షర్మిల కాలి గాయంపై ‘గాలి’ విమర్శలను తప్పుబడుతున్న టీడీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల కాలి గాయంపై ‘గాలి’ విమర్శలను తప్పుబడుతున్న టీడీపీ నేతలు

షర్మిల కాలి గాయంపై ‘గాలి’ విమర్శలను తప్పుబడుతున్న టీడీపీ నేతలు

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

దిగజారుడు ఆరోపణలతో మరింత చులకనవుతామని వ్యాఖ్యలు
బాబు పాదయాత్రపై పండుగలు.. 
ఇతరులపై విమర్శలా అంటూ అంతర్మథనం

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర, కాలి గాయం, శస్త్రచికిత్సలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆ పార్టీలోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా ఒక మహిళపై ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగితే ప్రజల్లో పార్టీ మరింత చులకనవుతుందన్న భావన నేతల్లో వ్యక్తమవుతోంది. 2012 అక్టోబర్ 18న భారీ జనాదరణ నడుమ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రారంభించడం, కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకుని, బుధవారం నుంచి పాదయాత్రను పునఃప్రారంభించడం తెలిసిందే. కాగా అసలు ఆమె కాలికి గాయమే కాలేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పస లేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. 

పైగా ఒక మహిళ విషయంలో ఇలా దిగజారి మాట్లాడటం వల్ల పార్టీ పరువు మరింతగా దిగజారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితునిగా టీడీపీ కార్యాలయంలో వ్యవహారాలు చూసే ఒక నేత కూడా మీడియాతో ఆఫ్ ది రికార్డుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ పైలాన్ ఆవిష్కరించి పండుగ చేసుకున్న టీడీపీ నేతలు మరొకరి పాదయాత్రపై దిగజారి విమర్శలు చేయడం ఉచితం అనిపించుకోదంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘‘గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఒకరు ఇలాంటి విమర్శలే చేయడంతో అభాసుపాలయ్యాం. పాదయాత్ర కోసం షర్మిల జర్మనీలో ప్రత్యేకంగా తయారు చేయించిన బూట్లు వాడుతున్నారని, ఆమె ఒకడుగు వేస్తే ఆ బూట్లు వాటంతటవే పదడుగులు ముందుకు నడిపిస్తాయని విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు దిగాం. ఈ రకంగా దిగజారి మాట్లాడితే పోయేది పార్టీ పరువే కదా?’’ అని వ్యాఖ్యానించారు.

బాబుది ‘సౌకర్యాల’ యాత్ర కాదా?

షర్మిల కుడికాలికి శస్త్రచికిత్స చేశామని, ఆమెకు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడం తెలిసిందే. దానిపై కూడా తమ పార్టీ అనవసర రగడ చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యాలయ నేత ఒకరన్నారు. ‘షర్మిల జైల్లో జగన్‌ను పరామర్శించి వస్తున్నప్పుడు ఆమె ఎడమ చేతిలో కర్ర ఉందంటూ ఫొటో చూపించి, ఆమెకు అసలు ఆపరేషనే జరగలేదని ఎవరో చెబితే, దాన్ని పట్టుకుని ఏకంగా టీడీపీ శాసనసభా కార్యాలయంలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు దిగడం పూర్తిగా అనుచితం. అనారోగ్యం కారణంగా బాబు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించడం లేదా? 100 రోజులు పూర్తయిన సందర్భంగా పైలాన్ నిర్మించి పండుగ చేసుకోలేదా? కొద్ది రోజులకే, 117 రోజులైందంటూ మరో పైలాన్ ఏర్పాటు చేయలేదా? ప్రతి 1,000 కిలోమీటర్లకు పెద్ద పండుగ చేసుకుంటున్న మేము, ఇతరులపై విమర్శలు చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుండేది’ అని ఆయన వ్యాఖ్యానించారు. లోకేశ్‌కు సన్నిహితుడైన నేత కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. 

‘‘డాక్టర్లు రోడ్డు మీద నడువొద్దన్నారంటూ బాబు మట్టి రోడ్డుపై నడవడం లేదా? అందుకోసం ఆ రోడ్లపై లక్షలాది లీటర్ల నీరు చల్లించడం లేదా? ప్రజల కోసం పాదయాత్ర చేసేవాళ్లు అలా ముందే రోడ్లను బాగు చేసుకుని మరీ నడుస్తారా? షర్మిల అలా చేయడం లేదే? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకంగా 40 డిగ్రీల మండుటెండల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారే! మనం అలా ఏమైనా కష్టపడుతున్నామా? అంతెందుకు? నిన్న చూశారు కదా... ఎండాకాలం రాకముందే ఎండ తగలకుండా బాబు సోలార్ ఫ్యాన్ బిగించుకుని నడుస్తున్నారు. ఇక మా నాయకుడు ప్రతి రోజూ బస చేసే భారీ బస్సులో ఏసీతో పాటు ఎన్నెన్నో సౌకర్యాలున్నాయో మీకు తెలుసా? ఇలాంటప్పుడు ఒక మహిళపై కేవలం రాజకీయం కోసం ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా చులకనవడం తప్ప ఒరిగేదేమీ లేదు’’ అంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

స్పందనకు భయపడే...!

షర్మిల పాదయాత్రకు భయపడే.. ఆమెపై ఎప్పటికప్పుడు ఆరోపణలు, విమర్శలకు దిగాలంటూ బాబు ఆదేశించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పాదయాత్ర పొడవునా వైఎస్‌ను, ఆయన కుమారుడు జగన్‌ను విమర్శించే బాధ్యతను ఆయన తీసుకుని, షర్మిలను తిట్టే పనిని పార్టీ నేతలకు అప్పగించారని ఒక నాయకుడు తెలిపారు. టీడీఎల్పీ ఉప నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం మీడియా సమావేశంలో షర్మిల పాదయాత్రపై చేసిన విమర్శలు అందులో భాగమేనని సమాచారం. ప్రెస్‌మీట్ జరుగుతుండగా దాన్ని కవర్ చేస్తున్న ఒక వార్తా చానల్ కెమెరామన్ ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. ఆయనను టీడీఎల్పీ హాల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేస్తుండగానే టీడీపీ నేత ఒకరు ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్టు చేసిన ఫొటోను తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని, ‘షర్మిల కుడి కాలికి గాయమైతే ఎడమ చేతికి కర్ర ఊతం చేసుకుని నడుస్తున్నారు. ఇదంతా ఓ నాటకం’ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఫొటోను మీడియాకు ప్రదర్శించారు.
Share this article :

0 comments: