నాన్నకు ప్రాణం పోయడమే తెలుసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాన్నకు ప్రాణం పోయడమే తెలుసు

నాన్నకు ప్రాణం పోయడమే తెలుసు

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013

చంద్రబాబు ప్రోద్బలంతోనే మా తాత రాజారెడ్డిపై బాంబులు వేసి హత్య చేశారు
వైఎస్సార్ ఫ్యాక్షనిస్టు కాదు కాబట్టే.. ఆ హంతకులు ఈ రోజు బయట తిరుగుతున్నారు
వైఎస్సార్ బీసీలకు ఏమీ చేయలేదని బాబు అంటున్నారు
చంద్రబాబూ.. ఫీజుల పథకాన్ని అడుగు.. వైఎస్సార్ బీసీలకు ఎంత చేశారో చెప్తుంది
చంద్రబాబు ఉద్దేశంలో బీసీలంటే ‘బాబు క్లాస్’
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చంపేయాలట.. అంతేకాని చంద్రబాబు మాత్రం అవిశ్వాసం పెట్టరట
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 75, కిలోమీటర్లు: 1,059.2

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాన్నకు ప్రాణం పోయటమే తెలుసు.. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా వెన్నుపోట్లు పొడవడం, అబద్ధాలు చెప్పడం తెలియదు. ప్రాణాలు తీయడం తెలియదు. రాజశేఖరరెడ్డి గారి సొంత తండ్రిని అంటే మా సొంత అబ్బ(తాత) రాజారెడ్డిని ఇదే చంద్రబాబు అండ చూసుకొని ఆయన ప్రోద్బలంతోనే బాంబు దాడి చేసి చంపేశారు. అలాంటి సమయంలో నాన్న దేవుడి మీదనే భారం వేశారు. దేవుడే న్యాయం చేస్తాడు అనుకున్నారు. వైఎస్సార్ ఫ్యాక్షనిస్టు కాదు కాబట్టే అబ్బను హత్య చేసిన వారు ఈ రోజు బహిరంగంగా తిరుగుతున్నారు’’ అని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ సర్కారుతో కుమ్మక్కయిన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కొనసాగింది. కారంపూడి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇంత దిగజారుడు రాజకీయాలా!

వైఎస్సార్ ఫ్యాక్షనిస్టని, ఆయన పరిటాల రవిని చంపించారని, తనను కూడా చంపడానికి పథకం వేశారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే ఆయన గురించి ఏమనుకోవాలో అర్థంకావడం లేదు. అధికారం కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా? వైఎస్సార్ ఎంత మంచి వారో.. ఎంత పెద్ద మనసున్న మనిషో ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు చంద్రబాబుకే అలవాటు. పిల్లనిచ్చిన సొంత మామకే అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపడానికి కత్తులు, గొడ్డలు తీసుకోవాలని చంద్రబాబు ప్రజలకు చెప్తున్నారు. అయ్యా.. చంద్రబాబూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపడం కోసం కత్తులు, గొడ్డళ్లు అక్కర్లేదయ్యా.. మీ దగ్గరే అవిశ్వాసం అనే ఆయుధం ఉంది. దాన్ని ప్రయోగించి మీరు అంటున్నట్టుగానే ఈ చేతగాని ప్రభుత్వాన్ని దించండి. మీరు ఆపని మాత్రం చెయ్యరు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి పనుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపకుండా మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా మీరు రక్షణగా ఉంటారు. ఇది మీ ఇద్దరి మధ్య కుదిరిన చీకటి ఒప్పందం.

బీసీ అంటే చంద్రబాబు దృష్టిలో ‘బాబు క్లాస్’...

వైఎస్సార్ బీసీల కోసం ఏమీ చేయలేదని చంద్రబాబు అంటున్నారు. వైఎస్సార్ బీసీల కోసం ఏం చేశారో ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకం చెప్తుంది. అన్ని పథకాలూ కొద్దిసేపు పక్కన పెడదాం. ఒక్క ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని తీసుకుంటే ఎన్నో లక్షల మంది బీసీ విద్యార్థులు ఈ పథకం కింద పెద్ద చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూస్తే.. వైఎస్ ఏం చేశారో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడుకు తెలిసిన బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు. ఆయన దృష్టిలో ‘బీసీలు అంటే.. బాబు క్లాసు’... అంటే ఆయన మనుషులు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్ లాంటి వాళ్లు. వాళ్లకు వైఎస్సార్ హయాంలో ఏమీ చేయలేదని చంద్రబాబు ఉద్దేశం కావచ్చు. సహకార పరిశ్రమలను చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరులకు పప్పు బెల్లాల కింద అమ్మేసుకున్నారు. నిజాం షుగర్స్ పరిశ్రమను ముక్కలు ముక్కలుగా చేసి తన అనుయాయులకు ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచిన పాలేరు చక్కెర పరిశ్రమలను చంద్రబాబు ఆయన పార్టీకే చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు కారు చౌకగా కట్టబెట్టారు. కోట్ల విలువ చేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును తెలుగుదేశం పార్టీకే చెందిన సీఎం రమేష్‌కు ఇచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్న రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు ధారాదత్తం చేశారు.

అవిశ్వాసం పెట్టకుండా ధర్నాలు.. డ్రామాలు ఎందుకు?

పెంచిన విద్యుత్తు చార్జీలు దించాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ 10 రోజులకు పైగా నిరాహార దీక్ష చేశారు. ఆఖరు రోజున ఆందోళన జరిగితే చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపించారు. ఇప్పుడు అదే చంద్రబాబు పార్టీ కరెంటు చార్జీల మీద ధర్నాలు చేస్తుందట. ఇదే చంద్రబాబు ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు పరిపాలన చేసి 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్లు చేసి మూడు సార్లు కరెంటు చార్జీలు పెంచారు.

ఇక ధర్నాలు... డ్రామాలు ఎందుకు చంద్రబాబు నాయుడూ?’’

మంగళవారం 75వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా చినకొదమగుండ్ల నుంచి ప్రారంభమైంది. పెదకొదమగుండ్ల, కాకానివారిపాలెం, బ్రహ్మనాయుడు కాలనీ, యాపకంపల్లి మీదుగా యాత్ర సాగి కారంపూడికి చేరింది. ఇక్కడ పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. కారంపూడి ఊరు బయట ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.4 కిలోమీటర్లు ఆమె నడిచారు. షర్మిల వెంట నడిచిన నేతల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ రాజ్యం, కావటి మనోహర్‌నాయుడు, పి. గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్ ఉన్నారు.

మీరిచ్చిన తీర్పుకు వందనం..

‘‘ఉప ఎన్నికల సందర్భంగా 9 నెలల కిందట జగనన్న ఇదే కారంపూడిలో ఇదే సెంటర్లో మీ ముందు నిలబడి మాట్లాడారు. ఇక్కడ మీటింగ్ తరువాత సీబీఐ వాళ్లు విచారణ కోసమని జగనన్నను హైదరాబాద్‌కు పిలిచి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. కానీ మీరు జగనన్న నిర్దోషి అని పూర్తిగా నమ్ముతున్నట్టు అదే ఉప ఎన్నికల్లో తీర్పునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డన్నను గొప్ప మెజార్టీతో గెలిపించారు. అందుకు మీకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని షర్మిల కారంపూడి సభలో అన్నారు. నాడు జగన్‌మోహన్‌రెడ్డి సభకు ఎంత మంది వచ్చారో.. మంగళవారం కూడా జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు కట్టుకొని అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు షర్మిల సభకు తరలి వచ్చారు. షర్మిల పాదంలో పాదం వేసి క దం తొక్కారు.
Share this article :

0 comments: