పాదయాత్ర అంటే.. పందెం కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్ర అంటే.. పందెం కాదు

పాదయాత్ర అంటే.. పందెం కాదు

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

పాదయాత్ర చేసే వ్యక్తికి విశ్వసనీయత, చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి
వైఎస్సార్ తన పాదయాత్రను ఒక యజ్ఞంలా చేశారు
ఎన్నికల ముందు తనను జ్ఞాపకం ఉంచుకోవాలంటూ బాబు యాత్ర చేస్తున్నారు
బాబుకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదు?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 66, కిలోమీటర్లు: 957.6

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:‘‘పాదయాత్ర అంటే నడక పందెం కాదు.. అదో మహాయజ్ఞం. పాదయాత్ర చేస్తున్న వ్యక్తికి చిత్తశుద్ధి, నిజాయితీ, విశ్వసనీయత ఉండాలి. ఎంతదూరం నడిచామన్నది ముఖ్యంకాదు.. పాదయాత్ర ద్వారా ఎంత మందికి నమ్మకం కల్పించాం.. ఎన్ని ప్రజా సమస్యలను చూసి అర్థం చేసుకోగలిగాం.. ఎంత మందికి భవిష్యత్తుపై భరోసా కల్పించామన్నదే ముఖ్యం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారట.. కేకులు కట్‌చేసుకొని సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు ఆయన జపం చేసే మీడియా అంతా చంద్రబాబు రికార్డు సృష్టించారని చాలా ప్రచారం కల్పించింది. పాదయాత్ర అంటే ఒక నడక పందెం కాదని వారి బ్యాచ్‌కు అర్థం కావడం లేదు. మహానేత వైఎస్సార్ పాదయాత్ర చేసినప్పుడు ఓ యజ్ఞంలా చేశారు. ఇప్పుడు బాబు పాదయాత్రలో ఒక మాట అంటున్నారు. ఎన్నికల ముందు తనను జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రజలను అడుగుతున్నారట. ఆ ఒక్క మాటతోనే అర్థమవుతోంది. ఈ పాదయాత్ర తను ఎవరి కోసం చేస్తున్నారో’’ అని విమర్శించారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 66వ రోజు గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా హాలియా మండల కేంద్రంలో షర్మిలను చూడ్డానికి వేలాది మంది తరలివచ్చారు. జగన్‌ను అక్రమ కేసులతో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ప్రజలు నల్ల బ్యాడ్జీలు కట్టుకున్నారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

అమ్మకు అన్నం పెట్టడుగానీ: ‘‘పాదయాత్రలో ప్రజలు మాకు చెప్పినట్టుగానే చంద్రబాబుకు కూడా తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.

నిజంగా ఆయనకు ప్రజల పట్ల ప్రేమే ఉంటే ఆయనలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దించాలి. కానీ ఆయన ఆ పని మాత్రం చేయరు. ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. పాదయాత్రలో చంద్రబాబు చాలా వాగ్దానాలు చేస్తున్నారు. రుణమాఫీ చేస్తారట... 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తారట.. ఇంకా చాలా చెప్తున్నారు. ఒక సామెత ఉంది.. అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నాడట. తను అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఏమీ చేయబుద్ధికాదు. రుణమాఫీ చేసే ఆలోచన మీకు ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు చంద్రబాబూ? వైఎస్సార్ ఉచితంగా విద్యుత్తు ఇస్తానని చెప్తే హేళన చేసి మాట్లాడారు. కరెంటు తీగలు చూపిస్తూ అవి బట్టలు ఆరేసుకోవడానికి పనికి వస్తాయని ఎగతాళిగా మాట్లాడారు.

బాబుకు చాలా రికార్డులున్నాయి: మన రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయాన్నే నమ్ముకొని ఉన్నారని తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు తెలుసు. అయినప్పటికీ.. వ్యవసాయమే దండగ అని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని అన్న రికార్డు చంద్రబాబుకే సొంతం. కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టి రైతులను నానా హింసలు పెట్టి 4 వేల మంది రైతులను పొట్టనబెట్టుకున్న రికార్డు కూడా ఆయనదే. ఒక ముఖ్యమంత్రిగానే కాదు.. పాలక పక్షంతో కలిసి కుమ్మక్కయిన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనకు రికార్డు ఉంది.

అదీ బాబు సంస్కారం: చంద్రబాబు ఒక్క ‘సాక్షి’ మీదనే కాదు.. నాన్న మీద, జగనన్న మీద చిరాకు పడి చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉచ్చనీచాల గురించి ఆలోచన లేదు. సంస్కారం అనేదాని గురించి తెలియదు. చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రజలే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. జాగ్రత్త చంద్రబాబూ.. ఆకాశం దిక్కు చూసి ఉమ్మెస్తే అది నీ మొఖం మీదే పడుతుంది.

ఆధునీకరణ పూర్తి చేయరేం?: నాగార్జున సాగర్ ప్రాజెక్టు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2005లో వైఎస్సార్ ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు కింద కాల్వలు ఆధునీకరించడం కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో 60 శాతం పనులు పూర్తి చేశారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత వచ్చిన ఈ కాంగ్రెస్ సర్కారు మిగిలిన 40 శాతం పనులు ఇంత వరకు పూర్తి చేయలేదు. ఈ పనుల్నే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని గాలికొదిలేసింది. రైతులు అల్లాడిపోతున్నారు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రైతు మద్దతు ధరనేమో దించారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. స్థానిక మంత్రి జానారెడ్డికి 35 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. సీఎం రేసులో కూడా ఉన్నారు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు.. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధిని చూస్తేనే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏంటో అర్థమవుతోంది. ఇంత వరకు ఒక్క డ్రిగీ కాలేజ్ లేదు.. ఐటీఐ లేదు.. పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. మహళలకు తాగునీరు కూడా దిక్కులేదు.’’

గురువారం 66వ రోజు పాదయాత్ర రామడుగు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తిమ్మాపురం క్రాస్ రోడ్డు, అనుముల గ్రామాల మీదుగా హాలియా మండల కేంద్రానికి చేరింది. ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అలీనగర్ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. షర్మిల గురువారం మొత్తం 14.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 957.6 కి.మీ. యాత్ర పూర్తయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్, కాపు భారతి, స్థానిక నాయకులు గాదె నిరంజన్‌రెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, కుంభం శ్రీనివాసరెడ్డి, విరిగినేని అంజయ్య తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

బాబుపై రౌడీషీట్ ఎందుకు తెరవరు?

‘‘గుంటూరు జిల్లాలో చంద్రబాబు సమక్షంలోనే, ఆయన ప్రోత్సాహంతోనే ‘సాక్షి’ కార్యాలయం మీద దాడి జరిగింది. చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధానికీ.. ‘సాక్షి’ నిజంతో సమాధానమిస్తోంది. ఆ దుగ్ధతోనే చంద్రబాబు ‘సాక్షి’ మీద విరుచుకుపడి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి దాడి చేయించారు. నేను ఈ సర్కారును ఒక ప్రశ్న అడుగుతున్నా.. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తమ్ముడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఈ రోజు ఆయన్ను జైల్లో పెట్టి మరీ విచారణ చేస్తున్నారు. మరి చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి దాడి చేయించినా ఆయనపై రౌడీషీట్ తెరిచి ఎందుకు విచారణ చేయడం లేదని అడుగుతున్నా?’’
- షర్మిల
Share this article :

0 comments: