సహకార పరిశ్రమలను చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరులకు పప్పు బెల్లాల మాదిరి అమ్మేసుకున్నారు. నిజాం షుగర్స్ ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే కాదు దేశంలోనే పేరున్న పరిశ్రమ. దానికి అప్పటి నిజాం ప్రభుత్వం 16 వేల ఎకరాల భూమి ఇచ్చిందట. తెలంగాణ రైతన్నలకు, కార్మికులకు అన్నం పెట్టిన ఆ పరిశ్రమను చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే ముక్కలు ముక్కలుగా చేసి తనకు అయినవారికి ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచిన పాలేరు చక్కెర పరిశ్రమను ఆయన పార్టీకే చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు కారు చౌకగా కట్టబెట్టారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన పరిశ్రమను వాటాదారులైన రైతులకు కూడా తెలియనివ్వకుండా కేవలం రూ.9.50 కోట్లకే అప్పగించారు. ఈ పరిశ్రమ అమ్మే నాటికి 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలు ఉన్నాయి. దీని విలువే సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. అలాగే రూ.35 కోట్ల విలువ చేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును వారి పార్టీకి చెందిన సీఎం రమేష్‌కు కేవలం రూ.12 కోట్లకు కట్టబెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు ధారాదత్తం చేశారు. మిర్యాలగూడలోని అవంతిపురంలో ఉన్న నిజాం షుగర్స్‌ను బాబు మనసు లేకుండా మూసేశారు.

సర్కారు మేలు చంద్రబాబుకే: ఈ సర్కారు కాంగ్రెస్ వాళ్లకు తప్ప ఇంకా ఎవరికీ మేలు చేయడం లేదు. వాళ్లకు కాకుండా ఇంకా ఎవరికైనా మేలు చేస్తుందా అంటే.. అది ఒక్క చంద్రబాబు నాయుడుకే! మొన్న జరిగిన ఎఫ్‌ఐడీ బిల్లులో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, సహకార ఎన్నికల్లో ఇద్దరు కలిసే పోటీ చేస్తారు. వీళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటై సీబీఐని వాడుకొని జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి జైలుకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం తనకు ఎదురు తిరిగిన వారిపై సీబీఐని ఆయుధంగా వాడుతోంది. సీబీఐ కీలుబొమ్మ కాబట్టే చిరంజీవి గారి బంధువుల ఇంట్లో రూ.70 కోట్లు దొరికినా పట్టించుకోరు. బొత్స సత్యనారాయణను మించిన మాఫియా డాన్ మరొకరు లేరని సొంత పార్టీ వాళ్లే ఆరోపించినా విచారణ జరపరు.

ఆయనకు అవసరమైనప్పుడే అవిశ్వాసం: చంద్రబాబుకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నాడు. ఇప్పుడు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని కొత్త నాటకం ఆడుతున్నాడు. ప్రజలకు కాదు.. ఆయనకు అవసరం వచ్చినప్పుడు అవిశ్వాసం పెడతారట. తమ ఎమ్మెల్యేల బలం సరిచూసుకొని, చంద్రబాబూ.. ఇక ఇప్పుడు అవిశ్వాసం నాటకమాడు అని ప్రభుత్వం పచ్చజెండా ఊపితే అప్పుడు అవిశ్వాసం పెడతారు.

ఆదివారం 69వరోజు పాదయాత్ర మిర్యాలగూడ రూరల్ మండలం శ్రీనివాసనగర్ నుంచి ప్రారంభమైంది. వెంకటాద్రిపురం మీదుగా మిర్యాలగూడలోకి ప్రవేశించింది. ఎఫ్‌సీఐ కాలనీ, బైపాస్ రింగ్‌రోడ్డు, హనుమాన్‌పేట, బస్టాండు మార్కెట్ మీదుగా రాజీవ్ చౌక్‌కు చేరింది. అబద్ధపు కేసులతో జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో జనం నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిలతో పాదయాత్రలో పాల్గొన్నారు. రాజీవ్‌చౌక్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం మీదుగా ఎదులగూడెంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 12.6 కి.మీ ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 991.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పార్టీ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, జిల్లా మహిళా కన్వీనర్ సూరపల్లి సత్యకుమారి, స్థానిక నాయకులు శ్రీకళారెడ్డి, స్పురధర్‌రెడ్డి, మహేష్ ఆదిభట్ల, కుంభం శ్రీనివాసరెడ్డి, అల్కా శ్రావణ్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: