కాంగ్రెస్ - టీడీపీ చెట్టాపట్టాల్.. పరస్పరం మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ - టీడీపీ చెట్టాపట్టాల్.. పరస్పరం మద్దతు

కాంగ్రెస్ - టీడీపీ చెట్టాపట్టాల్.. పరస్పరం మద్దతు

Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013

చిత్తూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 
నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ వ్యూహం
గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఉద్దేశపూర్వకంగా అధికారుల జాప్యం
సమయం ముగిసిందంటూ నామినేషన్లు తిరస్కరించిన ఎన్నికల అధికారి 
అధికారి తీరుపై నిరసనకు దిగిన మద్దతుదారులు, వైఎస్సార్ సీపీ నేతల అరెస్ట్ 
కృష్ణాలో టీడీపీకి షాక్... డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ 
వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ - టీడీపీ చెట్టాపట్టాల్.. పరస్పరం మద్దతు
జిల్లాల్లో డీసీసీబీ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు 


సాక్షి నెట్‌వర్క్: చిత్తూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పరంపర జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికలకు నామినేషన్ల సమయంలోనూ కొనసాగింది. పీలేరు, కాయంపేట సహకార సంఘాలకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ విషయంలోనూ ఇదే దౌర్జన్యం కొనసాగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని.. టీడీపీ సహకారంతో డీసీసీ బ్యాంకు చైర్మన్ పదవిని ఏకగ్రీవం చేసుకుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలతోపాటు, 20 మంది సింగిల్ విండో అధ్యక్షులను అరెస్టు చేయించింది. నామినేషన్ల తీరును పరిశీలించేందుకు ప్రయత్నించిన విలేకరులను అధికారులు లోనికి అనుమతించలేదు. 

క్యూలోనే వాగ్వాదం... 

డీసీసీబీ, సీడీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్ పాలక వర్గాల ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన జరిగింది. డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి ఉదయం సీడీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్‌ల వద్ద పరిశీలన చేసి నేరుగా డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సీడీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయాల వద్ద నామినేషన్ల ప్రక్రియ ఒకింత ప్రశాంతంగానే సాగినప్పటికీ.. డీసీసీబీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 12 గంటల దాకా రాహుకాలం ఉండటంతో అభ్యర్థులు క్యూలో నిల్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వైస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. డీసీసీబీలోకి మీడియాను అనుమతించేందుకు అధికారులు సమ్మతించలేదు. పోలీసులు ప్రధాన గేటు వద్దే మీడియాను అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేయటంతో ఫొటో జర్నలిస్టులను మాత్రం అనుమతించారు. 

సమయం ముగిసిందంటూ తిరస్కరణ: క్యూలో ముందు వరుసలో నిల్చున్న కాంగ్రెస్, టీడీపీ మద్దతుదారుల నామినేషన్ల దాఖలులో ఉద్దేశపూర్వకంగానే తీవ్ర జాప్యం చేశారు. దీంతో వారు మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు క్యూలో ఉన్న అభ్యర్థులందరి నామినేషన్లు స్వీకరించాల్సిన ఎన్నికల అధికారి సమయం ముగిసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల నామినేషన్లను స్వీకరించలేదు. కాంగ్రెస్ అనుకూలురు 9 మంది, టీడీపీ అనుకూలురు నలుగురు నామినేషన్లను స్వీకరించిన అధికారులు.. పరిశీలనలో రెండు పార్టీల మద్దతుదారుల్లో ఒక్కో అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌కు 8, టీడీపీకి 3 డెరైక్టర్ పదవులు దక్కాయి. రెండోసారి డీసీసీబీ అధ్యక్షుడిగా అమాస పదవి చేపట్టడం ఖాయమైపోయింది.

వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ - టీడీపీ చెట్టపట్టాల్ 

వైఎస్సార్ జిల్లా సహకార ఎన్నికల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ డెరైక్టర్ల స్థానాలకు నామినేషన్ల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం సహకారం అందించుకున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారుడు పల్లేటి మోహన్‌రెడ్డిని టీడీపీ మద్దతుదారుడు జగదీశ్‌కుమార్‌రెడ్డి బలపరచటం గమనార్హం. డీసీఎంఎస్ డెరైక్టర్ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ మద్దతుదారుడు జగదీశ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కమలమ్మలతో పాటు ముఖ్య నేతలు అంతా హాజరయ్యారు. డీసీసీబీకి ‘ఎ’ గ్రూప్‌లో 16 డెరైక్టర్ స్థానాలకు గాను కేవలం 10 డెరైక్టర్ స్థానాలకే నామినేషన్లు స్వీకరించారు. 

మిగతా 6 డెరైక్టర్ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు లేకపోవటంతో నామినేషన్లను స్వీకరించలేదు. ఈ పది డెరైక్టర్ స్థానాలకు సంబంధించి 11 నామినేషన్లు దాఖ లయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు ఆరు, కాంగ్రెస్ మద్దతుదారులు 4, టీడీపీ మద్దతుదారులు 1 చొప్పున నామినేషన్లు వేశారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఎమ్మెల్యే వీరశివారెడ్డి కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డిలు డీసీసీబీ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. బి క్లాస్ సంఘాలకు సంబంధించి ఐదు డెరైక్టర్ స్థానాలు ఉండగా, ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో కేవలం నాలుగు స్థానాలకే నామినేషన్లను స్వీకరించారు. రెండు బీసీ డెరైక్టర్ స్థానాలకు 14 మంది, ఓసీ స్థానానికి నలుగురు, ఎస్సీ స్థానానికి ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు. 

జోరుగా నామినేషన్ల దాఖలు... 

శ్రీకాకుళం డీసీసీబీలో ఎ కేటగిరిలో 12 డెరైక్టర్ పదవులు ఏకగ్రీవం కాగా.. బి కేటగిరిలో ఐదు డెరైక్టర్ పోస్టులకు గాను ఎస్సీ, ఎస్టీ, ఓసీ స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. రెండు బీసీ స్థానాలకు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ జిల్లాల్లో డీసీసీబీలకు శుక్రవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో వరంగల్ 33, ఖమ్మం 43, కరీంనగర్ 43, మెదక్ 24, రంగారెడ్డి 25, మహబూబ్‌నగర్ 25, నల్లగొండ 40, నిజామాబాద్ 43, ఆదిలాబాద్ 21, విశాఖ 15, పశ్చిమగోదావరి 62, తూర్పుగోదావరి 65, కర్నూలు 27 నామినేషన్లు దాఖలయ్యాయి.

నెల్లూరులో 15 స్థానాలకు సింగిల్ నామినేషన్లు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సహకార సంఘం లో 21 డెరైక్టర్ స్థానాలు ఉండగా 15 స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లా మార్కెటింగ్ సహకార సంఘానికి 10 స్థానాలు ఉండ గా ఆరింటికి సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. 

వైఎస్సార్ సీపీ నేతల అరెస్ట్

చిత్తూరు డీసీసీబీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ సవ్యంగా సాగటం లేదన్న సమాచారంతో వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నామినేషన్ల తీరుపై ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ఆయన్ను పోలీసులు ప్రధాన గేటు వద్దే నిలిపేశారు. ఆయనతోపాటు 20 మంది వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన సింగిల్ విండో అధ్యక్షులు సహా పార్టీ నేతలను అరెస్ట్ చేసి గుడిపాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డి అరెస్ట్ అరుున మరుక్షణమే నామినేషన్లు వేసేందుకు వెళ్లిన ఓ సింగిల్ విండో అధ్యక్షుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే యత్నం చేశారు. అతన్ని జీపులోకి ఎక్కించటంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన అభ్యర్థులు పోలీసులపై మండిపడ్డారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ఎన్నికల అధికారి వనజ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని.. కలెక్టర్ వచ్చి ఎన్నికల తీరును పరిశీలించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈడ్పుగంటి నామినేషన్ తిరస్కరణ 

సహకార ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. కేడీసీసీబీ చైర్మన్ పదవికి తమ అభ్యర్థిగా టీడీపీ ముందే ప్రకటించిన ఈడ్పుగంటి వెంకట్రామయ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. ముదినేపల్లిలో రామచంద్ర ఫైనాన్సర్ పేరుతో లెసైన్స్‌డ్ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఆయన.. 1964 సహకార చట్టంలోని 21-ఎ నిబంధన ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హుడని ఎన్నికల అధికారిణి చిత్రపు శైలజ ప్రకటించారు. వెంకట్రామయ్య నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని ముందునుంచే ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ నాయకులంతా బ్యాంకులో మకాం వేసి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ, కార్యదర్శి బచ్చుల అర్జునుడు సంప్రదింపుల్లో మునిగిపోయారు. రాత్రి 8 గంటల వరకు ఈడ్పుగంటి నామినేషన్ పరిశీలన ప్రక్రియ సాగింది. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు న్యాయవాదితో సహా లోపలకు వెళ్లి చర్చలు జరిపారు. అయినా ఈడ్పుగంటి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. తమను లోపలకు ఎందుకు అనుమతించరంటూ కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావు వాగ్వాదానికి దిగారు. టీడీపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ బ్యాంకు ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈడ్పుగంటి నామినేషన్ తిరస్కరణకు గురవటంతో ఖంగుతిన్న టీడీపీ నేతలు యెర్నేని లక్ష్మణప్రసాద్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. కేడీసీసీబీకి 43 నామినేషన్లు దాఖలు కాగా ఒకటి తిరస్కరించారు. 
Share this article :

0 comments: